Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ కోచ్‌గా చిరకాలం ఉండను
- భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి
లండన్ : టీమ్ ఇండియా చీఫ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం రానున్న టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. చీఫ్ కోచ్‌గా తప్పుకోవాల్సి రావటం బాధగా ఉన్నా, ఈ స్థానంలో చిరకాలం ఉండలేనని శాస్త్రి వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే చీఫ్ కోచ్‌గా పదవీ కాలం ముగించనున్నట్టు పరోక్షంగా స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో నాల్గో టెస్టు సందర్భంగా కోవిడ్-19 బారిన పడిన రవిశాస్త్రి ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నారు. కోవిడ్-19 నుంచి కోలుకుని, స్వదేశీ ప్రయాణానికి అవసరమైన 'ఫిట్ టు ఫ్లై' దృవపత్రం కోసం ఎదురు చూస్తున్నారు. 2017లో చీఫ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. 2019లో తిరిగి నియమితులయ్యాడు. అంతకముందు భారత జట్టు టీమ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఓ పత్రికతో మాట్లాడిన రవిశాస్త్రి పలు విషయాలపై స్పందించాడు.
ఎక్కువే సాధించాను : 'నేను అనుకున్న ప్రతిదీ సాధించానని నా భావన. ఐదేండ్లు టెస్టు క్రికెట్ నం.1 జట్టుగా, ఆస్ట్రేలియాలో రెండు సార్లు టెస్టు సిరీస్ విజయాలు, ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ విజయం. నాలుగు దశాబ్దాల నా క్రికెట్ కెరీర్లో సంతృప్తికరం ఇదే. వైట్‌బాల్ ఫార్మాట్లోనూ ప్రతి దేశానీ వారి గడ్డపైనే ఓడించాం. టీ20 ప్రపంచకప్ గెలిస్తే, అది మరింత స్పెషల్. నేను ఓ విషయాన్ని బలంగా నమ్ముతాను. ఎక్కువ కాలం ఎక్కడా ఉండకూడదు. నేను అనుకున్న దాని కంటే ఎక్కువే సాధించాను. టీ20 ప్రపంచకప్ నెగ్గగల జట్టు మాకుంది. టెస్టు మ్యాచ్ ఒత్తిడి మరిచిపోండి. టీ20 అంటేనే ఆస్వాదించటం. ఫలితంతో సంబంధం లేకుండా, ప్రపంచకప్‌ను ఆస్వాదిస్తాం' అని శాస్త్రి అన్నాడు.
బుమ్రాస్త్రం : ' జశ్‌ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్ ఆడతాడని ఎవరూ అనుకోలేదు. అతడు వైట్‌బాల్ పేసర్. చీఫ్ కోచ్‌గా నేను బాధ్యతలు అందుకున్న తర్వాత.. 'విదేశీ టెస్టులో 20 వికెట్లు పడగొట్టడం ఎలా? అని ప్రశ్నించుకున్నాను. అందుకు నాకు నలుగురు గొప్ప ఫాస్ట్ బౌలర్లు అవసరమని తెలుసు. దక్షిణాఫ్రికాలో 2018 సిరీస్‌లో అది మొదలైంది. 1-2తో ఆ సిరీస్ కోల్పోయినా.. కేప్‌టౌన్ టెస్టులో బుమ్రాస్త్రాన్ని ప్రయోగించాలని అనుకున్నాను. కొన్ని నెలలకు ముందే నా ఆలోచన కెప్టెన్ విరాట్‌తో పంచుకున్నాను. బుమ్రాను స్వదేశీ టెస్టులో బరిలోకి దింపవద్దు. కేప్‌టౌన్‌కు ముందు అతడిని టెస్టుల్లో చూడాలని అనుకోవటం లేదని సెలక్టర్లతో చెప్పాను. 24 టెస్టుల్లోనే బుమ్రా 101 వికెట్లు పడగొట్టాడు. అద్వితీయ ప్రదర్శనతో దూసుకుపోతున్నాడని' రవిశాస్త్రి తెలిపాడు.