Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్కతతో బెంగళూర్ ఢ నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-అబుదాబి : సీజన్ ఆరంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ వరుసగా రెండు మ్యాచులకు మించి విజయాలు సాధించిన దాఖలాలు లేవు. 2021 ఐపీఎల్లో కోహ్లిసేన ఈ రికార్డును కనుమరుగు చేసింది. సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచుల్లో దుమ్మురేపే ప్రదర్శన చేసింది. జట్టులోని అందరూ విజయంలో బాధ్యత తీసుకోవటంతో బెంగళూర్ టైటిల్ రేసులో ఫేవరేట్‌గా కనిపించింది. సీజన్ విరామంలో బెంగళూర్ ఐదుగురు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్, ఆడం జంపా, డానియల్ శామ్స్, ఫిన్ అలెన్, కేన్ రిచర్డ్సన్ ద్వితీయార్థంలో ఆడటం లేదు. వాహిందు హసరంగ, టిమ్ డెవిడ్, దుష్మంత చమీరా, జార్జ్ గార్టెన్లు కొత్తగా బెంగళూర్ శిబిరంలోకి అడుగుపెట్టారు. ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పది పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. మరోవైపు ఏడు మ్యాచుల్లో ఐదు అపజయాలతో కోల్‌కత నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ద్వితీయార్థం లో ఈ రెండు జట్లు నేడు ముఖాముఖికి సిద్ధమవుతున్నాయి. ప్రథమార్థం జోరు కొనసాగించేందుకు కోహ్లిసేన చూస్తుండగా.. ద్వితీయార్థంలోనైనా జోరు చూపించాలని మోర్గాన్‌సేన భావిస్తోంది. అబుదాబిలో నేడు ఈ రెండు జట్లు పోటీపడనున్నాయి.
విరాట్ కోహ్లి '200' : ఐపీఎల్లో విరాట్ కోహ్లి 200వ మ్యాచ్‌కు రెఢ అవుతున్నాడు. నేడు కోల్కతతో మ్యాచ్ ఆర్సీబీ కెప్టెన్‌కు 200వ మ్యాచ్ కానుంది. ఎం.ఎస్ ధోని, దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ, సురేశ్ రైనాలు ఐపీఎల్లో 200 మ్యాచులు ఆడిన జాబితాలో ఉండగా.. విరాట్ ఒక్కడే ఒకే ప్రాంఛైజీ తరఫున 200 మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. టీ20 ఫార్మాట్లో 10000 పరుగుల మైలురాయికి కోహ్లి మరో 71 పరుగుల దూరంలో ఉన్నాడు. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, షోయబ్ మాలిక్, డెవిడ్ వార్నర్‌లు మాత్రమే ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు.
బెంగళూర్ విజయాల్లో ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్ ముఖ్య పాత్ర పోషించారు. యుఏఈలోనూ ఈ ఇద్దరి నుంచి కోహ్లి అదే తరహా ప్రదర్శన ఆశిస్తున్నాడు. శ్రీలంక స్పిన్నర్ వాహిందు హసరంగ తుది జట్టులో నిలువనున్నాడు. కోల్‌కత శిబిరంలో విదేశీ కోటాలో కెప్టెన్ మోర్గాన్, అండ్రీ రసెల్, లాకీ ఫెర్గుసన్తో పాటు సునీల్ నరైన్ నిలువనున్నాడు. బంగ్లా ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ రేసులో ఉన్నా, సీపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సునీల్ నరైన్‌ను విస్మరించటం సులువు కాదు. బెంగళూర్‌పై రసెల్‌కు, కోల్‌కతపై డివిలియర్స్‌కు సిక్సర్ల బాదుడులో మంచి రికార్డుంది. 2019 నుంచి బెంగళూర్‌పై అత్యధిక సిక్సర్లు (19) బాదిన బ్యాట్స్‌మన్‌గా రసెల్ నిలువగా.. అదే సమయంలో కోల్‌కతపై అత్యధిక సిక్సర్లు (13) రికార్డు డివిలియర్స్ పేరిట ఉంది. దీంతో నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరి ధనాధన్ ప్రదర్శన ఆశించవచ్చు.
తుది జట్లు (అంచనా) :
బెంగళూర్ : విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, కైల్ జెమీసన్, వాహిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వెంద్ర చాహల్.
కోల్‌కత : నితీశ్ రానా, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అండ్రీ రసెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గుసన్, కమలేశ్ నాగర్కోటి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ.