Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టుల్లో ఐదో స్థానానికి ప్రమోట్
- బ్యాట్‌తో జడేజా నయా అవతార్
లోయర్ ఆర్డర బ్యాటింగ్ లైనప్‌లో పరుగులు సాధించగల టెయిలెండర్గానే రవీంద్ర జడేజాను ఇప్పటివరకు చూశాం!. స్పిన్ ఆల్‌రౌండర్ పాత్ర నుంచి జడేజా ఇప్పుడు బ్యాట్స్‌మన్ పాత్రలోకి ప్రవేశిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో ది ఓవల్ టెస్టులో రవీంద్ర జడేజాను బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి ప్రమోట్ చేశారు. రవీంద్ర జడేజా బ్యాటింగ్ నైపుణ్యంపై జట్టు మేనేజ్మెంట్ నమ్మకానికి ఇది నిదర్శనం.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇంగ్లాండ్‌తో పటౌడీ ట్రోఫీలో టీమ్ ఇండియా వ్యూహలపై కొన్ని విమర్శలు లేకపోలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి సిరీస్ ఆరంభానికి ముందు అనుకున్న ప్రణాళికలనే అమలు చేస్తాడు, సిరీస్ మధ్యలో చోటుచేసుకున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికల్లో మార్పు చేసుకోవడానికి ఇష్టపడననే విమర్శ ఉంది. ఇటువంటి విమర్శలు చేసే వారికి విరాట్ కోహ్లి నాల్గో టెస్టులో పెద్ద షాక్ ఇచ్చాడు. రవీంద్ర జడేజాను బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానంలో పంపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సాధారణంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే రవీంద్ర జడేజా.. రెండు స్థానాలు ముందుకొచ్చాడు. టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానెను ఓ స్థానం వెనక్కి పంపించి.. జడేజాకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ కల్పించారు. ప్రయోగాలను ఇష్టపడని కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నుంచి ఇటువంటి నిర్ణయం ఆశ్చర్యకరమే. నం.5 స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు రావటం వ్యక్తిగతంగా జడ్డూకు, అంతిమంగా జట్టుకూ ఉపయుక్తమే. ఈ నిర్ణయం బ్యాట్స్‌మన్‌గా రవీంద్ర జడేజా సామర్థ్యాన్ని జట్టు మేనేజ్మెంట్, డ్రెస్సింగ్‌రూమ్ గుర్తించటమే. ఈ స్థానంలో ఓవల్‌కు ముందు వరకు ఆడిన అజింక్య రహానె చివరి ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్కసారి 20కి పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది రహానె బ్యాటింగ్ సగటు 19.57.
బ్యాట్‌తోనూ మ్యాజిక్! : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు ముందు, ఇంగ్లాండ్ గడ్డపై 30 ప్లస్ బ్యాటింగ్ సగటు కలిగిన ఇద్దరు భారత క్రికెటర్లలో జడేజా ఒకడు. 36.35 సగటుతో విరాట్ కోహ్లి ఈ జాబితాలో ముందుండగా.. 30.66 సగటుతో జడేజా తర్వాతి స్థానంలో నిలిచాడు. టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజార (29.41), అజింక్య రహానె (29.26)లు జడేజా తర్వాతి స్థానాల్లోనే ఉన్నారు. బ్యాటింగ్ సగటు గణాంకాలు జట్టులో ఓ ఆటగాడి విలువను గణించలేవు, కానీ ఈ పరిస్థితుల్లో జట్టులోని ఇతర ఆటగాళ్లు ఏ విధంగా ఇబ్బందిపడ్డారనే విషయాన్ని కచ్చితంగా తెలియజేస్తాయి.
2018 నుంచి విదేశాల్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ గణాంకాలు గొప్పగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఐదు, అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన ఆటగాళ్ల బ్యాటింగ్ సగటులో రవీంద్ర జడేజా నాలుగో స్థానంలో ఉన్నాడు. 35.60 సగటుతో జడేజా విదేశీ టెస్టుల్లో పరుగులు సాధించాడు. ఈ సమయంలో ఐదు అర్థ సెంచరీలు చేసిన జడేజా.. అర్థ శతకాల జాబితాలోనూ నాలుగో స్థానంలో ఉన్నాడు. టెయిలెండర్లతో తరచుగా బ్యాటింగ్ చేసే జడేజా.. రెండో కొత్త బంతిని ఎదుర్కొని పరుగులు చేయటం అంత సులువు కాదు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో జడేజా తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని బయటపెట్టాడు. మెల్బోర్న్ టెస్టులో 159 బంతుల్లో 57 పరుగులు చేసిన జడేజా.. సిడ్నీ టెస్టులో 37 బంతుల్లో అజేయంగా 28 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఇప్పటికే 368 బంతులు ఎదుర్కొన్న జడేజా 160 పరుగులు చేశాడు. రెండో కొత్త బంతిని ఎదుర్కొవటంలో టీమ్ ఇండియా బలహీనతను పరిగణనలోకి తీసుకుంటే జడేజా అద్భుత ప్రదర్శనలు చేశాడు. ది ఓవల్ టెస్టులోనూ జడేజా ఆకట్టుకున్నాడు. జడేజా ఐదో స్థానంలో రావటంతో.. రహానెకు పాత బంతిని ఎదుర్కొనే అవకాశం ఏర్పడింది.
