Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ దేశవాళీ సీజన్ వేదికలు ఖరారు
నవతెలంగాణ, హైదరాబాద్
2020-21 దేశవాళీ క్రికెట్ సీజన్ ఆతిథ్య నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. కరోనా పరిస్థితుల్లో బయో సెక్యూర్ బబుల్‌లో మ్యాచుల నిర్వహణకు అన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ హైదరాబాద్‌ను బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీల వేదికలను ఖరారు చేస్తూ బీసీసీఐ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్స్, సెమీఫైనల్స్ సహా టైటిల్ పోరుకు కోల్‌కత ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిలువనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ నాకౌట్ సహా ఫైనల్ మ్యాచ్‌కు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. 38 జట్లను ఆరు గ్రూపులుగా విభజించారు. ఐదు ఎలైట్ గ్రూపుల్లో ఆరేసి జట్లు, ఓ ప్లేట్ గ్రూప్‌లో ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. ఐదు రోజుల క్వారంటైన్ అనంతరం దేశవాళీ మ్యాచుల్లో తలపడేందుకు అవకాశం కల్పించారు. రంజీ ట్రోఫీ గ్రూప్ దశ మ్యాచులకు ముంబయి, బెంగళూర్, అహ్మదాబాద్, తిరువనంతపురం, చెన్నైలు వేదికలుగా ఎంపికయ్యాయి. జనవరి 13, 2022 నుంచి రంజీ ట్రోఫీ ఆరంభం కానుండగా.. ఫిబ్రవరి 20 నుంచి నాకౌట్ మ్యాచులు జరుగుతాయి. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ గ్రూప్ దశ మ్యాచులకు లక్నో, గువహటి, బరోడా, ఢిల్లీ, హర్యానా, విజయవాడలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ నవంబర్ 16 నుంచి ఆరంభం అవనుంది.
అజహర్ ఉన్నప్పటికీ..! : దేశవాళీ క్రికెట్ సీజన్ వ్యవహారాల పర్యవేక్షణకు బీసీసీఐ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఈ కమిటీలో ఉన్నారు. అజహర్ దేశవాళీ వర్కింగ్ కమిటీ గ్రూప్‌లో ఉన్నప్పటికీ సొంత రాష్ట్రానికి దేశవాళీ మ్యాచులను తీసుకురావటంలో విఫలమయ్యారు. అంతర్జాతీయ స్టేడియం అందుబాటులో లేని విజయవాడ సైతం దేశవాళీ మ్యాచులను తీసుకెళ్లగా... హైదరాబాద్‌కు మాత్రం మొండిచెయ్యి ఎదురైంది. హెచ్‌సీఏ అంతర్గత కుమ్ములాటలు సైతం ఈ పరిస్థితికి ఓ కారణం. విజరు హజారే ట్రోఫీ ఆతిథ్య వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అజహరుద్దీన్ చొరవ తీసుకుని ప్రయత్నం చేస్తే కనీసం ఆ మ్యాచులైనా హైదరాబాద్‌కు దక్కే అవకాశం ఉంది. లేదంటే, హైదరాబాద్ ప్రస్తావన లేకుండానే 2020-21 దేశవాళీ సీజన్ ముగిసే ప్రమాదం ఉంది.