Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిట్ టు ఫ్లై దృవీకరణ కోసం ఎదురుచూపు
లండన్: భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బంది కోవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకున్నారు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌లు పది రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నారు. శాస్త్రి సహా ముగ్గురు ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో రెండు సార్లు నెగెటివ్‌గా వచ్చినట్టు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. శాస్త్రి, భరత్, శ్రీధర్‌లు ప్రస్తుతం ఐసోలేషన్ వీడినా.. స్వదేశానికి రావటానికి మరికొన్ని అనుమతులు అవసరం. కోవిడ్-19 నుంచి కోలుకున్న శాస్త్రి బృందానికి విమాన ప్రయాణానికి 'ఫిట్ టు ఫ్లై' దృవ పత్రం అవసరం. ' ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం సీటీ స్కోరు కనీసం 38 ఉంటేనే విమాన ప్రయానానికి అనుమతి ఇస్తారు. సీటీ స్కోరు రాగానే రెండు రోజుల్లోనే అందరూ స్వదేశానికి రానున్నారు' అని ఆ అధికారి తెలిపారు. నాలుగో టెస్టు మూడో రోజు రవిశాస్త్రికి కోవిడ్ సోకగా.. ఆ తర్వాత భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్ సైతం ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. మాంచెస్టర్‌లో ఐదో టెస్టుకు ముందు జట్టు ఫిజియోథెరపిస్ట్ కోవిడ్-19 బారిన పడటంతో ఆ టెస్టును అర్థాంతరంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ది ఓవల్ టెస్టు సందర్భంగా రవిశాస్త్రి పుస్తక విడుదల కార్యక్రమంలో మాస్క్‌లు లేకుండా సుమారు 150 మంది అతిథులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరమే భారత జట్టు సహాయక సిబ్బందిలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.