Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో వీవీఎస్ లక్ష్మణ్ సైతం!
- భారత చీఫ్ కోచ్ పదవిపై ఆసక్తి
భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌గా మరోసారి జెంటిల్మెన్ రానున్నాడా? దిగ్గజ క్రికెటర్‌కు దక్కాల్సిన వీడ్కోలు చీఫ్ కోచ్‌గా కుంబ్లేకు దక్కలేదని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. క్రికెట్ జెంటిల్మెన్, జంబో అనిల్ కుంబ్లే టీమ్ ఇండియా చీఫ్ కోచ్‌గా రావాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బలంగా కోరుతున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం చీఫ్ కోచ్ పదవి రేసులో ఉండే అవకాశం కనిపిస్తోంది!.
నవతెలంగాణ క్రీడావిభాగం
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ జట్లకు సింహస్వప్నం, అగ్రజట్టు టీమ్ ఇండియా. భవిష్యత్‌లోనూ ఆదాయం పరంగా, ఆట పరంగా అగ్రస్థానం, దూకుడు కొనసాగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చురుకైన ప్రణాళికలు రచిస్తోంది. అగ్ర జట్టుకు దీటైన సారథితో పాటు గొప్ప గురువు ఉండాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుత టీమ్ ఇండియా చీఫ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమ్ ఇండియా కొత్త కోచ్‌తో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో చీఫ్ కోచ్ పదవి భర్తీ చేయబోయేది ఎవరనే ఆసక్తి అభిమానుల్లో రెట్టింపు అవుతోంది. మరో దఫా చీఫ్ కోచ్‌గా కొనసాగేందుకు రవిశాస్త్రి విముఖత వ్యక్తం చేసే అవకాశం ఉండటంతో.. భారత్‌కు కొత్త కోచ్ రావటం అనివార్యమే.
అనిల్ కుంబ్లేకు చాన్స్ : భారత క్రికెట్ వర్గాలు, క్రికెట్ వీరాభిమానులు కోరుకుంటున్న కోచ్ అనిల్ కుంబ్లే. జెంటిల్మెన్గా ప్రపంచ దేశాల గౌరవం అందుకున్న కుంబ్లే.. కోచ్‌గా అంతకుమించి గౌరవం పొందాడు. 2016-17లో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను నియమించింది. కోచ్‌గా ఏడాది పాటు పని చేసిన కుంబ్లే.. జట్టును 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేర్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు తారాస్థాయికి చేరటంతో చీఫ్ కోచ్‌గా కొనసాగలేనని అనిల్ కుంబ్లే రాజీనామా సమర్పించాడు. అప్పట్లో అనిల్ కుంబ్లే నిష్క్రమణ భారత క్రికెట్లో ప్రకంపనలు సృష్టించింది. కుంబ్లే వైదొలిగిన తీరు పట్ల నిరసనగా పాలకుల కమిటీ (సీఓఏ) నుంచి ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సైతం తప్పుకున్న సంగతి తెలిసిందే. ' అనిల్ కుంబ్లే నిష్క్రమణ పర్వం సరిచేయాల్సిన అవసరం ఉంది. విరాట్ కోహ్లి ఒత్తిడికి తలొగ్గి పాలకుల కమిటీ అనిల్ కుంబ్లేను తొలగించటం మంచి సంప్రదాయానికి సూచిక కాదు. చీఫ్ కోచ్‌గా తిరిగి రావాలా? వద్దా? అనేది అనిల్ కుంబ్లే అభిష్టమే' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
సొగసరి ఆప్షన్ : హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్, మణికట్టు మాయగాడు వీవీఎస్ లక్ష్మణ్ పేరు సైతం చీఫ్ కోచ్ రేసులో వినిపిస్తోంది. అనిల్ కుంబ్లే తరహాలోనే క్రికెట్ జెంటిల్మెన్గా పేరు సంపాదించిన లక్ష్మణ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్‌లకు 100కు పైగా టెస్టులు ఆడారు. ప్రపంచ క్రికెట్లో విశేష అనుభవం గడించారు. ఈ ఇద్దరిలో ఒకరు కొత్త చీఫ్ కోచ్‌గా రావాలని బీసీసీఐ పెద్దలు కోరుకుంటున్నారు. చీఫ్ కోచ్ పదవి కోసం ఈ ఇద్దరినీ దరఖాస్తు చేయమని బీసీసీఐ ఉన్నతాధికారులు కోరే అవకాశం కనిపిస్తోంది. విదేశీ కోచ్‌పై బీసీసీఐ ఆసక్తి చూపటం లేదు. విరాట్ కోహ్లి టెస్టు, వన్డే కెప్టెన్‌గా కొనసాగనుండటంతో అనిల్ కుంబ్లే చీఫ్ కోచ్ పదవిపై విముఖత వ్యక్తం చేసినా.. వీవీఎస్ లక్ష్మణ్‌ను తీసుకొచ్చేందుకు బోర్డు ప్రయత్నించనుంది. ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ సైతం చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని యోచిస్తున్నా.. అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపించటం లేదు.