Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 కెప్టెన్‌గా తప్పుకోనున్న విరాట్ కోహ్లి
- 2021 టీ20 ప్రపంచకప్ వరకే సారథ్యం
- క్రికెట్ సూపర్‌స్టార్ సంచలన నిర్ణయం
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం. మూడు ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టును అగ్రపథాన నడిపిస్తున్న విరాట్ కోహ్లి.. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మాట్ సారథ్యం వదులుకోనున్నట్టు ప్రకటించాడు. టీ20 కెప్టెన్‌గా తప్పుకోనున్న విరాట్ కోహ్లి.. టెస్టు, వన్డే ఫార్మాట్లలో నాయకత్వం కొనసాగించనున్నాడు. హిట్‌మ్యాన్, ఐపీఎల్ విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ భారత జట్టు నూతన టీ20 కెప్టెన్‌గా ఎంపిక కావటం లాంఛనమే.
నవతెలంగాణ-ముంబయి
ఊహాగానాలు నిజమయ్యాయి. అంచనాల ప్రకారమే భారత క్రికెట్ జట్టు నాయకత్వంలో మార్పునకు రంగం సిద్ధమైంది. టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా తప్పుకోనున్నట్టు విరాట్ కోహ్లి గురువారం బాంబ్ పేల్చాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో యుఏఈ వేదికగా జరిగే ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించనున్న విరాట్ కోహ్లి.. మెగా ఈవెంట్ ముగిసిన వెంటనే నాయకత్వ పగ్గాలు వదిలేయనున్నాడు. ఈ మేరకు విరాట్ కోహ్లి సోషల్ మీడియా ఖాతాలో ఓ లేఖ ఉంచాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఎనలేని పని భారం పడుతోందని.. టెస్టులు, వన్డేల్లో జట్టును మరింత శక్తిమంతంగా నడిపించేందుకు టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి వదులుకునే నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లి ప్రకటించాడు. ఐసీసీ టోర్నీ నెగ్గని కెప్టెన్‌గా విరాట్ కోహ్లిపై బలమైన విమర్శ కొనసాగుతున్న నేపథ్యంలో.. టీ20 ప్రపంచకప్ సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించాలనే డిమాండ్ కొంత కాలంగా బలంగా వినిపిస్తోంది. నాయకుడిగా జట్టుకు టీ20ల్లో ఎదురులేని విజయాలు అందించినా.. ఐసీసీ ట్రోఫీ లోటు కోహ్లిపై ఒత్తిడి పెంచింది. ద్వంద్వ కెప్టెన్సీ వార్తలను బీసీసీఐ కార్యదర్శి జై షా కొట్టిపారేసిన రెండు రోజుల్లోనే విరాట్ కోహ్లి నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
పని ఒత్తిడితోనే : కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో విపరీత పని భారంతోనే టీ20 సారథ్యం వదులుకుంటున్నట్టు విరాట్ కోహ్లి తెలిపాడు. ' పని భారం అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యమైన విషయం. గత 8-9 ఏండ్లుగా మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాను, గత 5-6 ఏండ్లుగా కెప్టెన్సీ వహిస్తున్నాను. టెస్టులు, వన్డేల్లో జట్టును ముందుకు నడిపేందుకు నాకు కొంత విరామం అవసరం. నాయకుడిగా టీ20 జట్టుకు అన్ని విధాలుగా పని చేశాను, ఇక నుంచి బ్యాట్స్‌మన్‌గా టీ20 జట్టుకు నా సేవలు కొనసాగిస్తాను. ఈ నిర్ణయం తీసుకునేందుకు నాకు ఎంతో సమయం పట్టింది. నా సన్నిహితులు, జట్టు నాయకత్వ బృందం రవిశాస్త్రి, రోహిత్ శర్మలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపాను. ఈ ఏడాది అక్టోబర్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఇదే విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెలక్టర్లతో మాట్లాడాను. భారత క్రికెట్‌కు, భారత క్రికెట్ జట్టుకు నా సామర్థ్యం మేరకు సేవ చేస్తూనే ఉంటాను' అని విరాట్ కోహ్లి లేఖలో రాసుకొచ్చారు. 2017లో ఎం.ఎస్ ధోని నుంచి టీ20 సారథ్య పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లి.. కెప్టెన్‌గా 45 మ్యాచుల్లో 27 విజయాలు అందించాడు. 48.45 సగటు, 143.18 స్ట్రయిక్‌రేట్‌తో 1502 పరుగులు చేశాడు.
కెప్టెన్‌గా ఎదురులేదు! : కెప్టెన్‌గా ఐసీసీ ట్రోఫీ అందుకోలేదనే విమర్శ మినహాయిస్తే.. విరాట్ కోహ్లి నాయకత్వ గణాంకాలు అద్వితీయం. టెస్టులు, వన్డేల్లో జట్టును ముందంజలో నిలిపిన కోహ్లి.. 20 ఓవర్ల ఆటలోనూ భారత్‌కు అద్భుత విజయాలు అందించాడు. కెప్టెన్‌గా అన్ని టీ20 సిరీస్‌లు సాధించిన ఘనత దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో న్యూజిలాండ్‌లో (2020) 5-0తో, ఆస్ట్రేలియాలో (2020) 2-1తో, ఇంగ్లాండ్‌లో (2018) 2-1తో, దక్షిణాఫ్రికాలో (2018) 2-1తో భారత్ సిరీస్ విజయాలు సాధించింది. ఈ దేశాల్లో టీ20 సిరీస్‌లు సాధించిన ఏకైక కెప్టెన్ కోహ్లి. కెప్టెన్‌గా అత్యధిక టీ20 పరుగులు పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ అతడే. 1502 పరుగులతో ఈ జాబితాలో ఓవరాల్‌గా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా వేగంగా వెయ్యి పరుగులు చేసిన రికార్డు సైతం కోహ్లిదే. 30 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లి ఈ మైలురాయి అందుకున్నాడు. భారత్‌కు 45 మ్యాచుల్లో నాయకత్వం వహించిన కోహ్లి 27 మ్యాచుల్లో విజయాలు అందించాడు. రెండు మ్యాచులు టైగా ముగియగా, మరో రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. 65.11 విజయ శాతంతో విరాట్ కోహ్లి ఎదురులేని గణాంకాలు నమోదు చేశాడు. టీ20ల్లో ఎం.ఎస్ ధోని 42 విజయాలు అందించగా.. విరాట్ 27 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.
రోహిత్‌కు పగ్గాలు? : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు నాయకత్వ మార్పు నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసేదే. కానీ నాయకుడిగా తప్పుకోనున్న విరాట్ కోహ్లిపై ఈ నిర్ణయం ఐసీసీ ట్రోఫీ అంచనాల ఒత్తిడిని తగ్గించగలదు. విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలగనుండటంతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పగ్గాలు అందుకోనున్నాడు. బీసీసీఐ అధికారిక ప్రకటన ఇక తరువాయి. కోహ్లి గైర్హాజరీలో రోహిత్ శర్మ 19 టీ20ల్లో భారత్‌ను ముందుండి నడిపించాడు. ఆసియా కప్ విజయాన్ని సైతం అందించాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు రికార్డు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ భారత టీ20 కెప్టెన్ రేసులో ముందున్నాడు.
టీ20 కెప్టెన్‌గా కోహ్లి
మ్యాచులు : 45
విజయాలు : 27
ఓటమి : 14
టై : 02
ఫలితం తేలలేదు : 02
గెలుపు శాతం : 65.11