Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అథ్లెట్లకు రెజ్లింగ్ సమాఖ్య హుకుం
న్యూఢిల్లీ : ప్రయివేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న అథ్లెట్లు అందుకు సంబంధించిన పత్రాలను సమర్పిస్తేనే.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు అనుమతిస్తామని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ప్రకటించాడు. ప్రయివేటు స్పోర్ట్స్ స్పాన్సర్లు జెఎస్డబ్ల్యూ, ఓజీక్యూలతో భారత రెజ్లింగ్ సమాఖ్యకు కొంత కాలంగా పొసగటం లేదు. పతకాలు సాధించడానికి సిద్ధంగా ఉన్న అథ్లెట్లకు వాళ్ల స్పాన్సర్షిప్ అవసరం ఏముంటుంది? ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుందని ఇటీవల బ్రిజ్ భూషణ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 'ప్రయివేటు స్పాన్సర్లు కలిగిన అథ్లెట్లు అందరి నుంచీ డిక్లరేషన్ తీసుకున్నాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, టాటా కంపెనీలు రెజ్లింగ్ సమాఖ్యకు స్పాన్పర్ చేస్తున్నారు. రెజ్లింగ్ సమాఖ్య అథ్లెట్లకు తోడ్పడుతున్న తరహాలోనే ఇతర స్పాన్సర్లు వ్యవహరించాలని మా ఉద్దేశం. టాప్స్ పథకానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. విదేశీ శిక్షణ శిబిరాలు, ఇతర ట్రైనింగ్ సంబంధిత అంశాలపై అథ్లెట్లు నేరుగా క్రీడా శాఖకు ప్రతిపాదనలు పంపటం కాకుండా.. రెజ్లింగ్ సమాఖ్య నుంచి ప్రతిపాదనలు వెళ్లాలి. అదే మేము కోరుకుంటున్నాం' అని రెజ్లింగ్ సమాఖ్య కార్యదర్శి సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు.