Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాంచెస్టర్ టెస్టుపై సౌరవ్ గంగూలీ
కోల్‌కత : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మాంచెస్టర్ టెస్టుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. టీమ్ ఇండియా సహాయక సిబ్బందిలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో మాంచెస్టర్ టెస్టును రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ, ఈసీబీలు సంయుక్త నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మాంచెస్టర్ టెస్టు రద్దుతో ఈసీబీ బీమా డబ్బులు ఆశిస్తోండగా.. బీసీసీఐ సిరీస్ విజయమే ప్రధానంగా భావిస్తోంది. మాంచెస్టర్ టెస్టును వచ్చే ఏడాది జూన్‌లో రీ షెడ్యూల్ చేసేందుకు బీసీసీఐ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. రీ షెడ్యూల్ టెస్టు భారత్, ఇంగ్లాండ్ ఏకైక టెస్టుగా కాకుండా.. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఉంటుందని తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ' 2007 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై భారత్ సాధించిన మరో సిరీస్ విజయంగానే మేము దీన్ని చూడాలని అనుకుంటున్నాం. బీసీసీఐకి టెస్టు క్రికెటే అంతిమం. ఈ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదు. అదనపు వన్డేలు, టీ20లు ఆడేందుకు మాకు ఎటువంటి సమస్య లేదు. తర్వాత ఆడబోయే టెస్టు మ్యాచ్‌ను.. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగానే చూడాలి. ఏకైక టెస్టు మ్యాచ్‌గా పరిగణించకూడదు' అని గంగూలీ తెలిపాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో ఈ టెస్టు మ్యాచ్ పరిస్థితిపై చర్చించేందుకు గంగూలీ వచ్చే నెలలో ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. గంగూలీ పర్యటనలో ఈ టెస్టు మ్యాచ్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పటౌడీ టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-1తో ముందంజలో కొనసాగుతోంది.