Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓవల్‌లో భారత్ ఘన విజయం
- రికార్డు 368 ఛేదనలో ఇంగ్లాండ్ చతికిల
- 210 పరుగులకే కుప్పకూలిన రూట్‌సేన
- పటౌడీ ట్రోఫీలో భారత్ 2-1 ఆధిక్యం
ఇంగ్లాండ్ గడ్డపై కోహ్లిసేన మరోసారి పంజా విసిరింది. లార్డ్స్‌లో అద్భుత విజయం సాధించిన భారత్.. అదే ప్రదర్శనను ఓవల్‌లో పునరావృతం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత అరుదుగా రికార్డు స్కోరు బాదిన టీమ్ ఇండియా.. ఆతిథ్య ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. చివరి రోజు పది వికెట్లతో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్సేనను పేస్, స్పిన్‌తో వణికించింది. నాలుగో టెస్టులో 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. పటౌడీ ట్రోఫీలో 2-1 ఆధిక్యం సాధించి, సిరీస్ కోల్పోని స్థితిలో నిలిచింది. లీడ్స్ టెస్టులో భారత్‌పై ప్రతీకార విజయంతో ఉప్పొంగిన ఇంగ్లాండ్‌కు ఓవల్‌లో కోహ్లిసేన తిరిగి గర్వభంగం చేసింది.
నవతెలంగాణ-లండన్
పటౌడీ ట్రోఫీపై టీమ్ ఇండియా పట్టు బిగించింది. ది ఓవల్ టెస్టులో 157 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లీడ్స్ విజయోత్సాహంలో ఉన్న ఆతిథ్య జట్టుపై పంజా విసిరిన కోహ్లిసేన.. నాల్గో టెస్టులో ఎదురులేని విజయం నమోదు చేసింది. పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/60), జశ్‌ప్రీత్ బుమ్రా (2/27), శార్దుల్ ఠాకూర్ (2/22), లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (2/50) దెబ్బకు రికార్డు 368 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 210 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (50, 125 బంతుల్లో 5 ఫోర్లు), హసీబ్ హమీద్ (63, 193 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌కు ఆశలు కల్పించినా.. మిడిల్ ఆర్డర్‌ను భారత బౌలింగ్ దళం క్రీజులో నిలువనివ్వలేదు. డెవిడ్ మలాన్ (5), ఒలీ పోప్ (2), జానీ బెయిర్‌స్టో (0), మోయిన్ అలీ (0), జో రూట్ (36)లు భారత బౌలర్లకు దాసోహం అయ్యారు. రోహిత్ శర్మ (127, 256 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్), చతేశ్వర్ పుజార (61, 127 బంతుల్లో 9 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (60, 72 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (50, 106 బంతుల్లో 4 ఫోర్లు), విరాట్ కోహ్లి (44, 96 బంతుల్లో 7 ఫోర్లు) సమిష్టిగా రాణించటంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రికార్డు 466 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లోటు 99 పరుగులు అధిగమించిన.. ఇంగ్లాండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఆతిథ్య జట్టు 92.2 ఓవర్లలోనే చేతులెత్తేసింది. పటౌడీ ట్రోఫీలో చివరి టెస్టు శుక్రవారం నుంచి మాంచెస్టర్‌లో జరుగనుంది.
బుమ్రా, జడ్డూ బూమ్‌బూమ్ : 368 పరుగుల రికార్డు లక్ష్యం. ఓవల్‌లో 300కి పైగా లక్ష్యాలను ఛేదించిన చరిత్ర లేదు. అయినా, ఓపెనర్ల మెరుపులతో ఇంగ్లాండ్ ఐదో రోజు విజయం దృష్టిలో ఉంచుకునే బరిలోకి దిగింది. రోరీ బర్న్స్ (50, 125 బంతుల్లో 5 ఫోర్లు), హసీబ్ హమీద్ (63, 193 బంతుల్లో 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 100 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. జోరుమీదున్న భారత పేసర్లను ఎదురొడ్డి పిచ్ సహకారంతో ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. తొలి వికెట్ కోసం భారత్ 40 ఓవర్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి వికెట్ కోసం 100 పరుగుల వరకు ఎదురుచూసిన భారత్.. 47 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ (6 వికెట్లు)ను పెవిలియన్‌కు చేర్చింది. శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలు ఓపెనర్లను వెనక్కి పంపారు. ఫామ్‌లో ఉన్న డెవిడ్ మలాన్ (5)ను మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్ కండ్లుచెదిరే రనౌట్ చేయగా.. బుమ్రా బూమ్‌బూమ్ ప్రదర్శన చేశాడు. వరుస ఓవర్లలో ఇద్దరు ప్రమాదకర ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చాడు. ఒలీ పోప్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. అదే తరహాలో జానీ బెయిర్‌స్టో వికెట్లను సైతం గిరాటేశాడు. ఆల్‌రౌండర్ మోయిన్ అలీ (0) జడేజా స్పిన్ వలలో చిక్కాడు. దీంతో 100/0తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్.. 147/6తో ఓటమి అంచుల్లో నిలిచింది. ఐదో రోజు పిచ్‌పై జడేజా కీలక పాత్ర పోషించగా.. బుమ్రా సత్తా చాటాడు. ఈ ఇద్దరి మెరుపులతో భారత్ లంచ్ అనంతరం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఇంగ్లాండ్ అవకాశాలను పూర్తిగా తుడిచిపెట్టి.. భారత విజయానికి బాటలు వేసుకుంది.
సిరీస్‌లో హ్యాట్రిక్ శతకాలు బాదిన జో రూట్ (36, 78 బంతుల్లో 3 ఫోర్లు) ఓవల్‌లో భారత్ రెండుసార్లు క్లీన్‌బౌల్డ్ చేసింది. క్రిస్ వోక్స్ (18, 47 బంతుల్లో 1 ఫోర్లు)తో కలిసి జో రూట్ భాగస్వామ్యం నిర్మించే పని చేసినా.. శార్దుల్ ఠాకూర్ బంతికి రూట్ వద్ద సమాధానం లేకపోయింది. క్రిస్ వోక్స్‌ను సైతం షార్ట్ మిడ్వికెట్లో క్యాచౌట్‌గా వెనక్కి పంపించిన ఉమేశ్.. భారత విజయాన్ని లాంఛనం చేసింది. కొత్త బంతి అందుబాటులో ఉన్నప్పటికీ.. పాత బంతితోనే వికెట్ల వేట కొనసాగించిన కోహ్లిసేన 92.2 ఓవర్లలో ఇంగ్లాండ్ కథ ముగించింది. జేమ్స్ అండర్సన్ (2)ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేయటంతో భారత శిబిరంలో గెలుపు సంబురాలకు తెరలేచింది. ఒలీ రాబిన్సన్ (10 నాటౌట్, 32 బంతుల్లో 2 ఫోర్లు) మరో ఎండ్‌లో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా..జశ్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 191/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 290/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 466/10
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : రోరీ బర్న్స్ (సి) పంత్ (బి) ఠాకూర్ 50, హసీబ్ హమీద్ (బి) జడేజా 63, డెవిడ్ మలాన్ (రనౌట్) 5, జో రూట్ (బి) ఠాకూర్ 36, ఒలీ పోప్ (బి) బుమ్రా 2, జానీ బెయిర్‌స్టో (బి) బుమ్రా 0, మోయిన్ అలీ (సి)(సబ్) సూర్యకుమార్ యాదవ్ (బి) జడేజా 0, క్రిస్ వోక్స్ (సి) రాహుల్ (బి) ఉమేశ్ యాదవ్ 18, క్రెయిగ్ ఓవర్టన్ (బి) ఉమేశ్ యాదవ్ 10, ఒలీ రాబిన్సన్ నాటౌట్ 10, జేమ్స్ అండర్సన్ (సి) పంత్ (బి) ఉమేశ్ యాదవ్ 2, ఎక్స్టాలు : 14, మొత్తం : (92.2 ఓవర్లలో ఆలౌట్) 210.
వికెట్ల పతనం : 1-100, 2-120, 3-141, 4-146, 5-146, 6-147, 7-182, 8-193, 9-202, 10-210.
బౌలింగ్ : ఉమేశ్ యాదవ్ 18.2-2-60-3, జశ్‌ప్రీత్ బుమ్రా 22-9-27-2, రవీంద్ర జడేజా 30-11-50-2, మహ్మద్ సిరాజ్ 14-0-44-0, శార్దుల్ ఠాకూర్ 8-1-22-2.