Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ ఓపెనర్ అజేయ అర్థ సెంచరీ
- డుప్లెసిస్, రైనా, ధోని విఫలం
- ముంబయిపై చెన్నై సూపర్‌కింగ్స్ 156/6
నవతెలంగాణ-దుబాయ్
కొత్త బంతితో ట్రెంట్ బౌల్ట్, ఆడం మిల్నె నిప్పులు చెరిగిన వేళ. పవర్ ప్లే (ఆరు ఓవర్లు) ముగిసే సమయానికి చెన్నై సూపర్‌కింగ్స్ 24/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. స్టార్ బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్ (0), మోయిన్ అలీ (0), అంబటి రాయుడు (0), సురేశ్ రైనా (4), ఎం.ఎస్ ధోని (3)లు కలిసి ఏడు పరుగులే చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో మరో ఎండ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు రుతురాజ్ గైక్వాడ్ (88 నాటౌట్). 58 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ కెరీర్లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. రవీంద్ర జడేజా (26, 33 బంతుల్లో 1 ఫోర్), డ్వేన్ బ్రావో (23, 8 బంతుల్లో 3 సిక్స్‌లు) మెరుపులతో చెన్నై సూపర్‌కింగ్స్ తొలుత నిర్ణీత ఓవర్లలో 156/6 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేసింది.
టాప్ లేచింది : ఐపీఎల్ 14 సీజన్ పున ప్రారంభ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సూపర్‌కింగ్స్‌కు ముంబయి పేసర్లు చుక్కలు చూపించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి ఆ జట్టు బ్యాటింగ్‌లో పవర్ లేకుండా చేశారు. డుప్లెసిస్ (0), సురేశ్ రైనా (4)లను ట్రెంట్ బౌల్ట్ సాగనంపగా.. మోయిన్ అలీ (0), ఎం.ఎస్ ధోని (3) కథ ఆడం మిల్నె ముగించాడు. అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్‌గా నిష్క్రమించటంతో చెన్నై నిజానికి పవర్ ప్లేలో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది.
గైక్వాడ్ మెరుపుల్ : 24/4తో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న రుతురాజ్ గైక్వాడ్ 156/6తో మెరుగైన స్థితిలో నిలిపాడు. అజేయ అర్థ శతక ఇన్నింగ్స్‌తో ముంబయిపై మెరుపు ఇన్నింగ్స్ నమోదు చేశాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. మరో ఎండ్ నుంచి రవీంద్ర జడేజా చక్కటి సహకారం అందించాడు. సమయోచితంగా ఆడిన జడేజా స్లాగ్ ఓవర్లలో స్కోరు వేగం పెంచే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు. డ్వేన్ బ్రావో (23) క్రీజులోకి వచ్చీ రాగానే సీపీఎల్ ఫామ్ కొనసాగించాడు. మిల్నె ఓవర్ ఆఖరు బంతికి సిక్సర్ బాదిన బ్రావో.. తర్వాత బౌల్ట్ ఓవర్లో ఎదుర్కొన్న తొలి రెండు బంతులను స్టాండ్స్‌లోకి పంపించి హ్యాట్రిక్ సిక్సర్లు నమోదు చేశాడు. బౌల్ట్ వేసిన ఓవర్లో గైక్వాడ్ సైతం ఓ సిక్సర్, ఫోర్ బాదటంతో ఆ ఓవర్లో చెన్నై 24 పరుగులు పిండుకుంది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఆఖరు ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాదిన గైక్వాడ్ అజేయ ఇన్నింగ్స్‌ను అద్బుతంగా ముగించాడు. ముంబయి బౌలర్లలో సీమర్లు బౌల్ట్, మిల్నె, బుమ్రాలు రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. స్పిన్నర్లు రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యలకు వికెట్లు దక్కలేదు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ నాటౌట్ 88, డుప్లెసిస్ (సి) తివారీ (బి) మిల్నె 0, అంబటి రాయుడు (రిటైర్డ్ హర్ట్) 0, సురేష్ రైనా (సి) చాహర్ (బి) బౌల్ట్ 4, ఎం.ఎస్ ధోని (సి) బౌల్ట్ (బి) మిల్నె 3, రవీంద్ర జడేజా (సి) పొలార్డ్ (బి) బుమ్రా 26, డ్వేన్ బ్రావో (సి) పాండ్య (బి) బుమ్రా 23, శార్దుల్ ఠాకూర్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156.
వికెట్ల పతనం : 1-1, 2-2, 2-3, 3-7, 4-24, 5-105, 6-144.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-1-35-2, ఆడం మిల్నె 4-0-21-2, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-33-2, కీరన్ పొలార్డ్ 2-0-15-0, రాహుల్ చాహర్ 4-0-22-0, కృనాల్ పాండ్య 2-0-27-0.