Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఐదో టెస్టుకు వర్షం ముప్పు
- ఇంగ్లాండ్‌కు ఇక్కడ ఎదురులేని రికార్డు
- ఓల్డ్ ట్రాఫోర్డ్ కోటపై కోహ్లిసేన కన్ను
అసాధ్యాలను సుసాధ్యం చేయటం ప్రస్తుతం టీమ్ ఇండియా అలవాటుగా మార్చుకుంది. ఆస్ట్రేలియా 32 ఏండ్లులో ఓటమి రుచిచూడిన గబ్బా వేదికపై కంగారూలను మట్టికరిపించిన భారత్.. ఓవల్ మైదానంలో 50 ఏండ్లలో తొలిసారి విజయం సాధించింది. రికార్డులను బద్దలు చేయటంలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన కోహ్లిసేన.. ఇప్పుడు ఓల్డ్ ట్రాఫోర్డ్ కోటపై కన్నేసింది. మాంచెస్టర్‌లో భారత్ ఎన్నడూ టెస్టు విజయం రుచి చూడలేదు. రికార్డు విజయం కోసం కోహ్లిసేన తహతహగా ఎదురు చూస్తుండగా.. మాంచెస్టర్‌లో మాటు వేసేందుకు వరుణుడు సైతం సిద్ధంగా ఉన్నాడు.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత్, ఇంగ్లాండ్ పటౌడీ ట్రోఫీ రసకందాయంలో పడింది. తొలి టెస్టులో భారత్ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఆఖరు రోజు వర్షం కారణంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో టెస్టు వేదిక లార్డ్స్‌లో టీమ్ ఇండియా ఆధునిక క్రికెట్లో అద్భుతమే చేసింది. ఆఖరు రోజు చివరి సెషన్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై అద్వితీయ విజయం నమోదు చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సొంత మైదానం లీడ్స్‌లో ఆతిథ్య జట్టు పుంజుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ది ఓవల్‌లో మళ్లీ అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లిసేన ఈ సారి మరింత భారీ విజయం ఖాతాలో వేసుకుంది. టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యం సహా పటౌడీ ట్రోఫీ తిరిగి స్వదేశం తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంది. చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా పటౌడీ ట్రోఫీ భారత్ సొంతం కానుంది. అయితే, సిరీస్‌ను డ్రా చేసుకుని తీసుకెళ్లడానికి కోహ్లిసేన ఏ మాత్రం సుముఖంగా లేదు. స్పస్టమైన ఆధిక్యంతో సిరీస్‌ను సాధించి స్వదేశానికి సగర్వంగా వెళ్లాలని ఈ జట్టు తపన. అదే సమయంలో సొంతగడ్డపై భారత్‌కు టెస్టు సిరీస్‌ను కోల్పోవటం ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఎంత మాత్రం మింగుడు పడదు. ఈ నేపథ్యంలో పటౌడీ ట్రోఫీలో చివరి, ఐదో టెస్టు వేదిక మాంచెస్టర్‌పై అందరి దృష్టి పడింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇరు జట్ల రికార్డు, పిచ్ స్వభావం, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం.
భారీ వర్ష సూచన : మాంచెస్టర్ టెస్టుకు కనీసం మూడు రోజులు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. సెప్టెంబర్ 10న (శుక్రవారం) ఐదో టెస్టు ఆరంభం కానుంది. సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 11న ఇక్కడ ఓ మోస్తరు వర్షం కురువనుంది. ఆటకు పూర్తి ఆటంకం కలుగకపోయినా.. పలు దఫాలుగా వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో తొలి రెండు రోజుల్లో పెద్దగా ఆట సాధ్యపడక పోవచ్చు. టెస్టులో 3, 4 రోజులకు పెద్దగా వర్ష సూచనలు లేవు. అయినా, వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఇది పేస్ బౌలర్లకు అనుకూలం. టెస్టు మ్యాచ్ చివరి రోజు, సెప్టెంబర్ 14న భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో మాంచెస్టర్ టెస్టులో సుమారు మూడు రోజులు వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయే ప్రమాదంలో పడ్డాయి. ఫలితం తేలని మ్యాచ్‌గా ముగిస్తే ఆతిథ్య ఇంగ్లాండ్‌కు గట్టి ఎదురు దెబ్బ కానుంది. సిరీస్ 2-1తో టీమ్ ఇండియా సొంతం అవుతుంది.
ఇక్కడ విజయమే లేదు : రికార్డులు, చరిత్ర పుస్తకాలు ముందుంచి.. టీమ్ ఇండియాను రెచ్చగొట్టవద్దేమో!. అలా చేస్తే, ఫలితం ఏ రేంజ్లో ఉంటుందో కోహ్లిసేన ఇప్పటికే పలుమార్లు నిరూపించింది. పూర్తి మ్యాచ్ సాధ్యపడితే, బహుశా మాంచెస్టర్‌లోనూ అటువంటి ఫలితం, ప్రదర్శన పునరావృతం అవుతుందనే చెప్పవచ్చు. భారత్, ఇంగ్లాండ్‌లో మాంచెస్టర్‌లో (ఓల్డ్ ట్రాఫోర్డ్) తొమ్మిది టెస్టుల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఏ ఒక్క టెస్టులోనూ టీమ్ ఇండియా విజయం సాధిం చలేదు. నాలుగు టెస్టుల్లో విజయాలు నమోదు చేయగా.. ఐదు టెస్టులు డ్రాగా ముగిశాయి. 19936, 1946, 1971, 1982, 1990 టెస్టులు డ్రాగా ముగిశాయి. 1952చ 1959, 1974, 2014 టెస్టుల్లో ఇంగ్లాండ్ విజయాలు సాధించింది. 2014 టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో దారుణ పరాభవం చూసింది. 2021లో మరోసారి మాంచెస్టర్‌కు వచ్చిన టీమ్ ఇండియా ఈసారి ఏం చేస్తుందో చూడాలి.
పిచ్ స్వభావం : ఇంగ్లాండ్‌లోని వేగవంతమైన పిచ్‌లలో మాంచెస్టర్ రెండో స్థానంలో నిలుస్తుంది. పచ్చిక కూడిన పిచ్ పేస్ బౌలర్లకు స్వర్గ ధామమనే చెప్పవచ్చు. పిచ్ సహజ స్వభావానికి తోడు.. ఈసారి వరుణుడు రానున్నాడు. వర్షం, తేమ, అనంతర పరిస్థితులు కచ్చితంగా పేసర్లకు గొప్పగా ఉపకరిస్తాయి. ఇంగ్లాండ్ పేస్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు ఓల్డ్ ట్రాఫోర్డ్ సొంత మైదానం. ది ఓవల్‌లో ప్రభావం చూపలేని అండర్సన్.. సొంత మైదానంలో చెలరేగాలని చూస్తాడు. అందుకు పరిస్థితులు అనుగుణంగానే మారుతున్నాయి. పేసర్లకు గొప్పగా సహకరించినా.. ఇక్కడ బ్యాట్స్‌మెన్‌కు సైతం పరుగుల వేట సులువే. క్రీజులో కుదురుకుంటే పరుగుల సాధన కష్టతరం కాబోదు. టెస్టు మ్యాచ్‌లో 4, 5 రోజుల్లో స్పిన్ కీలక పాత్ర పోషించనుంది. 2014 టెస్టులో అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 40కి పైగా పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ తరఫున మోయిన్ అలీ మూడు వికెట్లతో విజయంలో కీలక భూమిక వహించాడు. ఈ టెస్టులోనూ ఇరు జట్ల నుంచి స్పిన్నర్లు ఎక్స్ ఫ్యాక్టర్ పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు.