Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరియప్పన్ తంగవేలు రజత జంప్
- శరద్, సింగ్‌రాజ్‌లకు కాంస్య పతకాలు
- 2020 టోక్యో పారాలింపిక్స్
టోక్యోలో టీమ్ ఇండియా పతక ప్రతాపం కొనసాగుతోంది. హైజంప్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు రాగా, షూటింగ్లో మెడల్ సొంతమైంది. రియో పసిడి హీరో మరియప్పన్ తంగవేలు సిల్వర్ జంప్‌తో మెరువగా.. షూటర్ సింగ్‌రాజ్ అదాన, శరద్ కుమార్‌లు కాంస్య పతకాలతో మెరిశారు. వరుసగా మూడోరోజు పతక జోరుతో పారాలింపిక్స్ చరిత్రలో తొలిసారి టీమ్ ఇండియా రెండెంకల పతకాలు సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-టోక్యో
టోక్యోలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. విశ్వ క్రీడల వేదికపై పతకం కోసం రోజుల తరబడి ఎదురుచూసిన భారత్.. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో నూతన ఒరవడి సృష్టించింది. వరుసగా మూడోరోజు పతకాలు పోటెత్తించింది. ఆదివారం మూడు (ఒకటి వెనక్కి తీసుకున్నారు), సోమవారం ఐదు పతకాలు సాధించిన భారత్.. మంగళవారం మరో మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ రెండెంకల పతకాలను సాధించటం ఇదే తొలిసారి. రియో ఒలింపిక్స్‌లో సాధించిన నాలుగు పతకాల ప్రదర్శనే ఇప్పటివరకు భారత అత్యుత్తమంగానే ఉండేది. టోక్యోలో పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో చరిత్రను తిరగరాశారు. రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో మెరిసిన మరియప్పన్ తంగవేలు టోక్యోలో సిల్వర్‌తో అదరగొట్టాడు. పసిడిపై కన్నేసినా ప్రతికూల వాతావరణంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. తంగవేలు పోటీపడిన మెన్స్ హైజంప్ టీ63 విభాగంలోనే పోటీపడిన మరో అథ్లెట్ శరద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. షూటర్ సింగ్‌రాజ్ అదాన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకానికి గురిపెట్టాడు.
ప్రతికూల వాతావరణంలో... : పురుషుల హైజంప్ టీ63 విభాగంలో భారత్ రియో ప్రదర్శనను పునరావృతం చేసింది. రియో పారాలింపిక్స్‌లో భారత్ ఈ విభాగంలో ఓ పసిడి, కాంస్యం చేజిక్కించుకోగా.. టోక్యోలో రజత, కాంస్య పతకాలు దక్కించుకుంది. ఫైనల్స్‌కు భారత్ నుంచి ముగ్గురు అర్హత సాధించినా.. పతక రేసులో ఇద్దరే నిలిచారు. రియోలో కాంస్యం సాధించిన వరుణ్ సింగ్ భాటి పతక రేసుకు ముందే నిష్క్రమించాడు. పసిడి రేసులో తొలుత 1.80 మీటర్లు, 1.83 మీటర్లను తొలి ప్రయత్నంలోనే అధిగమించిన మరియప్పన్ తంగవేలు.. 1.86 మీటర్లను తొలి రెండు సార్లు అధిగమించలేదు. మూడో ప్రయత్నంలో విజయవంతంగా 1.86 మీటర్లను దూకేశాడు. అమెరికా అథ్లెట్ సైతం మూడో ప్రయత్నంలోనే 1.86 మీటర్లను దాటడంతో పసిడి కోసం 1.88 మీటర్ల ఎత్తును పెంచారు. ఈసారి తంగవేలు మూడు ప్రయత్నాల్లోనూ 1.86 మీటర్లను దాటలేకపోయాడు. మూడోసారి దాదాపుగా క్లియర్ చేసినట్టే అనిపించినా విఫలమయ్యాడు. అమెరికా అథ్లెట్ శామ్ గ్రూవె చివరి ప్రయత్నంలో 1.86 మీటర్లను క్లియర్ చేసి పసిడి సొంతం చేసుకున్నాడు. ప్రపంచ రికార్డు కోసం శామ్ 1.90 మీటర్లను ప్రయత్నించి విఫలమయ్యాడు. 1.73 మీటర్లు, 1.80 మీటర్లు, 1.83 మీటర్లను తొలి ప్రయత్నంలోనే సులువుగా దూకేసిన శరద్ కుమార్.. 1.86 మీటర్ల వద్ద విఫలమై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
