Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఇంగ్లాండ్ పరం
- రాణించిన ఒలీ పోప్, బెయిర్‌స్టో, వోక్స్
- భారత్, ఇంగ్లాండ్ నాల్గో టెస్టు రెండో రోజు
నవతెలంగాణ-లండన్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్. 24.3 ఓవర్లలో ఇంగ్లాండ్ స్కోరు 62/5. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా పెవిలియన్‌కు చేరుకోగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం భారత్‌కు లాంఛనమే అనిపించింది. అందుకు తగినట్టే మైదానంలోనూ కోహ్లిసేన రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ది ఓవల్ మైదానంలో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆశలపై ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ నీళ్లు చల్లింది. ఒలీ పోప్ (81, 159 బంతుల్లో 6 ఫోర్లు), జానీ బెయిర్ స్టో (37, 77 బంతుల్లో 7 ఫోర్లు), మోయిన్ అలీ (35, 71 బంతుల్లో 7 ఫోర్లు) సహా క్రిస్ వోక్స్ (50, 60 బంతుల్లో 11 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ లోటు ప్రమాదం నుంచి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లారు. ఉమేశ్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రాలు నిప్పులు చెరిగినా.. ఇంగ్లాండ్ తోకను కత్తిరించలేకపోయారు. 84 ఓవర్లలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులే చేయగా.. 99 పరుగుల విలువైన ఆధిక్యం సొంతం చేసుకుంది.
పోప్ జోరు : ఓవల్‌లో ఆతిథ్య జట్టును ఒలీ పోప్ ఆదుకున్నాడు. 159 బంతుల్లో ఆరు బౌండరీలు సాధించిన ఒలీ పోప్ ఇంగ్లాండ్‌ను కష్టాల కడలి నుంచి గట్టెక్కించాడు. జానీ బెయిర్‌స్టోతో కలిసి 89 పరుగులు జోడించిన పోప్.. మోయిన్ అలీతో కలిసి మరో 71 పరుగులు జత చేశాడు. ఒలీ పోప్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో విశేషంగా ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు వీరోచితంగా బంతులేసినా.. సావధానంగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో క్రిస్ వోక్స్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు బాదిన వోక్స్ ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని వంద పరుగులకు చేరువ చేశాడు. లోయర్ ఆర్డర్లో పోప్, బెయిర్‌స్టో, అలీ, వోక్స్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల విలువైన ఆధిక్యం సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (3/76), జశ్‌ప్రీత్ బుమ్రా (2/67), రవీంద్ర జడేజా (2/36) వికెట్లు పడగొట్టారు. శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 191/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : బర్న్స్ (బి) బుమ్రా 5, హమీద్ (సి) పంత్ (బి) బుమ్రా 0, మలాన్ (సి) రోహిత్ (బి) ఉమేశ్ 31, రూట్ (బి) ఉమేశ్ 21, ఓవర్టన్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 1, పోప్ (బి) శార్దుల్ 81, బెయిర్‌స్టో (ఎల్బీ) సిరాజ్ 37, అలీ (సి) రోహిత్ (బి) జడేజా 35, వోక్స్ రనౌట్ 50, రాబిన్సన్ (బి) జడేజా 5, అండర్సన్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 23, మొత్తం : (84 ఓవర్లలో ఆలౌట్) 290.
వికెట్ల పతనం : 1-5, 2-6, 3-52, 4-53, 5-62, 6-151, 7-222, 8-250, 9-255, 10-290.
బౌలింగ్ : ఉమేశ్ 19-2-76-3, బుమ్రా 21-6-67-2, శార్దుల్ 15-2-54-1, సిరాజ్ 12-4-42-1, జడేజా 17-1-36-2.