Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్ విజయంపై కోహ్లిసేన గురి
- ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టుకు వరుణుడి ముప్పు
- నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు
- మధ్యాహ్నం 3.30 నుంచి సోనీనెట్వర్క్లో..
చరిత్రకు టీమ్ ఇండియా చేరువగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ విజయాలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించేందుకు విరాట్ కోహ్లి తహతహతో ఉన్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో అసలు టెస్టు విజయమే ఎరుగని టీమ్ ఇండియా.. వరుణుడు సహకరిస్తే మాంచెస్టర్ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. సిరీస్ వెనుకంజలో నిలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్.. మాంచెస్టర్‌లో సమంపై ఆశలు పెట్టుకుంది. టీమ్ ఇండియా చరిత్రపై గురిపెట్టగా.. ఇంగ్లాండ్ ఆశలు సమంపై ఉన్నాయి. టెస్టు మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశాలు వరుణుడిపై ఉండటం విశేషం. భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-మాంచెస్టర్
రికార్డులు బద్దలు కొట్టడం, సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడం కోహ్లిసేన సారథ్యంలోని టీమ్ ఇండియాకు విజయాలతో పెట్టిన విద్య!. అదే జోరు ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపైనా చూపేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుస టెస్టు సిరీస్ విజయాలు సాధించిన భారత్.. ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనూ టెస్టు సిరీస్ విజయంపై కన్నేసింది. వర్షం ముప్పు పొంచి ఉన్న మాంచెస్టర్ టెస్టులో టీమ్ ఇండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్ పటౌడీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని తపిస్తోంది. ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శన చేసి సిరీస్ సమం చేసినా.. గత విజేతగా పటౌడీ ట్రోఫీ కోహ్లిసేనకే దక్కనుంది. సమవుజ్జీగా ట్రోఫీ దక్కించుకోవటం కంటే, స్పష్టమైన విజేతగా ట్రోఫీని స్వదేశానికి తీసుకెళ్లేందుకు కోహ్లి ఉవ్విళ్లురుతున్నాడు. భారత్, ఇంగ్లాండ్ చివరి, ఐదో టెస్టు నేటి నుంచి మాంచెస్టర్‌లో ఆరంభం.
రహానె నిలిచేనా?! : ఇంగ్లాండ్‌తో పటౌడీ ట్రోఫీలో భారత బ్యాటింగ్‌లో నిజానికి ఎవరూ నిలకడగా రాణించలేదు. అలాగనీ అందరూ విఫలమయ్యారు అని చెప్పలేం. వైస్ కెప్టెన్ అజింక్య రహానె నిలకడగా రాణించకపోగా.. అత్యంత నిలకడగా విఫలమయ్యాడు. ఈ పరిస్థితి జట్టులో అతడి స్థానంపై అనుమానాలు రేకెత్తిస్తోంది. 2020 నుంచి రహానె బ్యాటింగ్ 24.76. కెరీర్ సగటు 39.63కి ఇది ఎంతో తక్కువ. ఈ సమయంలో ఓ శతకం, రెండు అర్థ సెంచరీలు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 27, 22, 4, 37, 24 పరుగులు చేసిన రహానె.. స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 1, 0, 67, 10, 7, 27 పరుగులు కొట్టాడు. న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో 49, 15 పరుగులు.. తాజాగా ఇంగ్లాండ్ సిరీస్‌లో 15, 5, 1, 61, 18, 10, 14, 0 పరుగులు సాధించాడు. ఈ ఏడాది 19 ఇన్నింగ్స్‌ల్లో 19.57 సగటుతో 372 పరుగులే చేశాడు. లార్డ్స్ విజయంలో రహానె అర్థ సెంచరీ కీలక పాత్ర పోషించినా.. సీనియర్ బ్యాట్స్‌మన్‌గా నిలకడగా అటువంటి ఇన్నింగ్స్‌లు నమోదు చేయాలి. రహానెతో పాటు పుజార సైతం సిరీస్ ఆరంభంలో పరుగుల ఒత్తిడిలో కనిపించినా.. అతడు గాడిలో పడ్డాడు. నాలుగు టెస్టుల్లో విఫలమైన ఆటగాడిని ఐదో టెస్టులోనూ ఆడించాల్సిన అవసరం ఏముంటుంది? అనే వాదన ఆరంభమైంది. తెలుగు తేజం హనుమ విహారి, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరు రహానె స్థానంలో తుది జట్టులోకి రావాలని విశ్లేషకులు కోరుతున్నారు. ఓపెనర్‌గా విదేశీ గడ్డపై తొలి శతకం బాదిన రోహిత్ శర్మ.. సిరీస్‌లో 500 పరుగుల రేసులో ఉన్నాడు. చివరి రెండు టెస్టుల్లో రాహుల్ కోల్పోయాడు. చివరి టెస్టులో రాహుల్ ఊపందుకుంటాడేమో చూడాలి. క్రీజులో సౌకర్యవంతంగా కనిపిస్తున్నా.. 40ల్లోకి అడుగుపెట్టగానే విరాట్ వికెట్ కోల్పోతున్నాడు. ఈ సమస్యను మాంచెస్టర్‌లో అధిగమించేందుకు కోహ్లి ప్రయత్నించాలి. విధ్వంసకారుడు రిషబ్ పంత్ ఓవల్‌లో అరుదైన ఇన్నింగ్స్ ఆడాడు. సహనంతో కూడిన అర్థ సెంచరీతో కదం తొక్కాడు. రవీంద్ర జడేజా బ్యాట్స్‌మన్‌గానూ తన పంథా చూపించాలనే తాపత్రయంతో కనిపిస్తున్నాడు.