అదాన కాంస్య గురి : షూటింగ్లో భారత్ పతక గురి అదిరింది. సోమవారం అవని లేఖర పసిడి పతకంతో చరిత్ర సృష్టించగా..మంగళవారం మెన్స్ విభాగంలో మరో షూటింగ్ మెడల్ వశమైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఎస్‌హెచ్1) విభాగంలో పోటీపడిన సింగ్‌రాజ్ అదాన కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఫైనల్లో తొలి రెండు రౌండ్లలో 50.3, 49.3 పాయింట్లు సాధించిన సింగ్‌రాజ్ పతక రేసుకు దూసుకెళ్లాడు. మెడల్ షూటింగ్ రౌండ్లో వరుసగా 20.0, 19.1, 19.1, 20.3, 18.7, 20.0 స్కోరు సాధించాడు. 19.1, 19.1, 18.7 స్కోర్లతో పసిడి పోరుకు దూరమైన సింగ్‌రాజ్ కాంస్య పతకం అందుకున్నాడు. పసిడి కోసం ఇద్దరు చైనా షూటర్లు పోటీపడ్డారు. 237.9 పారాలింపిక్ రికార్డుతో పసిడి యాంగ్ చో వశమవగా.. 237.5తో రజతం హువాంగ్ జింగ్ సొంతమైంది. సింగ్‌రాజ్ అదాన 216.8 స్కోరుతో కాంస్యం ముద్దాడాడు.
పోరాడినా..! : మంగళవారం ఇతర క్రీడాంశాల్లోనూ భారత అథ్లెట్లు మెడల్ రేసులో నిలిచినా.. పతకం తృటిలో చేజార్చుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఎస్‌హెచ్1) విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్న షూటర్ రూబినా ఫ్రాన్సిస్ పతకానికి తృటిలో దూరమైంది. మెడల్ రేసుకు ముందే రూబినా పోటీ నుంచి నిష్క్రమించింది. ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత పోరాటానికి తెరపడింది. మెన్స్ కాంపౌండ్ విభాగం క్వార్టర్ఫైనల్లో రాకేష్ కుమార్ చైనా ఆర్చర్ చేతిలో పరాజయం పాలయ్యాడు. టేబుల్ టెన్నిస్ క్లాస్ 4 మహిళల జట్టు విభాగం క్వార్టర్స్‌లో భారత్ పోరాడి ఓడింది. 3-0 విజయంతో చైనా సెమీఫైనల్లోకి చేరుకుంది. మహిళల షాట్‌పుట్ ఎఫ్34 విభాగంలో ఫైనల్స్‌కు చేరిన భాగ్యశ్రీ జాదవ్ మెడల్ రేసుకు ముందే నిష్క్రమించింది.
' పసిడితో పాటు ప్రపంచ రికార్డు సాధించేవాడిని. ఆ లక్ష్యంతోనే టోక్యోకు వచ్చాను. వర్షం అందుకు అంతరాయం కలిగించింది. ఆరంభంలో చిరుజల్లులే ఉన్నాయి. 1.80 మీటర్ల తర్వాత వర్షం ఎక్కువైంది. నా కుడి కాలు షూ సాక్స్ తడిసిపోయింది. తడి సాక్స్‌తో జంప్ కష్టమైంది. రియోలో వాతావరణం బాగున్నది, స్వర్ణం సాధించాను. 2024 పారిస్‌లో పసిడి, ప్రపంచ రికార్డు సాధిస్తాను'
- మరియప్పన్ తంగవేలు
'ఫైనల్‌కు ముందు నా కాలుకు గాయమైంది. పోటీ నుంచి తప్పుకుందామని అనుకున్నాను. ఆ విషయం ఇంట్లో వాళ్లకు చెబితే పోటీలో నిలువమని చెప్పారు. భగవద్గీత చదవమని చెప్పారు. నేను చేయగలిగే దానిపై దృష్టి నిలుపమని, నియంత్రణలో లేని అంశాలపై ఆందోళన వద్దని సూచించారు. మెడల్ సాధించటం సంతోషంగా ఉంది'
- శరద్ కుమార్