Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ పేసర్ ఐదు వికెట్ల ప్రదర్శన
- రాణించిన యశస్వి, మహిపాల్
- రాజస్థాన్ రాయల్స్ 185/10
నవతెలంగాణ-దుబాయ్
పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ (5/32) అదరగొట్టాడు. యశస్వి జైస్వాల్ (49, 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహిపాల్ లామోర్ (43, 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఎవిన్ లూయిస్ (36, 21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ దంచుడుతో రాజస్థాన్ రాయల్స్ ఓ దశలో 210కి పైగా పరుగులు చేసేలా కనిపించింది. చివరి 36 బంతుల్లో ఏకంగా ఏడు వికెట్లు నేలకూల్చిన పంజాబ్ కింగ్స్ కేవలం 49 పరుగులే ఇచ్చింది. డెత్ ఓవర్లలో అద్వితీయ ప్రదర్శనతో రాణించిన పంజాబ్ బౌలర్లు రాజస్థాన్‌ను భారీ స్కోరు సాధించకుండా నిలువరించారు. అర్షదీప్ సింగ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో కదం తొక్కగా.. స్టార్ పేసర్ మహ్మద్ షమి (2/21), హర్‌ప్రీత్ బరార్ (1/17)లు బ్యాట్స్‌మెన్‌ను గొప్పగా కట్టడి చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 185 పరుగులకు కుప్పకూలింది.
ఆరంభంలో దూకుడు : తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. ఎవిన్ లూయిస్ (36) ధనాధన్ జోరు చూపించాడు. ఇషాన్ పోరెల్ వేసిన ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లో ఏకంగా నాలుగు బౌండరీలు బాదిన లూయిస్ ఆ ఓవర్లో 17 పరుగులు పిండుకున్నాడు. దీంతో 4 ఓవర్లలో రాయల్స్ 40 పరుగులు సాధించింది. 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగిన లూయిస్ నిష్క్రమించినా పవర్‌ప్లేలో రాయల్స్ 57/1తో పటిష్టంగా కనిపించింది. కెప్టెన్ సంజు శాంసన్ (4) విఫలమైనా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (49)తో కలిసి మహిపాల్ లామోర్ (43) పంజాబ్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన మహిపాల్ 17 బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వికెట్ కోల్పోయాడు. యశస్వి, మహిపాల్ నిష్క్రమణతో రాయల్స్ లయ కోల్పోయింది. రియాన్ పరాగ్ (4), రాహుల్ తెవాటియ (2), క్రిస్ మోరీస్ (5), చేతన్ సకరియ (7), కార్తీక్ త్యాగి (1)లు ధనాధన్ ఆడలేకపోయారు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది.