Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్లు మ్యాచ్‌కు రూ.60వేలు
- మహిళా క్రికెటర్లకు రూ.20వేలు : బిసిసిఐ
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెటర్ల జీతాలను భారీగా పెంచుతూ భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) నిర్ణయం తీసుకుంది. జాతీయ క్రికెటర్ల ఫీజుల పెంపును బిసిసిఐ సెక్రటరీ జై షా సోమవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. 40మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు రూ.60వేలు, అండర్-23 క్రికెటర్లు రూ.25వేలు, అండర్-19 ఆటగాళ్లకు రూ.20వేలు చొప్పున మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు తెలిపారు. నేడు జరిగిన వర్చ్యువల్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహిళా క్రికెటర్లకు కూడా బోర్డు పారితోషికాన్ని వెల్లడించింది. సీనియర్ క్రికెటర్లకు మ్యాచ్‌కు రూ.12,500కు బదులుగా రూ.20వేలు ఇకపై చెల్లించనున్నట్లు వెల్లడించింది. అలాగే కరోనా కారణంగా కోల్పోయిన గత సీజన్‌కు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50శాతం పరిహారం కింద ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 2019-20 దేశవాళీ సీజన్లో పాల్గొన్న క్రికెటర్లకు 2020-21 సీజన్‌కు గానూ ఈ పరిహారం అందనున్నట్లు చెప్పారు. బిసిసిఐ ఇప్పటివరకు సీనియర్ దేశీయ క్రికెటర్లు రంజీ లేదా విజరు హజారే ట్రోఫీలు ఆడితే మ్యాచ్‌కు రూ.35వేల చొప్పున, ముస్తక్ అలీ ట్రోఫీకి గేమ్‌కు రూ.17,500చొప్పున అందజేస్తోంది. ఇటీవల బిసిసిఐ అజారుద్దీన్, జయదేవ్ షా, అవిషేక్ ధాల్మియా, దేవజిత్ సైకియా, సంతోష్ మీనన్, యద్వీర్ సింగ్, రోహన్ జైట్లీలతో కూడిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ దేశీయ ఆటగాళ్ల జీతాలు 50% పెంపుకు ప్రతిపాదించింది. ఈ ఏడాది అక్టోబరు 20 నుంచి ముస్తఖ్ అలీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబరు 16, 2021 నుంచి ఫిబ్రవరి 19, 2022 రంజీ ట్రోఫీ, ఫిబ్రవరి 23, 2022 నుంచి మార్చి 26, 2022 వరకు విజరు హజారే ట్రోఫీ జరగనుంది.