Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఇద్దరు అథ్లెట్లదీ ఇంచుమించు ఒకే గాథ. 19 ఏండ్ల అవని లేఖర 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంతో వీల్ చైర్‌కు పరిమితమైంది. తండ్రి ప్రోత్సాహంతో అవని క్రీడలపై ఆసక్తి చూపించింది. ఆరంభంలో అవని ఆర్చరీపై మక్కువ చూపేది. కానీ ఒలింపిక్ పసిడి విజేత, షూటర్ అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ చదివి.. ఆ స్ఫూర్తితో షూటింగ్‌లోకి అడుగుపెట్టింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించిన అవని లేఖర పారాలింపిక్స్‌లో వరల్డ్ నం.5గా తొలిసారి పోటీపడింది. తనకంటే ఎంతో మెరుగైన షూటర్లను వెనక్కి నెట్టి బంగారు పతకం కైవసం చేసుకుంది. 2020 పారాలింపిక్స్‌లో అవని లేఖర మరో మూడు విభాగాల్లో పోటీపడాల్సి ఉంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ (ఎస్‌హెచ్1), మిక్స్డ్ 10 మీ ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్1), మిక్స్డ్ 10 మీ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1) విభాగాల్లో అవని లేఖర బరిలోకి దిగనుంది. బంగారు ఉత్సాహంలో ఉన్న అవని టోక్యోలో మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది.
సుమిత్ తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసేవారు. 2004లోనే తండ్రిని కోల్పోయిన సుమిత్ రెజ్లింగ్ ప్రతిభ కనబరిచేవాడు. 2015 రోడ్డు ప్రమాదంలో సుమిత్ ఎడమ కాలు మోకాలి దిగువ భాగం పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. పుణెలో సుమిత్‌కు కృత్తిమ కాలు అమర్చిన అనంతరం 53 రోజులు పూర్తిగా బెడ్‌కే పరిమితం అయ్యాడు. రెజ్లర్‌గా ముందుకు సాగే అవకాశం లేని సమయంలో.. పారా క్రీడల నుంచి తెలుసుకుని జావెలియన్ త్రోను ఎంచుకున్నాడు. కృత్తిమ కాలు కారణంగా కఠోర సాధన చేసే సమయంలో మోకాలి నుంచి రక్తస్రావం జరిగేది. అయినా, సుమిత్ సాధనను వదలిపెట్టలేదు. ప్రతి రోజు పురోగతి సాధించాలనే తపన సుమిత్లో కనిపించేది. ఆ తపనే పారాలింపిక్స్‌లో మూడు ప్రపంచ రికార్డులు, ఓ పసిడి పతకం సాధించేలా చేసింది.