Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్డే, టీ20 సిరీస్ రద్దు చేసిన న్యూజిలాండ్
- భద్రతా కారణాలతో కివీస్ కీలక నిర్ణయం
- తీవ్ర అయోమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
రావల్పిండి (పాకిస్తాన్)
18 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్లో అడుగుపెట్టింది. పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ రావల్పిండిలో మూడు వన్డేలు, ఐదు టీ20లకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 11నే పాక్‌కు చేరుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. మూడు ప్రాక్టీస్ సెషన్లలో సైతం సాధన చేసింది. సెప్టెంబర్ 17న తొలి వన్డేకు గంటల వ్యవధి ముందు న్యూజిలాండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ పర్యటనను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రావల్సిండిలో క్రికెట్ ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్న అభిమానులు, సిరీస్ నిర్వహణతో ఆర్థిక కష్టాలు గట్టెక్కాలని ఆశించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఊహించని నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెటర్లు షాక్‌కు గురయ్యారు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తన పర్యటనను రద్దు చేసుకోవటంతో.. రానున్న సిరీస్‌లలో పాకిస్తాన్లో ఆడేందుకు ఇతర జట్లు సైతం వెనుకాడేందుకు అవకాశం మెండుగా ఏర్పడింది. ఈ పరిస్థితి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను మరిన్ని కష్టాల్లోకి నెట్టి వేయనుంది.
ఆకస్మిక నిర్ణయం : 2003లో చివరగా పాక్‌లో పర్యటించిన న్యూజిలాండ్ తిరిగి 2021లో ఆ దేశంలో ఆడేందుకు అంగీకారం తెలిపింది. 2002 పర్యటనలో ఆ జట్టు బస చేస్తున్న హోటల్‌కు సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించటంతో ఆ పర్యటనను అర్థాంతరంగా ముగించిన కివీస్.. 2003లో ఆ సిరీస్‌ను పూర్తి చేసింది. అఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్లో భద్రతపై క్రికెట్ దేశాలు జంకుతున్నాయి. న్యూజి లాండ్ క్రికెట్ జట్టుకు పటిష్టమైన భద్రత కల్పించినా, కివీస్ జట్టు భద్రతా అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినా.. భద్రతపై ఓ కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో న్యూజిలాండ్ ప్రధాని ఈ విషయంపై ఫోన్లో మాట్లాడినట్టు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ' ఆటగాళ్ల భద్రత మాకు అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ నిర్ణయమే మాకు బాధ్యతాయుత మార్గంగా కనిపించింది' అని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డెవిడ్ వైట్ తెలిపారు.
ఏ ప్రపంచంలో ఉన్నారు? : పాకిస్తాన్లో వన్డే, టీ20 సిరీస్‌లను రద్దు చేస్తూ న్యూజిలాండ్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నూతన చైర్మన్, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ' అభిమానులు, క్రికెటర్ల పట్ల బాధగా ఉంది. ఏకపక్ష నిర్ణయంతో సిరీస్ నుంచి వైదొలగటం తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. అసలు, ఈ విషయంపై మాతో సంప్రదింపులే లేవు. న్యూజిలాండ్ ఏ ప్రపంచంలో నివసిస్తోంది? కివీస్ సంగతి ఐసీసీలోనే తేల్చుకుంటాం' అని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా ట్వీట్ చేశారు. ' పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో చిరునవ్వులు తీసుకురాగల సిరీస్ వాయిదా పడటం ఎంతో నిరుత్సాహానికి గురి చేసింది. మా భద్రతా యంత్రాంగం సామర్థ్యం, విశ్వసనీయతపై పూర్తి విశ్వాసం ఉంది' అని పాకిస్తాన్ టీ20 కెప్టెన్ బాబర్ ఆజామ్ ట్వీట్ చేశాడు.
ఇంగ్లాండ్ సైతం కష్టమే? : న్యూజిలాండ్‌తో వైట్ బాల్ సిరీస్ అర్థాంతరంగా వాయిదా పడటం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త తలనొప్పులు తీసుకు రానుంది. అక్టోబర్ 13, 14న రావల్పిండి వేదికగా ఇంగ్లాండ్‌తో రెండు టీ20లు ఆడాల్సి ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియా మహిళల జట్టు సైతం పాక్‌లో పర్యటించాల్సి ఉంది. న్యూజిలాండ్ క్రికెట్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులు ఒకే ఏజెన్సీ సంస్థతో భద్రతా ఏర్పాట్లపై నివేదిక అందుకుంటాయి. దీంతో ఇంగ్లాండ్ జట్టు సైతం తమ పర్యటన రద్దు చేసుకునే వీలుంది. పాకిస్తాన్ పర్యటనపై రానున్న 24-48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని ఈసీబీ ప్రకటించింది. బంగ్లాదేశ్ పర్యటనను వాయిదా వేసిన ఈసీబీ.. క్రికెట్ ఆస్ట్రేలియా కల్పించే కోవిడ్-19 సడలింపుల ఆధారంగా యాషెస్ సిరీస్‌పైనా కీలక నిర్ణయం తీసుకోనుంది.
వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఈ సీజన్లో పాక్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ పున ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2017 పీఎస్ఎల్ ఫైనల్‌ను పాక్‌లో నిర్వహించిన పీసీబీ.. శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలతో స్వదేశంలో సిరీస్‌లు ఆడింది. 2018 పీఎస్ఎల్ నాకౌట్ మ్యాచులు, 2019 పీఎస్ఎల్ సీజన్‌కు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్.. స్వదేశంలో పూర్తి స్థాయి అంతర్జాతీయ సీజన్‌పై కన్నేసింది. తాజా పరిస్థితులు పీసీబీ ప్రణాళికలను తలకిందులు చేశాయి.