Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ 2021 సీజన్ పున ప్రారంభం
- సెప్టెంబర్ 19న యుఏఈలో పోరు షురూ
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు సమయం సమీపిస్తోంది. అన్ని జట్లు ఆటగాళ్లు అత్యుత్తమ ఫామ్, ఫిట్నెస్తో ఉండాలని కోరుకుంటున్నాయి. పొట్టి ప్రపంచకప్‌లోకి అడుగు పెట్టడానికి ముందు.. క్రికెటర్లు టీ20 మెగా లీగ్ ఐపీఎల్లో అనుభవం గడించనున్నారు. యుఏఈ వేదికగానే జరుగనున్న ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్‌కు ఐపీఎల్ 2021 కొనసాగింపు సీజన్ సన్నాహాకంగా మారింది. సెప్టెంబర్ 19న చెన్నై, ముంబయి పోరుతో ఐపీఎల్ 2021 సీజన్ పున ప్రారంభం కానుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోవిడ్-19 దెబ్బకు అర్థాంతరంగా వాయిదా పడింది. సుదీర్ఘ విరామం అనంతరం ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కాబోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వేదికగా ఐపీఎల్ 2021 కొనసాగింపు సీజన్‌కు రంగం సిద్ధమైంది. దుబారు, అబుదాబి, షార్జా నగరాలు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఐపీఎల్ ప్రాంఛైజీలు ఐపీఎల్ సమరానికి సిద్ధమవుతుండగా.. కొనసాగింపు సీజన్‌కు ఈ సారి మరింత ప్రత్యేకత ఏర్పడింది. అక్టోబర్ 17న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ షురూ కానుంది. దీంతో క్రికెటర్లు ఐపీఎల్ 2021 సీజన్‌ను టీ20 ప్రపంచకప్‌కు సన్నాహాకంగా భావిస్తున్నారు. ఇతర దేశాల క్రికెటర్లకు ఐపీఎల్ అనుభవం ప్రపంచకప్‌లో కీలకం కానుండగా.. ఐపీఎల్ పని ఒత్తిడి, పని భారం భారత క్రికెటర్లపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం కనిపిస్తోంది. భారత్‌లో జరిగిన ఐపీఎల్ 2021 ప్రథమార్థంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, ముంబయి ఇండియన్స్‌లు పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతున్నాయి. ఎనిమిది మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు విజయాలు సాధించగా, ఏడు మ్యాచుల్లోనే చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఐదు విజయాలు నమోదు చేశాయి. ముంబయి ఇండియన్స్ ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించింది. ఏడు మ్యాచుల్లో ఏకంగా ఆరు పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలువగా.. ఏడు మ్యాచుల్లో రెండు విజయాలతో కోల్‌కత నైట్‌రైడర్స్, ఎనిమిది మ్యాచుల్లో మూడు విజయాలతో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌లు కింది నుంచి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఇప్పటికే పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా.. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లు తమ చివరి మ్యాచుల్లో అన్నింటా విజయాలు సాధిస్తే టాప్-4లో నిలిచే అవకాశం దక్కించుకుంటాయి!.
పని భారం పరేషాన్! : ఆతిథ్య దేశంగా టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఐసీసీ ట్రోఫీ నెగ్గాలనే తపనతో ఉన్న విరాట్ కోహ్లి.. సహచరులపై పని భారం సమస్యను ఎదుర్కొనున్నాడు. ఐపీఎల్ 2020లో పని ఒత్తిడి కారణంగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాడు. తాజాగా అర్థాంతరంగా ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో ప్రధాన సీమర్ జశ్‌ప్రీత్ బుమ్రా నాలుగు టెస్టుల్లో 151 ఓవర్లు సంధించాడు. భారత టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో బుమ్రా కీలకం. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు బుమ్రా సేవలు అత్యంత అవశ్యం. ఐపీఎల్లో బుమ్రా అలసిపోయినా, ఫిట్నెస్ కోల్పోయినా ప్రపంచకప్ వేటలో భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ కానుంది. పంజాబ్ కింగ్స్ పేసర్ మహ్మద్ షమిదీ ఇదే సమస్య.
పంజాబ్ ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న షమిని ఆ జట్టు ఆచితూచి వాడుకోవాలి. ఈ ఇద్దరు పేసర్ల విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోవాల్సి అవసరం ఉంది. పేసర్లు మినహా టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన ఇతర ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ వరంగా మారనుంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహర్‌లు ఐపీఎల్లో అత్యుత్తమ ఫామ్ అందుకోవాలని చూస్తున్నారు. కెఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ ఫలితం, ప్రదర్శన తన వ్యక్తిగత ఆటపై పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా రానున్న కెప్టెన్ విరాట్ కోహ్లి.. ద్వితీయార్థంలో బెంగళూర్ ఓపెనర్‌గా ఏం చేస్తాడో చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.