Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవేంద్ర, యోగేశ్‌లకు రజతాలు
- సుందర్ సింగ్ గుర్జర్‌కు కాంస్యం
నవతెలంగాణ-టోక్యో
2020 పారాలింపిక్స్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. అథ్లెటిక్స్‌లో టీమ్ ఇండియా పతకాలు కొల్లగొట్టింది. జావెలిన్ త్రోలో దిగ్గజ పారా అథ్లెట్ దేవేంద్ర జజారియ, డిస్కస్ త్రోలో యోగేశ్ కతునియలు రజత పతకాలు సాధించారు. దేవేంద్ర జజారియ పోటీపడిన విభాగంలోనే మరో అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జర్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. అవని లేఖర, సుమిత్ పసిడి పతకాలకు తోడు దేవేంద్ర జజారియ, యోగేశ్ కతనియలు రజతాలు సాధించారు. సుందర్ సింగ్ కాంస్యంతో సోమవారం ఒక్కరోజే భారత్ ఏకంగా ఐదు పతకాలు ఖాతాలో వేసుకుంది.
చేజారిన స్వర్ణం : 2004, 2016 పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన దేవేంద్ర జజారియ టోక్యోలోనూ పసిడి ఫేవరేట్‌గా బరిలోకి నిలిచాడు. పసిడి వేటలో భారత దిగ్గజానికి చుక్కెదురైంది. ముచ్చటగా మూడో పసిడిపై కన్నేసిన దేవేంద్ర సిల్వర్‌కు పరిమితం అయ్యాడు. ఫైనల్లో తొలి రెండు ప్రయత్నాల్లో బల్లెమును 60.28, 60.62 మీటర్ల దూరం విసిరిన దేవేంద్ర.. మూడో ప్రయత్నంలో ఉత్తమ ప్రదర్శన చేశాడు. 64.35 మీటర్లతో పతకం ఖాయం చేసుకున్నాడు. చివరి మూడు ప్రయత్నాల్లో రెండు విఫలమవగా, చివరగా 61.23 మీటర్ల దూరమే విసిరాడు. శ్రీలంక అథ్లెట్ హెరాత్ 67.79 మీటర్లతో బంగారు పతకం సాధించాడు. ఇదే విభాగంలో సుందర్ సింగ్ గుర్జర్ 62.26, 60.20, 64.01 మీటర్లతో పతకం సాధించాడు. ఆరు ప్రయత్నాల్లో సుందర్ సింగ్ మూడుసార్లు ఫౌల్ అయ్యాడు. ఐదో ప్రయత్నంలో పతక ప్రదర్శన చేశాడు.
యోగేశ్ అదుర్స్ : డిస్కస్ త్రోలో యోగేశ్ కతునియ అదరగొట్టాడు. మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్56 విభాగంలో పోటీపడిన యోగేశ్.. సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయినా..ఆరో ప్రయత్నంలో పతక ప్రదర్శన చేశాడు. 42.84, 43.55, 44.38 మీటర్ల దూరం సంధించి ఔరా అనిపించాడు. బ్రెజిల్ అథ్లెట్ గోల్డ్ మెడల్ అందుకోగా, క్యూబా అథ్లెట్ కాంస్యం దక్కించుకున్నారు.