Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత జట్టులో లభించని చోటు
- ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ : భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బత్రకు ఊహించని షాక్ ఎదురైంది. సెప్టెంబర్ 28 నుంచి దోహాలో జరుగనున్న ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే భారత జట్టులో మనిక బత్రకు చోటు దక్కలేదు. ఆసియా చాంపియన్‌షిప్స్ జట్ల ఎంపిక బారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య సోనెపట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి మనిక బత్ర హాజరు కాలేదు. జాతీయ జట్టులో చోటు కోసం, శిక్షణ శిబిరం హాజరు తప్పనిసరి చేసిన సమాఖ్య.. ఈ మేరకు బత్రాను జట్టులోకి ఎంపిక చేయలేదు. మనిక బత్ర స్థానంలో వరల్డ్ నం.97 సుతీర్థ ముఖర్జీ మహిళల జట్టుకు నాయకత్వం వహించనుంది. వరల్డ్ నం.131 ఆహిక ముఖర్జీ, వరల్డ్ నం.132 అర్చన కామత్‌లు మహిళల జట్టులో ఉన్నారు. వెటరన్ ఆటగాడు వరల్డ్ నం.33 అచంట శరత్ కమల్ మెన్స్ జట్టును నడిపించనున్నాడు. జి. సతియన్ (వరల్డ్ నం.38), హర్మీత్ దేశారు (వరల్డ్ నం.72), మానవ్ ఠక్కర్ (వరల్డ్ నం.134), సానిల్ శెట్టి (వరల్డ్ నం.247)లు భారత పురుషుల జట్టులో చోటు దక్కించుకున్నారు. టేబుల్ టెన్నిస్ దిగ్గజం చైనా ఈసారి ఆసియా చాంపియన్‌షిప్స్‌కు దూరంగా ఉంటోంది. దీంతో పురుషుల విభాగంలో భారత్ పతక అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. పుణెలో వ్యక్తిగత కోచ్ వద్ద శిక్షణ తీసుకుంటానని మనిక బత్ర చెప్పినా.. టేబుల్ టెన్నిస్ సమాఖ్య జాతీయ శిక్షణ శిబిరానికి రావాలనే కచ్చితమైన నియమం విధించింది.
మెన్స్ జట్టు : మానవ్ ఠక్కర్, శరత్ కమల్, జి.సతియన్, హర్మీత్ దేశారు, సానిల్ శెట్టి.
ఉమెన్స్ జట్టు : సుతీర్థ ముఖర్జీ, శ్రీజ ఆకుల, అహిక ముఖర్జీ, అర్చన కామత్.