Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవీనా, నిషద్లకు రజతాలు
- వినోద్ కుమార్‌కు కాంస్య పతకం
- ఒకేరోజు భారత్‌కు మూడు మెడల్స్
- 2020 టోక్యో పారాలింపిక్స్
పారా అథ్లెటు మెరిశారు. భారత్ మురిసింది. టోక్యో పారాలింపిక్స్‌లో మనోళ్లు పతకాల పంట పండించారు. ఆదివారం ఒక్క రోజే ఏకంగా మూడు పతకాలు సాధించారు. టేబుల్ టెన్నిస్‌లో రజతంతో భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించగా, నిషద్ కుమార్ హై జంప్‌లో ఆసియా రికార్డుతో సిల్వర్ మెడల్ గెలిచాడు. డిస్కస్ త్రోలో వెటరన్ వినోద్ కుమార్ కాంస్య పతకంతో అదరగొట్టాడు. జాతీయ క్రీడా దినోత్సవం నాడు టోక్యోలో భారత అథ్లెట్లు అద్వితీయ ప్రదర్శన చేయటంతో దేశవ్యాప్తంగా క్రీడాకారులు సంబురాలు చేసుకున్నారు.
నవతెలంగాణ-టోక్యో
పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సూపర్ ప్రదర్శన చేశారు. పతక ఖాతా తెరిచిన రోజే ఏకంగా మూడు మెడల్స్‌తో మెప్పించారు. టోక్యోలో పతక ప్రదర్శనతో స్వదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని మరింత ప్రత్యేకం చేశారు. టేబుల్ టెన్నిస్ క్లాస్ 4 విభాగంలో భవీనాబెన్ పటేల్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. వరల్డ్ నం.1 చైనా అథ్లెట్ జౌ యింగ్‌తో పసిడి పోరులో భవీనా పటేల్ పోరాడి ఓడింది. హై జంప్‌లో (టీ47) 21 ఏండ్ల యువ సంచలనం నిషద్ కుమార్ సంచలన ప్రదర్శన చేశాడు. ఆసియా రికార్డు 2.06 మీటర్లతో పారాలింపిక్స్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. 42 ఏండ్ల వెటరన్ పారా అథ్లెట్ వినోద్ కుమార్ టోక్యోలో అద్భుతమే చేశాడు. ఎఫ్51/52 విభాగంలో వినోద్ కుమార్ ఆసియా రికార్డు నెలకొల్పి కాంస్య పతకం ముద్దాడాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భవీనా పటేల్, వినోద్ కుమార్, నిషద్ కుమార్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరెంద్ర మోడీ, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, భారత పారాలింపిక్స్ కమిటీ అధ్యక్షురాలు దీప మాలిక్‌లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
భవీనాబెన్ నయా చరిత్ర : పారాలింపిక్స్ క్రీడల చరిత్రలో భవీనాబెన్ పటేల్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం అందించింది. క్వార్టర్ఫైనల్లో వరల్డ్ నం.2, రియో గోల్డ్ మెడలిస్ట్‌ను, సెమీఫైనల్లో వరల్డ్ నం.3, రియో సిల్వర్ మెడలిస్ట్‌ను ఓడించి ఊపుమీదున్న భవీనా ఫైనల్లోనూ పసిడి ఫేవరేట్‌గానే కనిపించింది. కానీ వరల్డ్ నం.1 చైనా అథ్లెట్ పసిడి సొంతం చేసుకుంది. తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీపడుతున్న భవీనాబెన్ పటేల్ పసిడి పోరులో ఒత్తిడికి తలొగ్గింది. 7-11, 5-11, 6-11తో వరుస గేముల్లో పసిడి పతకాన్ని కోల్పోయింది. ' రజత పతకం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. పసిడి పోరులో ఒత్తిడికి లోనైనందుకు కాస్త బాధగానూ ఉంది. వంద శాతం ప్రదర్శన చేయలేకపోయాను. రజతంతో సంతృప్తిగా లేకపోయినా.. ఉత్తమ ప్రదర్శనకు ప్రయత్నించాను. పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాను. ఈ మ్యాచ్ నాకు అతి పెద్ద అనుభవాన్ని ఇచ్చింది. ఈ రోజు చేసిన తప్పిదాలను మరోసారి పునరావృతం చేయకుండా చూసుకుంటాను. వచ్చేసారి మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాను' అని భవీనాబెన్ పటేల్ తెలిపింది. పోలియో బారిన భవీనాబెన్ పటేల్ కంప్యూటర్ సైన్స్ అభ్యసించేందుకు అహ్మదాబాద్‌కు రావటంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడటం ఆరంభించిన ఆమె.. ఓ జాతీయ టోర్నీలో పతకం రావటంతో టేబుల్ టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఒలింపిక్స్‌కు ముందు రోబోతో సాధన చేసిన భవీనాబెన్ పటేల్.. టోక్యోలో మరిచిపోలేని ప్రదర్శనతో మెప్పించింది.
వారెవ్వా నిషద్ : సమ్మర్ ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో పతకాల చరిత్ర పెద్దగా లేదు. ఇటీవల నీరజ్ చోప్రా సాధించిన చారిత్ర స్వర్ణ పతకమే అథ్లెటిక్స్‌లో భారత్ సాధించిన తొలి పసిడి పతకం. పారాలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్ ప్రస్థానం అందుకు పూర్తి భిన్నం. అథ్లెటిక్స్‌లో భారత్ పతకాలు నిలకడగా సాధిస్తుంది. జావెలియన్ త్రో, హై జంప్, లాంగ్ జంప్ సహా డిస్కస్ త్రోలో పతకాలు సాధించింది. టోక్యోలోనూ అదే ఒరవడి కొనసాగుతోంది. తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీపడుతున్న యువ అథ్లెట్, 21 ఏండ్ల నిషద్ కుమార్ హై జంప్‌లో రజత పతకం సాధించాడు. హై జంప్ టీ46/47 విభాగంలో నిషద్ రెండో ప్రయత్నంలోనే ఆసియా రికార్డును సమం చేశాడు. 2.06 మీటర్ల ఎత్తు దూకేసి పతకం ఖాయం చేసుకున్నాడు. 2.09 మీటర్లను అధిగమించేందుకు నిషద్ కుమార్ మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. అమెరికా అథ్లెట్ డల్లాస్ వైస్ 2.15 మీటర్లతో పసిడి సాధించగా, నిషద్ కుమార్ రజతం సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత అథ్లెట్ రామ్ పాల్ చాహర్ 1.94 మీటర్లతో ఐదో స్థానంలో నిలిచాడు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నిషద్ కుమార్ రైతు కుటుంబం నేపథ్యం. వ్యవసాయ పొలంలో గడ్డి కట్ చేసే మెషిన్లో పడి నిషద్ కుమార్ కుడి చేతిని కోల్పోయాడు. పాఠశాల స్థాయిలో సాధారణ అథ్లెట్లతో హై జంప్‌లో పోటీపడిన నిషద్ కుమార్ పంచకులలో ప్రొఫెషనల్ అథ్లెట్‌గా రూపు దిద్దుకున్నాడు. పారాలింపిక్స్ ట్రయల్స్‌లో 2.07 మీటర్లను అధిగమించిన నిషద్ టోక్యో టికెట్ ఖాయం చేసుకున్నాడు. రెండు సార్లు కోవిడ్-19 వైరస్ బారిన పడినా.. టోక్యో పారాలింపిక్స్‌కు పట్టుదలగా సన్నద్ధమై సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.
వినోద్ అమోఘం : వినోద్ కుమార్ భారత్‌కు అథ్లెటిక్స్‌లో మరో పతకం అందించాడు. మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్-51/52 విభాగంలో వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. డిస్కస్‌ను 19.91 మీటర్ల దూరం విసిరి ఆసియా రికార్డు నెలకొల్పిన వినోద్ కుమార్ కాంస్య ఖాయం చేసుకున్నాడు. పతక పోరులో తొలి మూడు ప్రయత్నాల్లో 17.46 మీటర్లు, 18.32 మీటర్లు, 17.80 మీటర్లు విసిరాడు. 19.12 మీటర్లతో మెడల్ రేసులోకి అడుగుపెట్టిన వినోద్ కుమార్ 19.12, 19.9, 19.81తో మరింత మెరుగయ్యాడు. 19.91 మీటర్లతో ఆసియా రికార్డుతో పాటు పారాలింపిక్ పతకం సాధించాడు. పొలాండ్ అథ్లెట్ 20.02 మీటర్లతో పసిడి సాధించగా, క్రోయేషియా అథ్లెట్ 19.98 మీటర్లతో సిల్వర్ గెల్చుకున్నాడు. 36 ఏండ్ల వయసులో పారా అథ్లెట్‌గా మారిన వినోద్ కుమార్ 42 ఏండ్ల వయసులో పారాలింపిక్స్ పతకం అందుకున్నాడు. వినోద్ కుమార్‌ది సైనిక కుటుంబ నేపథ్యం. 1971 యుద్ధంలో వినోద్ కుమార్ తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. విద్యానంతరం వినోద్‌కుమార్ సైతం బిఎస్ఎఫ్లో చేరారు. శిక్షణ సమయంలో లేహ్ కొండపై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. పదేండ్ల పాటు బెడ్‌కే పరిమితమైన వినోద్ కుమార్, ఆ సమయంలో తల్లితండులు ఇద్దరినీ కోల్పోయారు. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో పారా స్పోర్ట్స్ గురించి తెలుసుకున్న వినోద్ కుమార్.. రోహతక్‌లో స్థానిక కోచ్‌ల వద్ద డిస్కస్ త్రో శిక్షణ మొదలెట్టాడు. సారు బెంగళూర్‌లో వినోద్ కుమార్‌ను కోచ్ సత్యనారాయణ సానపట్టారు. పారాలింపిక్స్ పతకంతో వినోద్ కుమార్ తన పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నాడు.