Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీలు
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ నుంచి పది జట్లతో అభిమానుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎనిమిది జట్ల ఐపీఎల్‌ను పది జట్లకు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకోగా.. అందుకు సంబంధించి టెండరు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. రెండు నూతన ప్రాంఛైజీల కోసం క్రికెట్ బోర్డు టెండర్లు ఆహ్వానించింది. కనీస ధర రూ. 2000 కోట్లుగా నిర్ణయించారు. దక్షిణాది నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, చెన్నై సూపర్‌కింగ్స్‌లు ఉండగా మరో ప్రాంఛైజీకి ఇక్కడ అవకాశం ఉంది. కేరళ రాష్ట్రం వేదికగా ఓ ప్రాంఛైజీని పెట్టవచ్చు. గతంలో కోచి టస్కర్స్ యాజమాన్యంతో బీసీసీఐ న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీనికి తోడు ఐపీఎల్, క్రికెట్ టెలివిజన్ వీక్షకుల్లో అధిక శాతం హిందీ భాష మాట్లాడే ప్రాంతాల నుంచే ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. దీంతో నూతన ప్రాంఛైజీలను హిందీ భాష మాట్లాడే ప్రాంతాల నగరాలకే కేటాయించేందుకు బోర్డు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్, లక్నో సహా గువహటి నగరాలు ఐపీఎల్ ప్రాంఛైజీల రేసులో ముందున్నాయి. ధర్మశాల, రాంచీ, కటక్‌లు సైతం ఐపీఎల్ ప్రాంఛైజీల నగరాల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. నూతనంగా ప్రాంఛైజీలు దక్కించుకున్న వారు ఈ ఆరు నగరాల్లో ఎక్కడైనా జట్టును సొంతం చేసుకునే వీలుంది. రెండు కొత్త ప్రాంఛైజీల ద్వారా బీసీసీఐ సుమారు రూ.6000-7000 కోట్లు ఆశిస్తోంది. ఒక్కో ప్రాంఛైజీ రూ.3000-3500 కోట్ల వరకు సంపాదిస్తుందనే దీమా బోర్డు వర్గాల్లో వ్యక్తమవుతోంది.