Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్, షుటింగ్‌లో పసిడి, కాంస్యాలు
- షట్లర్ ప్రమోద్ పసిడి విజయం
- షుటింగ్‌లో మనీశ్ నర్వాల్ స్వర్ణ గురి
- సింగ్‌రాజ్ అదానకు మరో మెడల్
టోక్యోలో మన షటిల్ స్మాష్ అదిరింది. పారా అగ్ర షట్లర్ ప్రమోద్ భగత్ చరిత్ర సృష్టించాడు. పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి బ్యాడ్మింటన్ పతకం సాధించాడు. మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3 విభాగంలో వరల్డ్ నం.1 ప్రమోద్ భగత్ పసిడి సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో మనోజ్ సర్కార్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఇక షుటింగ్‌లో భారత్‌కు డబుల్ ధమాకా. మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో మనీశ్ నర్వాల్ పసిడి సాధించగా, సింగ్‌రాజ్ అదాన సిల్వర్ మెడల్ గురి పెట్టాడు. శనివారం భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు చేరగా.. పతకాల సంఖ్య 17కు చేరుకుంది.
నవతెలంగాణ-టోక్యో
2020 పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. పతకాల వేటలో పారా అథ్లెట్ల చరిత్ర దిగ్విజయంగా సాగుతోంది. తొలిసారి పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ను ప్రవేశపెట్టగా.. షటిల్ కోర్టులో భారత్ స్మాష్ సూపర్‌గానే దిగింది. ఒకే విభాగంలో భారత్‌కు ఓ పసిడి, కాంస్య పతకం సొంతమైంది. షుటింగ్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతమైంది. ఒకే విభాగంలో భారత్ స్వర్ణం, కాంస్యం గెల్చుకుంది. శనివారం భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు చేరిపోయాయి. అగ్ర షట్లర్ ప్రమోద్ భగత్ పసిడి విజయంతో చరిత్ర సృష్టించగా.. మనోజ్ సర్కార్ కాంస్య పతకం వశం చేసుకున్నాడు. షుటింగ్‌లో డబుల్ ధమాకా ప్రదర్శన పునరావృతమైంది. మనీశ్ నర్వాల్ పసిడి గురితో అదరగొట్టగా.. సింగ్‌రాజ్ అదాన కాంస్యంతో ఔరా అనిపించాడు. మనీశ్ నర్వాల్ 218.2 పాయింట్లతో పసిడి పతకం గెలుచుకున్నాడు. 216.7 పాయింట్లతో సింగ్‌రాజ్ అదాన రజతం అందుకున్నాడు. పారాలింపిక్స్‌లో ఒకేరోజు ఓ విభాగంలో భారత్ రెండేసి పతకాలు సాధించటం సైతం ఇదే తొలిసారి. 2016, 1984 పారాలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా నాలుగేసి పతకాలు సాధించింది. 2020 పారాలింపిక్స్‌లో ఏకంగా ఇప్పటికే 17 పతకాలు ఖాతాలో వేసుకుని ప్రభంజనం సృష్టించింది.
గురి అదిరింది : షుటింగ్‌లో భారత్ పతక హవాకు ఎదురులేదు. యువ షుటర్ అవని లేఖర ఓ పసిడి, కాంస్యంతో టోక్యోలో సరికొత్త చరిత్రకు తెరలేపగా.. అదే దారిలో నడిచాడు వెటరన్ షుటర్ సింగ్‌రాజ్ అదాన. టోక్యో పారాలింపిక్స్‌లో అవని లేఖర తర్వాత రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా సింగ్‌రాజ్ అదాన నిలిచాడు. మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 (స్టాండింగ్) విభాగంలో మనీశ్ నర్వాల్ బంగారంపై గురిపెట్టగా.. అదాన సిల్వర్‌ను సాధించాడు. ఈ విభాగంలో భారత్ తొలి రెండు ఉత్తమ పతకాలను కైవసం చేసుకుంది. ఫైనల్లో తొలి రౌండ్ నుంచే ముందంజలో కొనసాగిన నర్వాల్, అదానలు పసిడి కోసం ముఖాముఖి తలపడ్డారు. ఫైనల్లో మనీశ్ నర్వాల్ 45.4, 41.8తో మొదలుపెట్టి.. 17.1, 19.6, 19.7, 16.0, 21.3, 19.8, 17.5 స్కోర్లతో బంగారు పతకం ముద్దాడాడు. సింగ్‌రాజ్ అదాన తొలి రెండు రౌండ్లలో 46.1, 46.0 స్కోర్లు సాధించాడు. 17.4, 14.7, 18.7, 19.7, 16.3, 19.9, 17.9తో సిల్వర్ మెడల్ గురిపెట్టాడు. 196.8 పాయింట్లతో రష్యన్ అథ్లెట్ కాంస్య పతకం సాధించాడు. సింగ్‌రాజ్ అదాన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే విభాగంలో పోటీపడిన మరో షుటర్ ఆకాశ్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు. అర్హత రౌండ్లో 27వ స్థానంలో నిలిచి పతక రేసుకు ముందే నిష్క్రమించాడు.
స్మాష్ దిగింది : పారా షట్లర్ ప్రమోద్ భగత్ చరిత్ర సృష్టించాడు. పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి బ్యాడ్మింటన్ పతకం తీసుకొచ్చాడు. మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3 విభాగంలో పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగిన వరల్డ్ నం.1 ప్రమోద్ భగత్.. అంచనాలను అందుకున్నాడు. గ్రూప్ దశ నుంచి అద్భుత ప్రదర్శన చేసిన ప్రమోద్ భగత్ ఫైనల్లోనూ అదే దూకుడు కనబరిచాడు. పసిడి పతకంతో నయా చరిత్ర లిఖించాడు. గ్రేట్ బ్రిటన్ అథ్లెట్ డానిల్ బెథెల్‌పై వరుస గేముల్లోనే సంచలన విజయం నమోదు చేశాడు. ఎస్ఎల్3 విభాగం పసిడి పోరులో 21-14, 21-17తో అలవోక విజయం సాధించాడు. తొలి గేమ్‌ను 21 నిమిషాల్లో గెల్చుకున్న ప్రమోద్.. రెండో గేమ్‌ను 24 నిమిషాల్లో సాధించాడు. అంతకముందు సెమీఫైనల్లో 21-11, 21-16తో జపాన్ షట్లర్ ఫుజిహరపై వరుస గేముల్లోనే గెలుపొందాడు. ఈ విభాగంలో కాంస్యం సాధించిన మనోజ్ సర్కార్ సెమీఫైనల్లో పోరాడి ఓడాడు. బ్రిటన్ షట్లర్ బెథెల్ చేతిలో 8-21, 10-21తో పరాజయం పాలయ్యాడు. కాంస్య పతక పోరులో పుంజుకున్న మనోజ్ సర్కార్ అదిరే విజయం సాధించాడు. జపాన్ షట్లర్ ఫుజిహరపై 22-20, 21-13తో గెలుపొందిన మనోజ్ సర్కార్ కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. బ్యాడ్మింటన్‌లో భారత్ మరిన్ని పతకాలు సైతం ఖాయం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగం ఎస్ఎల్3-ఎస్యు5 విభాగం సెమీఫైనల్లో ప్రమోద్ భగత్, పాలక్ కోహ్లి జంట 21-3, 21-15తో వరుస గేముల్లో ఓటమి చెందింది. ఈ జోడీ నేడు కాంస్య పతక పోరులో బరిలోకి దిగనుంది. మెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగం సెమీఫైనల్లో బ్రిటన్ షట్లర్ క్రిస్టెన్ కూంబ్స్పై 21-10, 21-11తో విజయం సాధించిన క్రిష్ణ నాగర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ విభాగంలో భారత్‌కు కనీసం రజత పతకం ఖాయం.