Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్, 2వ సీడ్ రష్యాకు చెందిన డానియేల్ మెద్వదెవ్ ప్రవేశించారు. శుక్రవారం రాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో జకోవిచ్ 4-6, 6-2, 6-4, 4-6, 6-2తేడాతో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, 4వ సీడ్, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఐదుసెట్ల హోరాహోరీ పోరులో ఓడించాడు. దీంతో జకోవిచ్ క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు రికార్డు 21వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. గ్రాండ్‌స్లామ్స్ చరిత్రలో అత్యధిక టైటిల్స్(20) ఫెదరర్, నాదల్, జకోవిచ్ పేరిట పదిలంగా ఉంది. జకోవిచ్ గెలిస్తే 21వ గ్రాండ్‌స్లామ్ అతని ఖాతాలో చేరనుంది. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగానిగా జకోవిచ్ చరిత్ర సృష్టించనున్నాడు. రెండో సెమీస్‌లో డానియేల్ మెద్వదెవ్ 6-4, 7-5, 6-2తేడాతో వరుస సెట్లలో 12వ సీడ్ కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్‌ను చిత్తుచేశాడు.
రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై జకో గురి..
ఈ ఏడాది జరిగిన మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జకోవిచ్ చివరిదైన యుఎస్ ఓపెన్ కూడా సొంతం చేసుకుంటే క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ సాధించే అరుదైన అవకాశం లభించనుంది. 1969లో చివరిసారి దిగ్గజ లాడ్ రావర్ ఈ ఘనతను సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ రికార్డును చేరుకొనే అవకాశం జకోవిచ్ లభించింది. 2021 ఏడాదిలో జకోవిచ్ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గాడు. టైటిల్ పోరు ఆదివారం అర్ధరాత్రి(1.30గం||లకు) జరగనుంది.
మహిళల ఫైనల్లో అన్‌సీడెడ్ ప్లేయర్స్
మహిళల సింగిల్స్ ఫైనల్ శనివారం అర్ధరాత్రి ఇద్దరు అన్‌సీడెడ్ క్రీడాకారిణుల మధ్య జరగనుంది. శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో టీనేజర్లు ఎర్నా రదుకాను(బ్రిటన్), అన్నె ఫెర్నాండెజ్(కెనడా) ప్రత్యర్థి క్రీడాకారుణులను చిత్తుచేసి యుఎస్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరిద్దరూ సెమీస్‌లో సీడెడ్ క్రీడాకారిణులను చిత్తుచేయడం విశేషం. 17ఏళ్ల ఎర్నా రదుకాను 6-1, 6-4తేడాతో 17వ సీడ్ సక్కారి(గ్రీక్)ను చిత్తుచేయగా.. 19ఏళ్ల అన్నె ఫెర్నాండెజ్ 7-6(7-3), 4-6, 6-4తో 2వ సీడ్ సబలెంకా(బెలారస్)ను ఓడించడం విశేషం.