Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంత్, ఠాకూర్ అర్థ సెంచరీలు
- భారత్ రెండో ఇన్నింగ్స్ 466/10
నవతెలంగాణ-లండన్ : శార్దుల్ ఠాకూర్ (60, 72 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (50, 106 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. లోయర్ ఆర్డర్ పంత్, ఠాకూర్ జోడీ ఎనిమిదో వికెట్‌కు వంద పరుగులు జోడించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 466 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల లోటును అధిగమించిన కోహ్లిసేన.. ఇంగ్లాండ్‌కు 368 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
పంత్, ఠాకూర్ జోరు : విరాట్ కోహ్లి (44, 96 బంతుల్లో 7 ఫోర్లు) మరోసారి భారీ స్కోరు చేయటంలో విఫలమయ్యాడు. జడేజా (17)తో కలిసి వేగంగా పరుగులు జోడించిన కోహ్లి.. కీలక సమయంలో వికెట్ కోల్పోయాడు. జడేజా, రహానె (0), కోహ్లిలు వెనువెంటనే వికెట్ కోల్పోవటంతో 312/6తో భారత్ నిలిచింది. ఇక్కడ నుంచి పంత్, ఠాకూర్ జంట చెలరేగింది. దూకుడుగా పరుగులు పిండుకుని వంద పరుగులు జత చేసింది. ఓ సిక్సర్, ఏడు ఫోర్లతో ఠాకూర్ చెలరేగగా.. పంత్ సావధానంగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరు వరుస ఓవర్లలో వికెట్ కోల్పోయినా.. అప్పటికే భారత్ 300 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఉమేశ్ యాదవ్ (25, 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), బుమ్రా (24, 38 బంతుల్లో 4 ఫోర్లు) ధనాధన్ బ్యాటింగ్‌తో భారత ఆధిక్యం 350 మార్క్ దాటించారు. 148.2 ఓవర్లలో భారత్ 466 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (3/83), మోయిన్ అలీ (2/118), రాబిన్సన్ (2/105) వికెట్లు తీసుకున్నారు.
రవిశాస్త్రికి కోవిడ్ : హెడ్ కోచ్ రవిశాస్త్రి కోవిడ్ బారిన పడ్డాడు. శనివారం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షలో రవిశాస్త్రి పాజిటివ్‌గా తేలాడు. దీంతో శాస్త్రి సహా ఇతర సహాయక సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ రాథోర్లు సైతం ఐసోలేషన్‌లో ఉన్నారు. అందరూ హోటల్లోనే ఉంటున్నారు. జట్టుతో పాటు ప్రయాణించటం లేదు.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 191/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 290/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : రోహిత్ (సి) వోక్స్ (బి) రాబిన్సన్ 127, రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 46, పుజార (సి) అలీ (బి) అండర్సన్ 61, కోహ్లి (సి) ఓవర్టన్ (బి) అలీ 44, జడేజా (ఎల్బీ) వోక్స్ 17, రహానె (ఎల్బీ) వోక్స్ 0, పంత్ (సి,బి) అలీ 50, ఠాకూర్ (సి) ఓవర్టన్ (బి) రూట్ 60, ఉమేశ్ (సి) అలీ (బి) ఓవర్టన్ 25, బుమ్రా (సి) అలీ (బి) వోక్స్ 24, సిరాజ్ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (148.2 ఓవర్లలో ఆలౌట్) 466.