Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు
కొలంబో : కండ్లుచెదిరే యార్కర్లతో ఓ దశాబ్దానికి పైగా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన శ్రీలంక క్రికెట్ దిగ్గజం, యార్కర్ల కింగ్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. 2011లో టెస్టు క్రికెట్‌కు దూరమైన మలింగ, ఆ తర్వాత వన్డేలకు గుడ్ బై పలికాడు. కేవలం టీ20 ఫార్మాట్లోనే కొనసాగుతూ వచ్చాడు. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టులో చోటు దక్కలేదు. సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు మలింగ మంగళవారం ట్వీట్ చేశాడు. ప్రపంచ టీ20 క్రికెట్ దిగ్గజంగా లసిత్ మలింగ చెరగని ముద్ర వేశాడు.
' ఈ రోజు టీ20 క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా టీ20 కెరీర్లో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని మలింగ ట్వీట్ చేశాడు. 2020 ఐపీఎల్ సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న మలింగను.. 2021 సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్ వదులుకుంది. దీంతో ఐపీఎల్‌లోనూ మలింగ కెరీర్ ఈ ఏడాదే ముగిసింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో మలింగ ఎదురులేని గణాంకాలు నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నాడు. రెండుసార్లు వరుసగా నాలుగు బంతుల్లో నాలుగేసి వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్లో 100 వికెట్లు కూల్చిన తొలి బౌలర్‌గా నిలిచాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ (వన్డే, టీ20)లో 295 మ్యాచుల్లో 390 వికెట్లు పడగొట్టాడు. 2014 ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలుపొందిన శ్రీలంక జట్టుకు మలింగ నాయకత్వం వహించాడు. 84 టీ20ల్లో 107 వికెట్లు కూల్చిన మలింగ.. 226 వన్డేల్లో 338 వికెట్లు తీసుకున్నాడు. 30 టెస్టుల్లో 101 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 122 మ్యాచుల్లో 170 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు 12 ఏండ్లు ప్రాతినిథ్యం వహించిన మలింగ.. ఆ జట్టు నుంచి నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు.