Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జావెలిన్ త్రో కోచ్ ఉవె హాన్‌పై వేటు
- భారత అథ్లెటిక్స్ సమాఖ్య నిర్ణయం
న్యూఢిల్లీ : ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకం భారత చిరకాల స్వప్నం. భారత క్రీడా రంగ దిగ్గజాలు ఎదురు చూసినది ఒలింపిక్స్‌లో అథ్లెటిక్ పతకం కోసమే!. 125 ఏండ్ల ఒలింపిక్ చరిత్రలో భారత్‌కు అథ్లెటిక్స్‌లో తొలి పసిడి పతకం అందించాడు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. యువ అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతక బాటలో నడిపించిన గురువు ఉవే హాన్. జావెలియన్ను 100 మీటర్లకు పైగా విసిరిన ఏకైక అథ్లెట్ ఈ జర్మనీ దిగ్గజం. బయో మెకానికల్ నిపుణుడు డా. బార్టినిట్జ్తో కలిసి ఉవే హాన్ టోక్యో 2020 ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాను పసిడి విజేతగా నిలిపేందుకు కృషి చేశారు. భారత్‌కు చారిత్రక పసిడి పతకం అందించిన కోచ్‌కు సహజంగానే ప్రశంసల జల్లు, పారితోషికంలో పెంపు సహా ఇతర నజరానాలు ప్రకటించటం సహజమే. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో కోచ్ ఉవే హాన్ పని తీరును సమీక్షించిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) అతడిపై వేటు వేసింది. కోచ్‌గా ఉవే హాన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆ విమర్శల ఫలితమే : ' ఉవే హాన్ పనితీరు బాగా లేదు. అతడిని కోచ్‌గా తొలగిస్తున్నాం. ఉవే హాన్ స్థానంలో ఇద్దరు కోచ్‌లను తీసుకు రానున్నాం. మేము చేయాల్సింది చేస్తున్నాం. విశ్లేషణలు జరగటం లేదు, చర్యలు తీసుకోవటం లేదు అనుకోవద్దు. ప్రతిదీ పరిగణనలోకి తీసుకుంటాం. బయో మెకానికల్ నిపుణుడు డా. బార్టినిట్జ్ కొనసాగుతారు. నిపుణులైన మంచి కోచ్‌లను తీసుకు రావటం సులువు కాదు. కనీసం ఒక్క మంచి కోచ్నైనా నియమించేందుకు కృషి చేస్తాం'అని భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు అదిలె సుమరివాలా తెలిపాడు. కోచ్ ఉవే హాన్ తొలగింపు వెనుక క్రీడా వ్యవస్థ పట్ల అతడు చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. పని తీరు బాగుండటం అంటే పతకాలు సాధింటం కాదు, పాలకులను పొగడటమని మరోసారి భారత అథ్లెటిక్స్ సమాఖ్య రుజువు చేసింది. ' నేను తొలుత భారత్‌కు వచ్చినప్పుడు మార్పు తీసుకు రాగలనని అనుకున్నాను. సారు, అథ్లెటిక్స్ సమాఖ్యతో కలిసి పని చేస్తూ మార్పు తీసుకు రావటం చాలా కష్టం. అవగాహన రాహిత్యం? నిర్లక్ష వైఖరి? ఏది కారణమో తెలియదు. క్యాంప్‌లు, టోర్నీలను పక్కనపెడితే.. అథ్లెట్లకు అవసరమైన ఆహారం సైతం సరిగా అందదు. టాప్ అథ్లెట్లకు సైతం ఇదే పరిస్థితి. ఏదైనా సరిగా అందితే, అదే మాకు సంతోషం' అని ఉవే హాన్ గతంలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్ పసిడి కోచ్‌పై భారత అథ్లెటిక్స్ సమాఖ్య వేటు వేసింది.