Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఎస్ ఓపెన్ మెద్వదేవ్ సొంతం
- రికార్డు స్లామ్ వేటలో జకోవిచ్‌కు షాక్
- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2021
న్యూయార్క్‌లో నయా చరిత్ర నమోదైంది. ప్రపంచ టెన్నిస్ అభిమానులు సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ రికార్డు గ్రాండ్‌స్లామ్, రికార్డు క్యాలెండర్ స్లామ్ విజయం కోసం ఎదురు చూడగా.. రష్యా స్టార్ ఆటగాడు డానిల్ మెద్వదేవ్ గ్రాండ్‌స్లామ్ చరిత్రలో తనదైన గ్రాండ్ ఎంట్రీతో అదరగొట్టాడు. కెరీర్లో మూడోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తలపడిన డానిల్ మెద్వదేవ్.. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ముద్దాడాడు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్న తొలి రష్యా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ నం.1 జకోవిచ్‌ను వరుస సెట్లలో ఓడించిన మెద్వదేవ్ యుఎస్ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని మాస్కోకు పట్టుకెళ్లాడు.
నవతెలంగాణ-న్యూయార్క్
2021 తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్, ఆస్ట్రేలియన్ ఓపెన్. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జకోవిచ్ చేతిలో మెద్వదేవ్ పరాజయం పాలయ్యాడు. 2021 చివరి గ్రాండ్‌స్లామ్ ఫైనల్, యుఎస్ ఓపెన్. టైటిల్ కోసం బరిలో మెద్వదేవ్, జకోవిచ్. టెన్నిస్ ఓపెన్ శకంలో ఆల్‌టైమ్ రికార్డు టైటిళ్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు నొవాక్ జకోవిచ్ ఎదురు చూస్తున్నాడు. ఫైనల్‌కు ముందు మెద్వదేవ్‌కు మీడియా సమావేశంలో ఓ ప్రశ్న ఎదురైంది. మెల్బోర్న్ ఓటమి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అని అడుగగా.. ' మంచిది, నేను ఇంకా ఎంతో మెరుగు పడాలనే విషయం నేర్చుకున్నాను' అని బదులిచ్చాడు. రికార్డు గ్రాండ్‌స్లామ్‌తో పాటు అరుదైన క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ రేసులో ఉన్న జకోవిచ్‌ను ఓడించటం అంత సులువైన విషయం కాదు. కానీ న్యూయార్క్‌లో భిన్నమైన కథతో వచ్చిన డానిల్ మెద్వదేవ్.. టెన్నిస్ ప్రపంచానికి కొత్త చాంపియన్‌ను పరిచయం చేశాడు. లోపమే లేనట్టు విజృంభించే జకోవిచ్‌ను బేస్‌లైన్ వ్యూహంతో తిప్పికొట్టాడు. 6-4, 6-4, 6-4తో వరుస సెట్లలో అద్భుత రీతిలో ఓడించాడు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్‌ను 135 నిమిషాల్లోనే మట్టికరిపించి.. కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది యుఎస్ ఓపెన్‌లో ఇద్దరు కొత్త చాంపియన్లు అవతరించారు. మహిళల సింగిల్స్ ట్రోఫీని బ్రిటన్ భామ ఎమ్మా ఎగరేసుకుపోగా.. మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను రష్యన్ స్టార్ మెద్వదేవ్ వశ పరుచుకున్నాడు.
జోకర్‌కు భంగపాటు : ప్రత్యర్థికి సింగిల్ సెట్ కోల్పోకుండా వరల్డ్ నం.2 డానిల్ మెద్వదేవ్ ఫైనల్‌కు చేరుకోగా.. వరుస సెట్లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలుపొందాడు జకోవిచ్. ఏకంగా ఆరు మ్యాచుల్లో ప్రత్యర్థులకు దండిగా గేములు కోల్పోయాడు. ఈ సమీకరణాలతో సంబంధం లేకుండా జకోవిచ్ ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అందకుండా పోయిన గ్రాండ్‌స్లామ్.. న్యూయార్క్‌లో ఏం చేస్తే దక్కుతుందనే విషయంలో స్పష్టమైన క్లారిటీతో ఉన్న మెద్వదేవ్ కోర్టులోకి రాగానే పక్కా ప్రణాళిక అమలు పరిచాడు. బేస్‌లైన్ గేమ్‌తో జకోవిచ్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఓ వైపు కోర్టులో గోడ కట్టేసిన మెద్వదేవ్.. జకోవిచ్ అనవసర తప్పిదాలు చేసేందుకు ఉసి గొలిపాడు. మెద్వదేవ్ తెలివిగా ఆడుతూ పాయింట్లు సాధించటంతో జకోవిచ్ కోర్టులో అసహనంతో కనిపించాడు. ఓటమి అనంతరం రాకెట్‌ను నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో ఓటమితో గోల్డెన్ స్లామ్ అవకాశం చేజార్చుకున్న జకోవిచ్.. తాజాగా న్యూయార్క్‌లో ఓటమితో క్యాలెండర్ స్లామ్ రికార్డుకు దూరమయ్యాడు. ఈ రెండు ఓటములు జకోవిచ్‌కు వరుస సెట్లలోనే రావటం గమనార్హం.
ఫైనల్లో తొలి గేమ్ నుంచే జకోవిచ్ తడబాటు మొదలైంది. తొలి గేమ్‌లో 40-15తో ముందున్న జకోవిచ్.. ఆ గేమ్‌ను కోల్పోయాడు. వరుసగా తొలి రెండు గేములు గెల్చుకున్న మెద్వదేవ్ 2-0తో దూసుకెళ్లాడు. తొలి సెట్లో జకోవిచ్ తర్వాత సొంత సర్వ్‌లో గేములు నిలుపుకున్నా ఫలితం లేకపోయింది. 6-4తో తొలి సెట్‌ను మెద్వదేవ్ సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ మరింత రసవత్తరంగా మొదలైంది. తొలి నాలుగు గేముల్లో జకోవిచ్, మెద్వదేవ్‌లు సర్వీస్ గేములు కాపాడుకున్నారు. 2-2తో సమవుజ్జీలుగా నిలిచారు. ఈ సమయంలో మెద్వదేవ్ పంజా విసిరాడు. సర్వీస్ బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యం సాధించాడు. ఈ సెట్లోనూ జకోవిచ్ పుంజుకోవటంలో విఫలమయ్యాడు. జకోవిచ్‌ను ఇరకాటంలో పడేసిన మెద్వదేవ్ 6-4తో రెండో సెట్‌నూ కైవసం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో మెద్వదేవ్ మెరుపు ప్రదర్శన చేశాడు. జకోవిచ్ సర్వీస్ రెండు సార్లు బ్రేక్ చేసిన మెద్వదేవ్.. తన సర్వీస్‌లో గేమ్‌లు నిలుపుకుని 4-0 ఆధిక్యంలో నిలిచాడు. గ్రాండ్‌స్లామ్ విక్టరీకి రెండు గేముల దూరంలో ఉండగా జకోవిచ్‌కు పాయింట్లు కోల్పోయిన మెద్వదేవ్.. మ్యాచ్‌ను మరో సెట్‌కు వెళ్లనీయకుండా జాగ్రత్త వహించాడు. 6-4తో మూడో సెట్‌ను సొంతం చేసుకుని యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేతగా అవతరించాడు.
బేస్‌లైన్, నెట్ హీరో : వరల్డ్ నం.2 డానిల్ మెద్వదేవ్ (రష్యా) యుఎస్ ఓపెన్ నెగ్గిన ఆనందంలో కోర్టులోనే పడిపోయాడు. ' ఇది కల, నిజమా? అన్నట్టు స్పందించాడు. ర్యాంకింగ్స్‌లో టాప్-3లోకి అడుగుపెట్టినా.. టెన్నిస్ బిగ్-3లో భాగమయ్యేందుకు మెద్వదేవ్ కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నాడు. గ్రాండ్‌స్లామ్ విజయం లేని మెద్వదేవ్ బిగ్-3 జాబితాలోకి చేరేందుకు ఎంతగానో నిరీక్షించాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి.. మెన్స్ సింగిల్స్ సర్క్యూట్లో వర్థమాన తరం రేసును మొదలుపెట్టాడు. 25 ఏండ్ల మెద్వదేవ్ ఆదివారం న్యూయార్క్‌లో జకోవిచ్‌కు రికార్డు స్లామ్ నిరాకరించటమే కాదు, సరికొత్త పోటీకి తెరతీశాడు. వరల్డ్ నం.1 ఆటగాడి కోసం మెద్వదేవ్ సిద్ధం చేసుకున్న వ్యూహం ఇప్పుడు అతడిపై ప్రశంసలు కురిపిస్తోంది. వేగవంతమైన సర్వ్‌లు, షాట్లతో విరుచుకుపడే జకోవిచ్‌కు బదులిచ్చేందుకు మెద్వదేవ్ కోర్టులో మరింత వెనక్కి నిలబడ్డాడు. రిటర్న్ షాట్ కొట్టేందుకు తగినంత సమయం దొరికేలా చూసుకున్నాడు. బేస్‌లైన్, నెట్ వద్ద జకోవిచ్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. మెద్వదేవ్ అద్భుత వ్యూహం, క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన అతడిని యుఎస్ ఓపెన్ విజేతగా నిలిపింది. యుఎస్ ఓపెన్‌లో సింగిల్స్ ట్రోఫీ అందుకున్న తొలి రష్యన్ క్రీడాకారుడిగా మెద్వదేవ్ చరిత్ర సృష్టించాడు.
ఫైనల్లో ఎవరెలా..
జకోవిచ్ మెద్వదేవ్
06 ఏస్‌లు 16
03 డబుల్‌ఫాల్ట్స్ 09
01 బ్రేక్పాయింట్లు 04
12 గేములు 18
27 విన్నర్లు 38
38 అనవసర తప్పిదాలు 31
83 పాయింట్లు 99
జోకర్ కన్నీటి పర్యంతం
నొవాక్ జకోవిచ్ న్యూయార్క్‌లో కన్నీటి పర్యంతమయ్యాడు. 20 గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించినా, అభిమానుల హృదయాలు నెగ్గటంలో జకోవిచ్ విజయవంతం కాలేదు!. ప్రత్యేకించి యుఎస్ ఓపెన్‌లో అభిమానులు ఎన్నడూ జకోవిచ్ విజయాన్ని కాంక్షించలేదు. రికార్డు గ్రాండ్‌స్లామ్ ముంగిట ఎదురైన పరాజయానికి జకోవిచ్ తనదైన శైలిలోనే స్పందించాడు. రాకెట్‌ను నేలకొట్టి కొట్టాడు. అయితే, న్యూయార్క్‌లో ట్రోఫీ దక్కపోయినా.. అంతకుమించిన బహుమానమే జోకర్‌కు చిక్కింది. న్యూయార్క్‌లో ఎన్ని గ్రాండ్‌స్లామ్‌లు సాధించినా లభించని అభిమానుల మద్దతు.. మెద్వదేవ్‌తో మ్యాచ్‌లో జోకర్‌కు లభించింది. మూడో సెట్లో మెద్వదేవ్ మ్యాచ్ పాయింట్ ముంగిట నిలిచినప్పుడు.. స్టేడియం మొత్తం జకోవిచ్ నామస్మరణతో మార్మోగింది. అభిమానుల మద్దతుతో కుర్చీలో కూర్చుండిపోయిన జకోవిచ్.. ముఖానికి టవల్ పెట్టుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు. ' ఈ రోజు నేను మ్యాచ్ నెగ్గలేదు. అయినా, నా హృదయం సంతోషంతో నిండిపోయింది. మీరు (అభిమానులు) నన్ను మరింత ప్రత్యేకంగా నిలిపారు. ఈ రోజుతో నా హృదయాన్ని తాకారు. న్యూయార్క్‌లో ఇలా ఎప్పుడూ భావించలేదు. మీ మద్దతుకు కృతజ్ఞతలు. ఐ లవ్ యూ, త్వరలోనే మళ్లీ కలుద్దాం' అని జకోవిచ్ మ్యాచ్ అనంతరం భావోద్వేగంతో అన్నాడు.