Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్‌రైజర్స్ స్టార్‌పైనే అందరి దృష్టి
- ఐపీఎల్ 14లో దూకుడుపైనే వార్నర్ దృష్టి
నవతెలంగాణ క్రీడావిభాగం
కొత్త సవాల్ ఎదుర్కొనే ముందు భయం లేదా ఉత్సాహం ఉండటం సహజం. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డెవిడ్ వార్నర్ నయా అవతారం అతడికి నూతన ఉత్సుకత కల్పించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో డెవిడ్ వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. వార్నర్ రెగ్యులర్‌గా ప్రాతినిథ్యం వహించే ఏకైక గ్లోబల్ టీ20 ఇదే. 2018 బాల్ టాంపరింగ్ నిషేధం (2018) అనంతరం, 2019లో వార్నర్ సరికొత్తగా ఐపీఎల్లో దూసుకొచ్చాడు. 2020 సీజన్‌కు కెప్టెన్‌గా తిరిగి సన్‌రైజర్స్ పగ్గాలు అందుకున్న వార్నర్.. వరుసగా హైదరాబాద్‌ను ఐదో సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. 2021 సీజన్ ప్రదర్శన డెవిడ్ వార్నర్ తుది జట్టులో చోటుతో పాటు కెప్టెన్సీ వేటుకు కారణమైంది. ఆరు మ్యాచుల్లో 110.28 స్ట్రయిక్‌రేట్‌తో వార్నర్ పరుగులు చేశాడు. ఆరు మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన హైదరాబాద్.. తర్వాతి మ్యాచ్‌లో వార్నర్‌పై వేటు వేసింది.
అరుదైన తడబాటు : బ్యాట్స్‌మన్ ఫామ్‌లో ఉన్నప్పటికీ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడటం సహజం. డెవిడ్ వార్నర్ పరిస్థితి అందుకు భిన్నం. పరుగులు చేయటంలో ముందున్నా.. స్వేచ్ఛగా ఆడటంలో అసౌకర్యం కనిపించింది. చెన్నై పిచ్‌లపై వార్నర్ 34 బంతుల్లో 36, 37 బంతుల్లో 37, 8 బంతుల్లో 6 పరుగుల ఇన్నింగ్స్‌లు నమోదు చేశాడు. ఢిల్లీలోనూ వార్నర్ ప్రదర్శనలో మార్పు లేదు. చెన్నైపై 57 బంతుల్లో 55 పరుగులు చేశాడు. 172 పరుగుల లక్ష్యాన్ని ధోనీసేన 18.3 ఓవర్లలోనే ఛేదించింది. ఆ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకున్న వార్నర్.. తన ఇన్నింగ్స్ జట్టుకు కీడు చేసిందని అంగీకరించాడు. అంతిమంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ పగ్గాలు వార్నర్ వదులుకోవాల్సి వచ్చింది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 12వ ఆటగాడిగా డ్రింక్స్ అందిస్తూ జట్టును ఉత్సాహపరిచినా తుది ఫలితం మారలేదు. సన్‌రైజర్స్ ఆరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఊహించని మలుపులు. ఐపీఎల్ 2021 అర్థాంతరంగా వాయిదా పడింది. ఇప్పుడు సీజన్ వేదిక యుఏఈకి చేరుకుంది. నాలుగు నెలల విరామంలో డెవిడ్ వార్నర్ మైదానంలో కనిపించలేదు. వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనలకు దూరమైన వార్నర్.. తిరిగి ఐపీఎల్‌లోనే మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు.
గర్జిస్తాడా? : హైదరాబాద్ అభిమానులు డెవిడ్ వార్నర్ సొంతం చేసుకున్నారు. మిగతా ఐపీఎల్ జట్లకు భారత క్రికెటర్లు ముఖచిత్రంగా ఉండగా.. సన్‌రైజర్స్‌కు డెవిడ్ వార్నర్. అర్థ దశాబ్దానికి పైగా సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్‌కు జట్టులో ఆటగాడిగా ఆడటం కొత్త కాదు. 2019 సీజన్లో కెప్టెన్సీ లేకుండా జట్టులో ఉన్నాడు. సన్‌రైజర్స్‌కు ఆడిన ఆరు సీజన్లలో వరుసగా 500కి పైగా పరుగులు సాధించాడు. ఐపీఎల్లో ఇంత నిలకడగా మరో బ్యాట్స్‌మన్ రాణించలేదు. తాజా సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇప్పటికే ఆవిరయ్యాయి!. కానీ గత సీజన్లో ఆఖర్లో వరుసగా అగ్రజట్లపై విజయాలు సాధించిన సన్‌రైజర్స్ టాప్-4లో నిలిచింది. ఇప్పుడూ చివరి ఏడు మ్యాచుల్లో విజయాలు హైదరాబాద్‌ను టాప్-4లో నిలిపేందుకు అవకాశం మెండుగానే ఉంది. టీ20 ప్రపంచకప్‌కు ఐపీఎల్14 సన్నాహకంగా ఉండనుంది. అబుదాబి, షార్జా, దుబారు పిచ్‌లపైనే వరల్డ్‌కప్ జరుగనుంది. ఐపీఎల్లో దూకుడు అందుకుంటే వరల్డ్‌కప్‌లోనూ వార్నర్‌కు అది ఉపయుక్తం. ఈ డిసెంబర్లో ఐపీఎల్ మెగా ఆటగాళ్ల వేలం ఉండటంతో వార్నర్ పూర్వ దూకుడు సాధించటం అవశ్యం. సన్‌రైజర్స్‌కు వార్నర్ కెప్టెన్ కాదు. జట్టులో నాయకత్వం భిన్న రూపాల్లో ఉంటుంది. జట్టు నాయకత్వ బృందంలో వార్నర్ ఇప్పటికీ భాగమే. ఐపీఎల్ 14లో సన్‌రైజర్స్ వేటకు బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నాయకత్వం వహిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.