Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిష్ణకు పసిడి, సుహాస్‌కు రజతం
- చివరి రోజు భారత్‌కు రెండు మెడల్స్
- ముగిసిన టోక్యో పారాలింపిక్స్
టోక్యోలో టీమ్ ఇండియా స్మాష్ అదిరింది. పారాలింపిక్స్‌లో తొలిసారి బ్యాడ్మింటన్‌ను ప్రవేశపెట్టగా.. మన షట్లర్లు దుమ్మురేపారు. క్రిష్ణ నాగర్ పసిడి పతకంతో చెలరేగగా.. నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్), షట్లర్ సుహాస్ యతిరాజ్ సిల్వర్ మెడల్‌తో కదం తొక్కాడు. క్రిష్ణ నాగర్, సుహాస్ యతిరాజ్లు పసిడి, రజతాలతో మెరువగా.. చివరి రోజు భారత్ రెండు పతకాలు సొంతం చేసుకుంది. 2020 పారాలింపిక్స్‌ను అత్యధికంగా 19 పతకాలతో ముగించింది. పారాలింపిక్స్ చరిత్రలోనే భారత్‌కు ఇది అత్యుత్తమ ప్రదర్శన.
నవతెలంగాణ-టోక్యో
పారా షట్లర్లు చరిత్ర సృష్టించారు. 2020 టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నాలుగు పతకాలు అందించారు. పారాలింపిక్స్‌లో పతకల హవా చూపించిన టీమ్ ఇండియా.. పోటీల ఆఖరు రోజూ అదే ఉత్సాహంతో మెడల్స్ కైవసం చేసుకుంది. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగం ఫైనల్లో టాప్ షట్లర్ క్రిష్ణ నాగర్ పసిడి పతకం సాధించాడు. స్వర్ణ సమరంలో హాంగ్‌కాంగ్ షట్లర్ చు మాన్ కైను 21-17, 16-21, 21-17తో మట్టికరిపించి బంగారు పతకం ముద్దాడాడు. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎస్4 విభాగంలో పారా షట్లర్, ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ చరిత్ర సృష్టించాడు. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి ఐఏఎస్ అధికారిగా నిలిచాడు. ఫైనల్లో ఫ్రాన్స్ షట్లర్ లుకాస్ మజార్‌తో మూడు గేముల హోరాహోరీ సమరంలో సుహాస్ సిల్వర్‌కు పరిమితం అయ్యాడు. 21-15. 17-21, 15-21తో సుహాస్ పసిడి విజయానికి దూరమయ్యాడు. పారాలింపిక్స్ పోటీల ముగింపు రోజు భారత్ రెండు పతకాలు సొంతం చేసుకుంది. దీంతో 2020 పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 19కు చేరుకుంది. 1984, 2016 పారాలింపిక్స్‌లో నాలుగేసి పతకాలు సాధించటమే ఇప్పటివరకు పారాలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా ఉండేది. టోక్యోలో పారా షట్లర్లు చరిత్ర తిరగరాశారు. కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 19 పతకాలు కైవసం చేసుకుని సరికొత్త చరిత్రకు తెరలేపారు.
క్రిష్టకు పసిడి : స్టార్ షట్లర్ క్రిష్ణ నాగర్ పారాలింపిక్స్‌లో అంచనాలను అందుకున్నాడు. 2020 పారాలింపిక్స్‌లో పసిడి ఫేవరేట్‌గానే రేసును మొదలుపెట్టిన క్రిష్ణ అందుకు తగినట్టుగానే రాణించాడు. గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు క్రిష్ణ ఒక్క మ్యాచ్‌లో ఓటమి చెందలేదు. ప్రత్యర్థికి కనీసం ఓ గేమ్ కోల్పోకుండా ఫైనల్స్‌కు చేరుకున్న క్రిష్ణ.. పసిడి సమరంలో ఓ గేమ్ కోల్పోయినా, బంగారు విజయం అందుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న హాంగ్‌కాంగ్ షట్లర్ చు మన్ కై పై క్రిష్ణ మెరుపు విజయం నమోదు చేశాడు. 21-17, 16-21, 21-17తో మెరుపు విజయం సాధించి పసిడి ముద్దాడాడు. పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇది రెండో పసిడి పతకం కావటం విశేషం.
కలెక్టర్ అదరహో : కోవిడ్-19 కష్టకాలంలో అద్భుత పనితీరుతో మహమ్మారి కట్టడిలో విజయవంతంగా పనిచేసిన నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) సుహాస్ యతిరాజ్ పారాలింపిక్స్‌లోనూ అదే స్ఫూర్తి కనబరిచాడు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 విభాగంలో పోటీపడిన సుహాస్ యతిరాజ్ నిజానికి అండర్‌డాగ్‌గా బరిలోకి దిగాడు. గ్రూప్ దశ నుంచి స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరిచిన సుహాస్ అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పసిడి పోరులో 21-15తో తొలి గేమ్‌లో గెలుపొందిన సుహాస్.. తర్వాతి రెండు గేముల్లో ప్రత్యర్థికి తలొంచాడు. ఫ్రాన్స్ పారా షట్లర్ లుకాస్ మజూర్ 21-17, 21-15తో చివరి రెండు గేముల్లో గెలుపొంది స్వర్ణ పతకం ఎగరేసుకుపోయాడు. నిర్ణయాత్మక గేమ్‌లో చివరి వరకు పసిడి పోరాటం చేసిన సుహాస్ యతిరాజ్ సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. ' భావోద్వేగభరిత సందర్భం. రజతం సాధించినందుకు సంతోషంగా ఉంది, పసిడి చేజారినందుకు బాధగానూ ఉంది. పసిడి పతకానికి ఎంతో చేరువగా వచ్చాను. క్రీడాకారుడిగా ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకం సాధించటమే అంతిమ లక్ష్యం. సిల్వర్ మెడల్ గెల్చుకోవటం సైతం అంత సులువైన విషయం కాదు. నా ప్రదర్శన పట్ల ఎంతో గర్వపడుతున్నాను' అని సుహాస్ అన్నాడు. 2007లో ఐఏఎస్ అధికారిగా ఎంపికైన సుహాస్ యతిరాజ్ (కర్ణాటక) నోయిడా జిల్లా మేజిస్ట్రేట్‌గా కోవిడ్-19పై ప్రణాళికబద్దమైన యుద్ధం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో సుహాస్ ఐదు స్వర్ణ పతకాలు, నాలుగు రజత పతకాలు, ఏడు కాంస్య పతకాలు సాధించాడు.