Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్గాన్ మహిళా క్రికెటర్ ఆవేదన
న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు అధికారంలో రావటంతో మహిళల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కెనడాకు శరణార్థికి తరలిపోయిన అఫ్గాన్ మహిళా క్రికెటర్ రోయా షమీమ్ తమ ఆవేదనను ఇలా వెలిబుచ్చింది. 'కాబూల్‌లోకి తాలిబన్లు ప్రవేశించగానే ఐసీసీకి ఈమెయిల్ పంపించాం. అక్కడ్నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అసలు మేము (అఫ్గాన్ మహిళా క్రికెటర్లు) ఉన్నామనే విషయాన్ని సైతం ఐసీసీ గుర్తించటం లేదు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు 'వేచి చూద్దాం' అంటోంది. అఫ్గాన్‌లోనే ఉన్న ఇతర మహిళా క్రికెటర్లు ఇండ్లకే పరిమితమయ్యారు. అడుగు బయట వేసేందుకు భయపడుతున్నారు. అఫ్గానిస్థాన్‌ను విడిచి రావటం నా జీవితంలో అత్యంత విషాదకర రోజు. ఇప్పుడు గుర్తుచేసుకున్నా కన్నీళ్లు ఆగవు. నా ఉద్యోగం, క్రికెట్, జట్టు సహచరులు, సొంతూరు, బంధువులు, ఇలా అన్నీ వదిలేసి కెనడాకు వచ్చేశాను. తాలిబన్లు మహిళలు చదువుకుంటేనే అంగీకరించరు, ఇక మహిళలు క్రికెట్ ఆడుతామంటే ఎలా సమ్మతిస్తారు?' అని అఫ్గాన్ మహిళా క్రికెటర్ షమీమ్ ఆవేదనతో చెప్పింది. తన ఇద్దరు సోదరీమణులు (అఫ్గాన్ జట్టులో క్రికెటర్లు)తో కలిసి షమీమ్ కెనడాలో శరణార్థిగా ఉంటోంది.