Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి వన్డేలో భారత్ పరాజయం
- 9 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపు
ఆస్ట్రేలియా పర్యటనను అమ్మాయిలు ఓటమితో ఆరంభించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లోపాలను నిలకడగా కొనసాగించిన మిథాలీసేన బలమైన ఆస్ట్రేలియా చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకుంది. తొలుత భారత్‌ను 225/8 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా అమ్మాయిలు.. టాప్-3 బ్యాటర్లు అర్థ శతకాలతో కదం తొక్కటంతో చెమట పట్టకుండా ఛేదన పూర్తి చేసింది. వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యం ఆసీస్ వశమైంది.
మాకారు (క్వీన్స్లాండ్)
టీమ్ ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. బలమైన ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని 41 ఓవర్లలోనే ఊదేసిన ఆస్ట్రేలియా వరుసగా 25వ వన్డే విజయాన్ని నమోదు చేసింది. 2017, అక్టోబర్‌లో చివరగా ఓ వన్డేలో ఓడిన ఆస్ట్రేలియా.. విజయోత్సాహం భారత్‌పైనా చూపిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 225/8 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీరాజ్ (63, 107 బంతుల్లో 3 ఫోర్లు) అర్థ సెంచరీతో మెరిసింది. ఛేదనలో ఆస్ట్రేలియా టాప్-3 బ్యాటర్లు అర్థ సెంచరీలు బాదారు. రేచల్ (93 నాటౌట్, 100 బంతుల్లో 7 ఫోర్లు), అలిసా హీలీ (77, 77 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెగ్ లానింగ్ (53 నాటౌట్, 69 బంతుల్లో 7 ఫోర్లు) ధనాధన్ షోతో అదరగొట్టారు. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ పేసర్ డార్సీ బ్రౌన్ (4/33) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది. భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల వన్డే సిరీస్ మంగళవారం తొలి వన్డేతో ఆరంభమైంది. సిరీస్‌లో రెండో వన్డే శుక్రవారం ఇదే వేదికలో జరుగనుంది.
పస లేని బౌలింగ్
226 పరుగుల లక్ష్యం ఆస్ట్రేలియా అమ్మాయిల ముందు చిన్నబోయింది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి ