Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌తో టీ20 వరల్డ్‌కప్ పోరుపై హసన్ అలీ
కరాచీ : పొరుగు దేశాలు భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ నిలిచిపోవటంతో.. ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు ముఖాముఖి పోటీపడుతున్నాయి. ఐసీసీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఎదురులేని రికార్డుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను తొలి మ్యాచ్‌లో, చివరి మ్యాచ్‌లో మట్టి కరిపించిన ధోనీసేన తొలి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఎదుర్కొనుంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మెగా మ్యాచ్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పైచేయి సాధించిన పాకిస్థాన్.. చాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ స్ఫూర్తితోనే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను అధిగమిస్తామని ఆ జట్టు పేసర్ హసన్ అలీ అంటున్నాడు. ' 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు, పాకిస్థాన్ గొప్ప ఫామ్‌లో ఉంది. టీ20 వరల్డ్‌కప్‌లోనూ అదే స్ఫూర్తి కనబరుస్తాం. ఇరు దేశాల అభిమానుల అంచనాలతో భారత్‌తో మ్యాచ్ ఎప్పుడూ ఒత్తిడితో కూడుకున్నదే. సాధారణంగా క్రికెట్‌ను చూడని వారు సైతం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫలితంపై ఆసక్తి చూపుతారు. ఇది ఆటగాళ్లపై ఒత్తిడి మరింత పెంచుతుంది. అయినా, మేము ఉత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం' అని హసన్ అలీ అన్నాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం భారత్, పాకిస్థాన్‌లు రెండు సార్లు తలపడ్డాయి. 2018 ఆసియా కప్, 2019 వన్డే వరల్డ్‌కప్‌లలో పాకిస్థాన్‌ను టీమ్ ఇండియా చిత్తుగా ఓడించింది.