బౌలింగ్ విభాగంలో జశ్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి చర్చనీయాంశం. సిరీస్‌లో ఇప్పటికే బుమ్రా 150కి పైగా ఓవర్లు సంధించాడు. ది ఓవల్‌లో క్రమశిక్షణతో కూడిన సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేశాడు. బుమ్రాకు విశ్రాంతి లభిస్తే.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ మానసికంగా కుదుట పడే అవకాశం ఉంది. ఫిట్నెస్ సాధించిన మహ్మద్ షమి నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. బ్యాట్‌తోనూ మెరుస్తున్న శార్దుల్ ఠాకూర్ మాంచెస్టర్‌లోనూ ఆడనున్నాడు. మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లలో ఒకరు తుది జట్టులో నిలువనున్నారు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బెంచ్‌కు పరిమితం కాక తప్పదేమో.
ఒత్తిడిలో ఇంగ్లాండ్ : లార్డ్స్ ఓటమితో ఎంతో ఒత్తిడిలో పడినా.. లీడ్స్‌లో ఆతిథ్య జట్టు పుంజుకుంది. ఇప్పుడు ఓవల్‌లో ఓడినా.. మాంచెస్టర్‌లో మెరుస్తామనే దీమా ఆ జట్టులో కనిపిస్తోంది. జేమ్స్ అండర్సన్ సొంత మైదానంలో సిరీస్ సమం చేసే ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు. వైస్ కెప్టెన్ జోశ్ బట్లర్ రాక ఇంగ్లాండ్ కాస్త ఊరట. బ్యాటింగ్ లైనప్‌లో అందరూ టచ్‌లోకి వచ్చారనే భావన కనిపిస్తున్నా.. భారత పేసర్ల రివర్స్ స్వింగ్‌కు ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ దాసోహం అవుతోంది. ఇది ఆ జట్టును ఎక్కువగా కలవర పెడుతోంది. కెప్టెన్ జో రూట్ తొలి మూడు టెస్టుల్లో శతకాలు బాదినా.. ఓవల్‌లో అతడి జోరుకు భారత్ బ్రేక్ వేసింది. అదే పరిస్థితి మాంచెస్టర్‌లోనూ కొనసాగితే ఇంగ్లాండ్‌కు ఓటమి తథ్యం. జానీ బెయిర్‌స్టో సిరీస్‌లో చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. జట్టు మేనేజ్మెంట్ జానీ నుంచి తగిన ఇన్నింగ్స్ ఆశిస్తోంది. స్పిన్నర్‌గా మోయిన్ అలీ తుది జట్టులో ఉండనుండగా.. జాక్ లీచ్‌కు అవకాశం కష్టమే. మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్, ఒలీ రాబిన్సన్తో కలిసి అండర్సన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
పిచ్, వాతావరణం : మాంచెస్టర్ టెస్టుకు కనీసం మూడు రోజులు వర్ష సూచనలు ఉన్నాయి. తొలి రెండు రోజులు పలు దఫాలుగా వర్షం ఆటకు ఆటంకం కలిగించే అవకాశం ఉండగా.. చివరి రోజు కుండ పోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం, మేఘావృతమైన వాతావరణంలో పేసర్లు చెలరేగనున్నారు. ఇరు జట్లు పేసర్లకు సముచిత ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు. భారత్, ఇంగ్లాండ్‌లో ఇక్కడ తొమ్మిది టెస్టుల్లో తలపడగా.. ఇంగ్లాండ్ నాలుగు టెస్టుల్లో విజయాలు సాధించింది. ఐదు టెస్టులు డ్రాగా ముగిశాయి. భారత్‌కు ఇక్కడ ఒక్క టెస్టు విజయం కూడా సాధ్యపడలేదు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానె/హనుమ విహారి/సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్/ఉమేశ్ యాదవ్.
ఇంగ్లాండ్ : రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, జో రూట్, డెవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టో, జోశ్ బట్లర్, మోయిన్ అలీ, ఒలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, జేమ్స్ అండర్సన్, మార్క్‌వుడ్.