తోకతో ఇబ్బంది : బ్యాట్స్‌మన్‌గా జడేజాకు మంచి మార్కులే పడినా.. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేయటంలో జడేజాకు అంత మంచి రికార్డు లేదు. టెస్టుల్లో తోకతో కలిసి స్ట్రయిక్ రొటేట్ చేయటంలో జడేజా కొన్ని సార్లు విమర్శలు సైతం చవిచూశాడు. న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఇషాంత్ శర్మతో కలిసి క్రీజులో ఉన్న జడేజా స్ట్రయిక్ రొటేట్ చేయటంలో విఫలమయ్యాడు. 91వ ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీసిన జడేజా.. తర్వాతి ఓవర్లో స్ట్రయిక్ ఇషాంత్‌కు ఇచ్చాడు. అతడు ఆ ఓవర్లో వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత బుమ్రాది అదే పరిస్థితి. నాలుగు బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయిన భారత్ 217 పరుగులకు కుప్పకూలింది. 53 బంతుల పాటు బ్యాటింగ్ చేసిన జడేజా.. మ్యాచ్‌పై అవగాహన లేకపోవటంపై విమర్శల పాలయ్యాడు. టెయిలెండర్లతో జడేజా ఇబ్బందులు అనేకం. సిడ్నీ టెస్టులో 94వ ఓవర్ ఆఖరు బంతికి సింగిల్ తీసి.. నవదీప్ సైని తర్వాతి ఓవర్లో మిచెల్ స్టార్క్‌ను ఎదుర్కొనేలా చేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతికి సైని వికెట్ పారేసుకున్నాడు. అదే మ్యాచ్‌లో ఓ పరుగు విషయంలో పొరబడి బుమ్రా రనౌట్‌కు కారణమయ్యాడు. మహ్మద్ సిరాజ్.. పాట్ కమిన్స్‌ను ఎదుర్కొనేలా చేశాడు. ఈ జాబితా... ఇలా సాగుతూనే ఉంది. బిగ్ హిట్టింగ్ సామర్థ్యం ఉన్నప్పటికీ జడేజా బ్యాటింగ్ బలం టెయిలెండర్లతో కలిసి ఆడటం కాదు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి ఆడినప్పుడే జడేజా తనలోని ఉత్తమ బ్యాట్స్‌మన్‌ను బయటకు తీయగలడు.
గత కొన్నేండ్లలో బ్యాట్స్‌మన్‌గా జడేజా ఎంతో పురోగతి సాధించాడు. బ్యాటింగ్ మెరుపులతో తన బౌలింగ్ గణాంకాలను విస్మరించేలా చేయగలిగాడు. బంతితో 55.50 సగటు ఉన్నా.. జట్టులో ఏకైక స్పిన్నర్ స్థానం రేసులో రవిచంద్రన్ అశ్విన్ వెనక్కి నెట్టి తుది జట్టులో నిలుస్తున్నాడు. తుది రవీంద్ర జడేజా బ్యాటింగ్ నైపుణ్యమే అతడిని తుది జట్టులో నిలుపుతుంది. అటువంటప్పుడు, బ్యాట్స్‌మన్‌గా అతడు పూర్తి స్థాయిలో నిరూపించుకునే అవకాశం ఇవ్వటం సముచితమే. ఐదో స్థానం బ్యాట్స్‌మన్‌గా రవీంద్ర జడేజాను మరో స్థాయికి తీసుకెళ్తుందేమో చూడాలి.
ఎన్నో సందర్భాల్లో జడేజా విలువైన పరుగులు చేయటం చూశాం. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో, లార్డ్స్ టెస్టులోనూ రవీంద్ర జడేజా క్రీజులో కుదురుకునేందుకు గొప్ప ప్రయత్నం చేశాడు. జడేజా ఎంతో సహనంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కుడి-ఎడమ కాంబినేషన్ సైతం కుదురుతుందని జడేజానా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించారు'
- శార్దుల్ ఠాకూర్