Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 36 బంతుల్లో 57 పరుగులు
- కోహ్లి అర్ధసెంచరీ
- భారత్ తొలి ఇన్నింగ్స్ 191 ఆలౌట్
లండన్: శార్దూల్, కోహ్లి అర్ధసెంచరీలతో చెలరేగడంతో టీమిండియా గౌరవప్రద స్కోర్ చేయగల్గింది. టీమిండియా ఓ దశలో 127 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ విధ్వంస ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు చేసింది. అంతకుముందు టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ లంచ్ విరామానికి 39 పరుగులకే 3 వికెట్లు, ఆ తర్వాత టీ విరామానికి 6 వికెట్లు నష్టపోయి 122 పరుగులే చేయగల్గింది. జట్టు స్కోర్ 28 పరుగుల వరకు వికెట్ కోల్పోని టీమిండియా.. అదే స్కోర్ వద్ద ఓపెనర్లు ఇద్దరినీ చేజార్చుకుంది. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్(17), రోహిత్ శర్మ(11) జట్టు స్కోర్ 28 పరుగులవద్దే పెవీలియన్‌కు చేరారు. కేఎల్ రాహుల్ వికెట్‌ను రాబిన్సన్ చేజిక్కించుకోగా.. రోహిత్‌ను వోక్స్ ఔట్ చేశాడు. ఇక టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర పుజారా(4) కూడా నిరాశపర్చడంతో లంచ్ విరామం లోపే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత జడేజా(10) ప్రమోట్‌పై ముందుగా బ్యాటింగ్‌కు వచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి వ్యక్తిగత స్కోర్ 22 పరుగుల వద్ద జీవనదానం లభించినా.. ఆ తర్వాత అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే రాబిన్సన్ వేసిన ఓ గుండ్లెంగ్త్ బంతికి ఔటయ్యాడు. ఉప సారథి రహానే(14) కూడా తక్కువ స్కోర్‌కే పెవీలియన్‌కు చేరడంతో టీమిండియా టీ విరామ సమయానికి 6 వికెట్లు కోల్పోయి కేవలం 122 పరుగులు మాత్రమే చేయగల్గింది. అనంతరం పంత్(9) నిరాశపర్చడంతో 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆ దశలో శార్దూల్ కేవలం 31 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు సాయంతో 50 పరుగులు చేసాడు. యాదవ్-శార్దూల్ 40 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ దశలో శార్దూల్(57)ను వోక్స్ ఔట్ చేయడం, బుమ్రా, యాదవ్‌కు వెంట వెంటనే ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ 191 పరుగులవద్ద ముగిసింది. రాబిన్సన్, వోక్స్‌కు నాలుగు, రాబిన్సన్కు మూడు, ఓవర్టన్, ఆండర్సన్‌కు తలా ఒక వికెట్ దక్కాయి.
ఇరుజట్లలో మార్పులు..
నాల్గో టెస్ట్‌లో భారత్-ఇంగ్లండ్ జట్లు ఆటగాళ్ల మార్పులకు తెరలేపాయి. ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో ఇషాంత్, మహ్మద్ షమి బెంచ్‌కే పరిమితమయ్యారు. ఇక సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులోకి వస్తాడని ఆశించినా.. ప్రయోజనం లేకపోయింది. జట్టు మేనేజ్మెంట్. మరోసారి జడేజావైపే మొగ్గడంతో అశ్విన్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఇంగ్లండ్ జట్టు వికెట్ కీపర్ బట్లర్ స్థానంలో ఓలీ పోప్ తుదిజట్టులో చోటు దక్కింది. మొయిన్ అలీ వైస్ కెప్టెన్సీ అందుకోగా.. సీనియర్ సీమర్ ఆండర్సన్‌కు ఇంగ్లండ్ క్రికెట్‌బోర్డు విశ్రాంతినివ్వలేదు.
కోహ్లి మరో రికార్డు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన నాల్గో టెస్ట్ తొలిరోజు ఆటలో కోహ్లి ఈ రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో కలిపి తక్కువ మ్యాచుల్లోనే 23వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా ఆ రికార్డును సాధించాడు. దీంతో సచిన్(భారత్), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)లను కోహ్లి వెనక్కి నెట్టాడు. కోహ్లి 490 మ్యాచుల్లోనే 23వేల పరుగులు పూర్తి చేయగా.. టెండూల్కర్(522 మ్యాచ్‌లు), పాంటింగ్(544), కల్లిస్(551), సంగక్కర(568), ద్రావిడ్(576), జయవర్ధనే(645) ఇంతకుముందు ఆ ఫీట్లను అందుకున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాత్రం టెండూల్కర్ 34,357పరుగులు 664 మ్యాచులు, 100 సెంచరీలు, 164 అర్ధసెంచరీలు పేరిట ఇప్పటికీ పదిలంగా ఉంది. రెండో స్థానంలో సంగక్కర 28,016పరుగులు, పాంటింగ్ 27,483 పరుగులు ముందంజలో ఉన్నారు.
స్కోర్‌బోర్డు..
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి)బెయిర్‌స్టో (బి)వోక్స్ 11, కేఎల్ రాహుల్ (ఎల్బి) రాబిన్సన్ 17, పుజరా (సి)బెయిర్‌స్టో (బి)ఆండర్సన్ 4, కోహ్లి (సి)బెయిర్‌స్టో (బి)రాబిన్సన్ 50, జడేజా (సి)రూట్ (బి)వోక్స్ 10, రహానే (సి)మొయిన్ (బి)ఓవర్టన్ 14, పంత్ (సి)మొయిన్ (బి)వోక్స్ 9, శార్దూల్ (ఎల్బి) వోక్స్ 57, ఉమేశ్ (సి)బెయిర్‌స్టో (బి)రాబిన్సన్ 10, బుమ్రా (రనౌట్) బర్న్స్ 0, సిరాజ్ (నాటౌట్) 1, అదనం 8. (61.3 ఓవర్లలో ఆలౌట్) 191 పరుగులు.
వికెట్ల పతనం: 1/28, 2/28, 3/39, 4/69, 5/105, 6/117, 7/127, 8/190, 9/190, 10/191
బౌలింగ్: ఆండర్సన్ 14-3-41-1, రాబిన్సన్ 17.3-9-38-3, వోక్స్ 15-6-55-4, ఓవర్టన్ 15-2-49-1.