Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్‌లకు కోవిడ్
లండన్ : భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బంది కోవిడ్-19 మహమ్మారి బారిన పడ్డారు. హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆదివారం నాటి పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలగా.. సహాయక సిబ్బంది అందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. తాజాగా నిర్వహించిన కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో రవిశాస్త్రి సహా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సైతం పాజిటివ్‌గా తేలారు. దీంతో ఈ ముగ్గురు హోటల్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కోహ్లిసేనతో పాటు ఐదో టెస్టు వేదిక మాంచెస్టర్‌కు వెళ్లటం లేదు. నాల్గో టెస్టులో ఆడుతున్న క్రికెటర్లు సహా బెంచ్ ఆటగాళ్లకు సైతం కోవిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఆర్. శ్రీధర్‌తో సన్నిహితంగా మెలిగిన ఫిజయోథెరపిస్ట్ నితిన్ పటేల్‌ను ఐసోలేషన్లోకి పంపించారు. సహాయక సిబ్బందిలో బ్యాటింగ్ కోచ విక్రమ్ రాథోర్ ఒక్కరే ప్రస్తుతం జట్టుతో ఉంటున్నారు. ఐదో టెస్టుకు సైతం అతడు ఒక్కడే జట్టుతో పాటు ప్రయాణం చేయనున్నాడు. బ్రిటన్ ప్రభుత్వం నిబంధనల ప్రకారం కోవిడ్ పాజిటివ్‌గా వస్తే పది రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి, రెండు ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వస్తేనే బయట అడుగు వేయాలి. దీంతో ఐదో టెస్టుకు సహాయక సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు.