Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైజంప్‌లో ప్రవీణ్‌కు రజతం
- అవని లేఖర గురికి మరో మెడల్
- ఆర్చరీలో హర్విందర్‌కు కాంస్యం
- 2020 టోక్యో పారాలింపిక్స్
పుట్టుకతోనే ఓ కాలు చిన్నది. క్రీడలపై మక్కువ ఉన్నప్పటికీ వైకల్యంతో సాధారణ పోటీల్లో తలపడలేని స్థితి. వాలీబాల్‌పై ఇష్టాన్ని వదులుకుని పారా హైజంప్లోకి ప్రవేశించాడు. 17 ఏండ్లకే అంతర్జాతీయ యవనికపై భారత్ గర్వపడే ప్రదర్శన చేశాడు. అతడే యువ పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్. హైజంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించి రికార్డు సృష్టించాడు. గోల్డెన్ షుటర్ అవని లేఖర, ఆర్చరీలో హర్విందర్ సింగ్ కాంస్య పతకం సాధించటంతో టోక్యోలో భారత్ పతకాల సంఖ్య 13కు చేరుకుంది. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. పారాలింపిక్స్ చరిత్రలోనే ఒకే టోర్నీలో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా అవని లేఖర చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖర ఇప్పటికే పసిడి సాధించింది.
నవతెలంగాణ-టోక్యో
పారాలింపిక్స్‌లో భారత్ పతక జోరుకు ఓ రోజు విరామం లభించినా.. టోక్యోలో టీమ్ ఇండియా మెరుపులకు అడ్డుకట్ట పడలేదు. శుక్రవారం భారత అథ్లెట్లు మరో రెండు పతకాలు సాధించి పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యంత ఘనమైన ప్రదర్శన చేశారు. హైజంప్‌లో ప్రవీణ్ కుమార్ రజత జంప్‌తో మెప్పించాడు. పురుషుల హైజంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ సంచలన ప్రదర్శనతో భారత్‌కు మరో సిల్వర్ మెడల్ తీసుకొచ్చాడు. పసిడి రేసులో ఆశలు రేపిన ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల జంప్‌తో చరిత్ర సృష్టించాడు. ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించగా.. షుటింగ్‌లో అవని లేఖర అద్భుతం చేసింది. ఓ పారాలింపిక్స్ ఈవెంట్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ (ఎస్‌హెచ్1) విభాగంలో అవని లేఖర కాంస్య పతకం సొంతం చేసుకుంది. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో హర్విందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక పోరులో ఉత్కంఠ విజయంతో దక్షిణ కొరియా ఆర్చర్‌ను చిత్తు చేసి పతకంతో స్వదేశానికి వస్తున్నాడు. ప్రవీణ్ రజతం, లేఖర, హర్విందర్ల కాంస్యంతో భారత్ పతకాలు 13కు చేరుకున్నాయి. రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి.
అనుకోకుండా హీరో! : ' 2.10 మీటర్ల ఎత్తు దూకటంలో రెండో ప్రయత్నంలో నాపై ఒత్తిడి ఉంది. కానీ మూడో ప్రయత్నంలో ఎటువంటి ఆందోళనకు లోనవలేదు.ఇది నేను క్లియర్ చేయాలనే నమ్మకం, స్వేచ్ఛగా జంప్ చేశాను. 1.97 మీటర్ల ఎత్తుకు ముందు నా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంది. పతకంపై నాకు అంచనాలు లేవు. కానీ 2.01 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన అనంతరం, నా ఆత్మవిశ్వాసం పెంపొందింది. నేను టాప్-3లో ఉన్నాననే విషయం అర్థమైంది. మెడల్ పోడియంపై నేను ఉంటాననే విషయాన్ని నేను ఎప్పుడూ అనుకోలేదు. పాఠశాలలో వాలీబాల్ ఆడుతూ హైజంప్ గురించి, పారా క్రీడల గురించి తెలుసుకున్నాను. పారాలింపిక్స్‌లో పోటీపడేందుకు ఏం చేయాలనే విషయంపై గూగుల్ శోధన చేశాను. పాఠశాల జీవితం పూర్తిగా క్రీడలకు అంకితమైంది. నేను హైజంప్‌లో మంచి ప్రదర్శన చేసే కొద్ది ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు నన్ను ప్రోత్సహించటం మొదలుపెట్టారు. నేను పురోగతి సాధించటంతో వారి ప్రోత్సాహం సైతం పెరిగింది. జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించగానే నన్ను అందరూ విశ్వసించారు' అని ప్రవీణ్ కుమార్ ఆనందంతో అన్నాడు.
హైజంప్ టీ64 విభాగంలో ప్రవీణ్ కుమార్ నమ్మశక్యం కాని ప్రదర్శన చేశాడు. ఫైనల్లో ప్రవీణ్ కుమార్ వరుస ప్రయత్నాల్లో అలవోకగా మెడల్ అందుకున్నాడు. 1.83 మీటర్లు, 1.93 మీటర్లు, 1.97 మీటర్లు, 2.01 మీటర్లు, 2.04 మీటర్లను తొలి ప్రయత్నంలోనే దూకేసిన ప్రవీణ్ కుమార్.. 2.07 మీటర్ల ఎత్తును రెండో ప్రయత్నంలో సాధించాడు. 2.10 మీటర్లను మూడు ప్రయత్నాల్లోనూ అధిగమించలేకపోయాడు. మూడో ప్రయత్నంలో 2.10 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన బ్రిటన్ అథ్లెట్ పసిడి పతకం సాధించాడు. పొలాండ్ అథ్లెట్ 2.04 మీటర్లతో కాంస్య పతకం దక్కించుకున్నాడు.
