Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుజారా అర్థ సెంచరీ
- భారీ ఆధిక్యంపై భారత్ గురి
- ఇంగ్లాండ్‌తో నాల్గో టెస్టు మూడోరోజు
నవతెలంగాణ-లండన్
హిట్‌మ్యాన్ ఇరగదీశాడు. ఓవల్‌లో అదిరిపోయే శతకంతో విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్ పట్టిన భారత్‌ను భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్లాడు. 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగిన రోహిత్ శర్మ (127, 256 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) పటౌడీ ట్రోఫీలో శతకనాదంతో గర్జించాడు. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 153 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించిన రోహిత్ శర్మ.. భారత్‌ను ముందంజలో నిలిపాడు. ఓపెనర్ కెఎల్ రాహుల్ (46, 101 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా.. చతేశ్వర్ పుజార (61, 127 బంతుల్లో 9 ఫోర్లు) బాధ్యతాయుత అర్థ సెంచరీతో కదం తొక్కాడు. రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజార భాగస్వామ్యంతో ఓవల్‌లో టీమ్ ఇండియా తిరిగి పైచేయి సాధించే స్థితికి చేరుకుంది!.
హిట్‌మ్యాన్ షో : భారీ తొలి ఇన్నింగ్స్ లోటు, కొత్త బంతిపై వికెట్లు నిలుపుకోవాలనే ఒత్తిడిని ఎదురొడ్డిన ఓపెనర్లు భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌లో అదిరే ఆరంభం అందించారు. కెఎల్ రాహుల్ (46), రోహిత్ శర్మ (127)లు తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన రాహుల్ అర్థ సెంచరీకి చేరువలో ఉండగా.. అండర్సన్‌కు వికెట్ కోల్పోయాడు. రాహుల్ పెవిలియన్‌కు చేరినా.. భారత్ జోరు తగ్గలేదు. నయా వాల్ పుజారతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను కొత్త పుంతలు తొక్కించాడు. ఐదు ఫోర్లతో 145 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ.. 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 204 బంతుల్లో మూడెంకల స్కోరు అందుకున్నాడు. సిరీస్ ఆరంభం నుంచి మంచి టచ్‌లో ఉన్న రోహిత్.. భారీ స్కోరు ఇక్కడే అందుకున్నాడు. రోహిత్‌కు పుజార తోడవటంతో భారత్ ఇన్నింగ్స్ లోటును దాటేసి.. ఆధిక్యం దిశగా వడివడిగా అడుగులు వేసింది. పుజారా ఎనిమిది ఫోర్లతో 103 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఈ దశలో ఇన్నింగ్స్ వేగం ఊపందుకుంటుండగా.. రాబిన్సన్ దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో రోహిత్ శర్మ, పుజారలను పెవిలియన్ చేర్చి భారత్ జోరును నిలువరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 86 ఓవర్ల ఆట ముగిసే సమయానికి భారత్ 246/3తో ఆడుతోంది. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు అజేయంగా ఆడుతున్నారు. ఇంగ్లాండ్ పేసర్లలో జేమ్స్ అండర్సన్ ఓ వికెట్ పడగొట్టగా.. ఒలీ రాబిన్సన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 191/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 290/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) క్రిస్ వోక్స్ (బి) రాబిన్సన్ 127, కెఎల్ రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) జేమ్స్ అండర్సన్ 46, చతేశ్వర్ పుజారా (సి) మోయిన్ అలీ (బి) రాబిన్సన్ 61, విరాట్ కోహ్లి బ్యాటింగ్ 5, రవీంద్ర జడేజా బ్యాటింగ్ 5, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం :(86 ఓవర్లలో 3 వికెట్లకు) 246.
వికెట్ల పతనం : 1-83, 2-236, 3-237.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 21-7-41-1, ఒలీ రాబిన్సన్ 19-3-59-2, క్రిస్ వోక్స్ 19-5-43-0, క్రెయిగ్ ఓవర్టన్ 10-0-38-0, మోయిన్ అలీ 14-0-58-0, జో రూట్ 3-0-7-0.