Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభిమానుల ముందుకు ప్రైమ్ వాలీబాల్ లీగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : రెండేండ్ల విరామం అనంతరం ప్రైమ్ వాలీబాల్ లీగ్ అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈఓ జో భట్టాచార్య బుధవారం ప్రకటించారు. ప్రాంఛైజీలు లీగ్ యాజమాన్యంలో భాగంగా ఉండే నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తరహాలో ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను రూపొందించారు. ప్రొ వాలీబాల్ లీగ్‌లో పాలుపంచుకున్న కాలికట్ హీరోస్, కోచి బ్లూస్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై బ్లిట్జ్లు ఈ లీగ్‌లో కొనసాగుతుండగా.. ముంబయి ప్రాంఛైజీ స్థానంలో కొత్తగా బెంగళూర్ టొర్పడోస్ ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో పోటీపడనుంది. ఆరు జట్ల ప్రాంఛైజీల యజమానులు హాజరైన ఓ సమావేశంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీఈవో భట్టాచార్య వివరాలు వెల్లడించారు. వర్థమాన క్రీడాకారులు, కోచ్‌లకు అవకాశాలు కల్పించే అత్యున్నత వేదికగా ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో ఆటగాళ్ల వేలం నిర్వహించి, వచ్చే ఏడాది ఆరంభంలో లీగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో వాలీబాల్‌కు రికార్డు స్థాయిలో 33.5 మిలియన్ల మంది వీక్షించారని, ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు అదే స్థాయిలో ఆదరణ ఆశిస్తున్నామని లీగ్ ప్రసారదారు సోనీ నెట్వర్క్ మార్కెటింగ్ చీఫ్ నెవిల్లే బస్టవల్లా తెలిపారు. డిసెంబర్లో నిర్వహించే ఆటగాళ్ల వేలంలో ప్రముఖ విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారని సీఈఓ భట్టాచార్య పేర్కొన్నారు.