అవని చరిత్ర : 2016 రియో పారాలింపిక్స్‌లో దీప మాలిక్ రజత పతకం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారత పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఐదేండ్ల అనంతరం టోక్యోలో ఇద్దరు మహిళా అథ్లెట్లు ఇప్పటికే సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. యువ షుటర్ అవని లేఖర మరో అడుగు ముందుకేసింది. భారత పారాలింపిక్స్ చరిత్రలో ఎవరికీ సాధ్యపడని రికార్డును సొంతం చేసుకుంది. ఒకే పారాలింపిక్స్ ఈవెంట్లో ఏకంగా రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా నయా చరిత్ర లిఖించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ (ఎస్‌హెచ్1) విభాగంలో 445.9 పాయింట్లతో అవని లేఖర కాంస్య పతకం సాధించింది. అర్హత రౌండ్లో 621.7 పాయింట్లతో అవని లేఖర ఏడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్లో అవని లేఖర పది పాయింట్లు ప్లస్ స్కోర్లతో మెరిసింది. అయినా, నాలుగు రౌండ్లలో అవని గురి కాస్త తప్పటంతో కాంస్యానికి పరిమితం కావాల్సి వచ్చింది. చైనా షుటర్ జాంగ్ 457.9 పాయింట్లతో పసిడి, జర్మనీ అమ్మాయి 457.1 పాయింట్లతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. ' ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ప్రపంచ అత్యున్నత శిఖరంపై ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ సంతోషాన్ని ఏ విధంగా వర్ణించాలో సైతం అర్థం కావటం లేదు. భారత్‌కు రెండు పతకాలు అందించటం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా మరెన్నో పతకాలు వస్తాయని ఆశిస్తున్నాను. మెడల్ రేసులో ఎప్పుడూ స్కోరు గురించి ఆలోచన లేదు. ప్రతి షాట్ పర్ఫెక్ట్గా చేయటంపైనే దృష్టి పెట్టాను. మెడల్‌పై పెద్దగా ఆలోచన పెట్టలేదు' అని అవని లేఖర తెలిపింది.
హర్విందర్ అదుర్స్ : ఆర్చరీలోనూ షుటింగ్ ఫలితం పునరావృతమైంది. సమ్మర్ ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్ పతకాలు ఆశించింది. వరల్డ్ నం.1గా మన ఆర్చర్లు బరిలో నిలువటంతో పతక ఆశలు బలంగా ఉన్నాయి. కానీ ఆర్చర్లు అంచనాలు అందుకోలేదు. షుటింగ్లోనూ అదే జరిగింది. పారాలింపిక్స్‌లో అటు షుటర్లు, ఇటు ఆర్చర్లపై మెడల్ ఆశలు లేవు. అయినా, ఈ రెండు విభాగాల్లో భారత్ పతకాలు కొల్లగొట్టింది. ఆర్చర్ హర్విందర్ సింగ్ ఆర్చరీలో తొలి పతకం పట్టుకొట్టాడు. పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో హర్విందర్ సింగ్ కాంస్య పతకం గురిపెట్టాడు. దక్షిణ కొరియా ఆర్చర్లు ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లకు చెక్ పెట్టగా.. పారాలింపిక్స్‌లో హర్విందర్ సింగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు!. కాంస్య పతక ప్లే ఆఫ్స్‌లో దక్షిణ కొరియా ఆర్చర్ కిమ్ మిన్ సుపై షుటౌట్లో గెలిచాడు. ఐదు రౌండ్లు ముగిసే సమయానికి ఇద్దరు 5-5తో సమవుజ్జీలుగా నిలిచారు. దీంతో షుటౌట్లో హర్విందర్ పర్ఫెక్ట్ 10 స్కోరు చేశాడు. కొరియా ఆర్చర్ 8 మాత్రమే స్కోరు చేశాడు. దీంతో 6-5తో కాంస్య పతకం హర్విందర్ సొంతమైంది. అంతకముందు సెమీఫైనల్లో అమెరికా ఆర్చర్ చేతిలో హర్విందర్ పరాజయం పాలయ్యాడు. 4-6తో పసిడి పోరుకు చేరుకునే అవకాశం చేజార్చుకున్నాడు. 30 ఏండ్ల హర్విందర్ సింగ్ శుక్రవారం ఉత్సాహంతో విల్లు ఎక్కుపెట్టాడు. ఇటలీ ఆర్చర్‌పై 6-5తో విజయం, రష్యన్ ఆర్చర్‌పై ఎదురులేని విజయంతో మెరిశాడు. జర్మనీ ఆర్చర్‌ను 6-2తో ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పసిడి రేసులో ఫేవరేట్‌గా కనిపించిన హర్విందర్ సింగ్.. ప్లే ఆఫ్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించాడు.