Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్ఫూర్తిదాయకం, అమోఘం. పతక వేటలో మొక్కవోని పట్టుదల. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు చరిత్ర సృస్టించారు. టోక్యో పారాలింపిక్స్‌ను భారత పారాస్పోర్ట్స్ చరిత్రలో మరింత ప్రత్యేకంగా నిలిపారు. అంచనాలను దాటుకుని అత్యద్భుత ప్రదర్శన చేసిన మన అథ్లెట్లు.. టోక్యోలో కనీవినీ ఎరుగని రీతిలో 19 పతకాలు సాధించారు. సమ్మర్ ఒలింపిక్స్‌లో భారత్ 20కి పైగా పతకాలు సాధిస్తుందనే అంచనాలను అథ్లెట్లు అందుకోలేదు. కానీ పారా అథ్లెట్లు భిన్నమైన ప్రదర్శన చేశారు. ఐదు బంగారు పతకాలు, ఎనిమిది రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు కొల్లగొట్టారు. పారాలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ 24వ స్థానంలో నిలిచింది. భారత పారా క్రీడారంగంలో ఇదో ప్రత్యేక మజిలీ.
పారాలింపిక్స్ ఆసాంతం భారత్ పతకాలు సాధించింది. ప్రతి రోజు పతక వేటలో ముందంజలో నిలిచింది. షూటర్ అవని లేఖర పసిడి, కాంస్య పతకాలతో సరికొత్త చరిత్ర లిఖించగా.. జావెలియన్ త్రోలో సుమిత్ అంతిల్, షూటింగ్లో మనీశ్ నర్వాల్, బ్యాడ్మింటన్‌లో ప్రమోద్ భగత్, క్రిష్ణ నాగర్లు పసిడి పతకాలు సాధించారు. భవానీబెన్ పటేల్ టేబుల్ టెన్నిస్‌లో రజత పతకంతో పతకాల ఖాతా తెరువగా.. హైజంప్‌లో నిషద్ కుమార్, మరియప్పన్ తంగవేలు, ప్రవీణ్ కుమార్‌లు, డిస్కస్ త్రోలో యోగేష్ కతునియ, జావెలిన్ త్రోలో దేవేంద్ర జజారియ, షూటింగ్లో సింగ్‌రాజ్ అదాన, బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్లు రజత పతకాలు కొల్లగొట్టారు. జావెలియన్ త్రోలో సుందర్ సింగ్ గుర్జర్, షూటింగ్లో అవని లేఖర, సింగ్‌రాజ్ అదాన, హైజంప్‌లో శరద్ కుమార్, ఆర్చరీలో హర్విందర్ సింగ్, బ్యాడ్మింటన్‌లో మనోజ్ సర్కార్లు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. 2012 లండన్ పారాలింపిక్స్‌లో ఒక్క పతకం సాధించిన భారత్.. 2016 రియో పారాలింపిక్స్‌లో నాలుగు పతకాలు గెలుచుకుంది. తాజాగా 2020 టోక్యో పారాలింపిక్స్‌లో ఏకంగా 19 పతకాలు సాధించింది. భవిష్యత్ పారాలింపిక్స్ పతకాల వేటలో భారత్ మరింత దూకుడుగా దూసుకెళ్లేందుకు ఈ ప్రదర్శన దోహదం చేయనుంది. జపాన్ జాతీయ స్టేడియంలో ఆదివారం ముగింపు వేడుకలతో టోక్యో పారాలింపిక్స్ అధికారికంగా ముగిశాయి.