Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సలహాదారుగా మహేంద్రసింగ్ ధోనీ
- టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు
ముంబయి : దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోని తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు!. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు సలహాదారుడిగా మహేంద్రసింగ్ ధోని మరోసారి టీమ్ ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. యుఏఈ వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును బుధవారం ప్రకటించారు. సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ, బీసీసీఐ కార్యదర్శి జై షాలు మీడియా సమావేశంలో వరల్డ్‌కప్ జట్టును వెల్లడించారు.
ధావన్, చాహల్ ఔట్ : టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి ఓపెనర్‌గా రానుండటం, కెఎల్ రాహుల్ భీకర ఫామ్‌తో శిఖర్ ధావన్ జట్టులో చోటు కోల్పోయాడు. శ్రీలంక పర్యటనలో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న ధావన్.. వరల్డ్‌కప్ జట్టులో చోటు గల్లంతు చేసుకున్నాడు. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్‌లు సైతం జట్టులో చోటు కోల్పోయారు. సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తిరిగి టీ20 జట్టులో అడుగుపెట్టారు. మిడిల్ ఆర్డర్లో ధనాధన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు చోటు చేసుకున్నారు. పేస్ విభాగంలో జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్‌లు ఉండగా.. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు స్పిన్ కోటాలో ఎంపికయ్యారు. ధనాధన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జట్టులో స్థానం నిలుపుకున్నాడు.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జశ్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి.
స్టాండ్ బై ఆటగాళ్లు : శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్.