Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18ఏళ్లకే గ్రాండ్‌స్లామ్ కైవసం
- అర్హత టోర్నీ నుంచి మెయిన్ డ్రాలోకి ప్రవేశం
- 44ఏళ్ల తర్వాత యుఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన బ్రిటన్ క్రీడాకారిణి
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటన్‌కు చెందిన 18 ఏళ్ల ఎమ్మా రదుకాను కైవసం చేసుకొని పలు రికార్డులను నెలకొల్పింది. 2021 యుఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన ఇద్దరు అన్‌సీడెడ్ క్రీడాకారిణుల మధ్య శనివారం రాత్రి జరిగిన పోటీలో బ్రిటిష్ యువకెరటం ఎమ్మా రదుకాను కెనాడాకు చెందిన 19ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది. దీంతో యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది. 150ర్యాంక్‌లో ఉన్న ఎమ్మా.. 73వ ర్యాంక్ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న బ్రిటన్ మహిళగా నిలిచింది. బ్రిటన్ తరఫున 1977లో వర్జీనియా వేడ్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుపొందింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఎమ్మా మొదటి నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శించి ఆ సెట్‌ను 6-4తేడాతో గెలిచింది. మొదటి సెట్‌ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆడిన ఎమ్మా ఇక రెండోసెట్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించి 6-3 తేడాతో కైవసం చేసుకొని తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. టైటిల్ విజేతకు 2.5మిలయన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. దీంతో ఆమె ర్యాంకు ఒక్కసారిగా 150 నుంచి 23కు చేరింది. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ ఆదివారం అర్ధరాత్రి జరగనుంది. ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ జకోవిచ్, రెండోస్థానంలో ఉన్న మెద్వదెవ్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. జకోవిచ్ ఇప్పటివరకు 20గ్రాడ్స్లామ్ టైటిళ్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే క్యాలెండర్ ఇయర్ గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.
ఎమ్మా ఖాతాలో పలు రికార్డులు..
18ఏళ్ల బ్రిటన్ యువ క్రీడాకారిణి యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. 2014లో సెరెనా విలియమ్స్(అమెరికా) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా, 44ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన బ్రిటిష్ మహిళగా నిలిచింది. 2016లో ఆండీ ముర్రే తర్వాత బ్రిటన్ తరఫున ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన మహిళగా, మారియా షరపోవా తర్వాత పిన్న వయస్సులో ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన టీనేజర్‌గా నిలిచింది. షరపోవా 2004లో 17ఏళ్ల వయసులో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుంది. ఇక మార్టినా హింగిస్ 1999లో 18వ ఏట యుఎస్ ఓపెన్ గెలుపొందింది. అలాగే యుఎస్ ఓపెన్ అర్హత టోర్నీద్వారా మెయిన్ డ్రాలోకి ప్రవేశించి ఎమ్మా టైటిల్‌ను ఎగరేసుకుపోవడం విశేషం.
ఎమ్మా రెడుకాను టైటిల్‌ను ముద్దాడిందిలా..
తొలిరౌండ్ ఒగేలే 6-2, 6-3
రెండోరౌండ్ జంగ్ 6-2, 6-4
మూడోరౌండ్ సొర్రిబెస్ 6-0, 6-1
ప్రిక్వార్టర్స్ రోజర్స్ 6-2, 6-1
క్వార్టర్స్ బెన్సిక్(11) 6-3, 6-4
సెమీస్ సక్కారి(17) 6-1, 6-4
ఫైనల్ ఫెర్నాండెజ్‌పై 6-4, 6-3