Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవని లేఖర, సుమిత్ అంతిల్లకు పసిడి
- ప్రపంచ రికార్డులతో స్వర్ణ పతకం సొంతం
- 2020 టోక్యో పారాలింపిక్స్
లేఖర పసిడి గురితో మెరువగా..భారత అవని మురిసింది. టోక్యో పారాలింపిక్స్‌లో అవని లేఖర సరికొత్త చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత మహిళా పారాలింపియన్‌గా రికార్డు నెలకొల్పింది. తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీపడుతున్న అవని లేఖర ప్రపంచ రికార్డు సమం చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. జావెలియన్ త్రోలో సుమిత్ అంతిల్ చరిత్ర లిఖించాడు. ప్రపంచ రికార్డు త్రోతో పసిడి పతకం అందుకున్నాడు. పారాలింపిక్స్‌లో మురళీకాంత్ (1972), దేవేంద్ర జజారియ (2004, 2016), మరియప్పన్ తంగవేలు (2016) తర్వాత భారత్‌కు పసిడి పతకం అందించిన ఘనత అవని లేఖర, సుమిత్ అంతిల్ దక్కించుకున్నారు.
నవతెలంగాణ-టోక్యో
అద్భుతం, అద్వితీయం, అసమానం, అమోఘం. భారత అథ్లెట్ల వరుస పతకాలతో టోక్యో హౌరెత్తింది. వరుసగా రెండో రోజు టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతక వర్షం కురిపించారు. సోమవారం ఒక్కరోజే భారత్‌కు రెండు బంగారు పతకాలు వచ్చాయి. యువ షూటర్ అవని లేఖర, జావెలియన్ త్రోయర్ సుమిత్ అంతిల్ పారాలింపిక్స్ పసిడి పతకాలు కొల్లగొట్టారు. స్వర్ణ పతకాల సాధనలో అటు అవని, ఇటు సుమిత్‌లు ప్రపంచ రికార్డులు నెలకొల్పటం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగంలో అవని లేఖరి ఫైనల్లో 249.6తో ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి ముద్దాడింది. మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్ 64 విభాగంలో సుమిత్ అంతిల్ బల్లెమును 68.55 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 2020 పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో పసిడి పతకం అందించాడు.
అవని బంగారు గురి : నిజానికి సమ్మర్ ఒలింపిక్స్‌లో భారత్ షూటింగ్‌పై ఎక్కువ పతక ఆశలు పెట్టుకుంది. ఒలింపిక్స్‌లో వరల్డ్ నం.1గా బరిలో నిలిచి మన షూటర్లు పతకాల వేటలో విఫలమవగా.. పారాలింపిక్స్ షూటింగ్లో అంచనాల్లేని బంగారు పతకం వరించింది. 19 ఏండ్ల యువ షూటర్ అవని లేఖర మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (స్టాండింగ్) విభాగంలో భారత్‌కు పసిడి ఆనందం అందించింది. తొలుత అర్హత రౌండ్లో అవని లేఖర సాధారణ ప్రదర్శనే చేసింది. 621.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. పతక పోరులో పారాలింపిక్ చాంపియన్ చైనా షూటర్ జాంగ్, పారా వరల్డ్ చాంపియన్ ఉక్రెయిన్ షూటర్ ఐరినాలు ఫేవరేట్లుగా కనిపించారు. ఫైనల్లో తొలి రెండు రౌండ్లలో 52.00, 51.6 పాయింట్లతో మెరిసిన అవని లేఖర పతక పోరుకు చేరుకుంది. ఇక పసిడి రేసులో అవని అవధుల్లేని ప్రదర్శన చేసింది. వరుస రౌండ్లలో 21.6, 20.8, 21.2, 20.9, 21.2, 20.1, 20.5 పాయింట్లు సాధించింది. 149.6 పాయింట్లతో ప్రపంచ రికార్డు సమం చేసింది. చైనా షూటర్ జాంగ్ 248.9 పాయింట్లతో సిల్వర్ మెడల్ అందుకోగా.. ఉక్రెయిన్ షూటర్ ఐరినా 227.5 పాయింట్లతో కాంస్యంతో సరిపెట్టుకుంది. పసిడి రేసులో పారాలింపిక్, పారా ప్రపంచ చాంపియన్లను చిత్తు చేసిన అవని లేఖర షూటింగ్లో భారత్‌కు తొలి పసిడి పతకం అందించింది. పారాలింపిక్స్‌లో చరిత్రలో మహిళా అథ్లెట్లు దీప మాలిక్, భవీనాబెన్ పటేల్‌లు రజతాలతో చరిత్ర సృష్టించగా... ఏకంగా బంగారు పతకంతో అవని లేఖర అద్భుతమే చేసింది.
సూపర్ సుమిత్ : జావెలియన్ త్రోలో సుమిత్ అంతిల్ అద్భుతం ఆవిష్కరించాడు. మెన్స్ జావెలియన్ త్రో ఎఫ్ 64 విభాగంలో పోటీపడిన సుమిత్ ప్రపంచ రికార్డుతో పాటు పసిడి పతకం సాధించాడు. ఫైనల్లో ఆరు ప్రయత్నాల్లో ఏకంగా మూడుసార్లు ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. తొలి ప్రయత్నంలో బల్లెమును 66.95 మీటర్లు విసిరిన సుమిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రెండో ప్రయత్నంలో బల్లెమును 68.08 మీటర్ల దూరం విసిరి క్షణాల వ్యవధిలో స్వీయ ప్రపంచ రికార్డును తిరగరాశాడు. తర్వాతి ప్రయత్నాల్లో 65.27 మీటర్లు, 66.71 మీటర్లు విసిరిన సుమిత్.. ఐదోసారి ఏకంగా 68.55 మీటర్ల దూరం విసిరాడు. దీంతో మరోసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడమే కాదు పసిడి పతకం ఖాయం చేసుకున్నాడు. 66.29 మీటర్లతో ఆస్ట్రేలియా అథ్లెట్ బురియన్ సిల్వర్, 65.61 మీటర్లతో శ్రీలంక అథ్లెట్ కాంస్యం సాధించారు. ఇదే విభాగంలో పోటీపడిన సందీప్ 62.20 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి స్వల్ప తేడాతో పతకం చేజార్చుకున్నాడు.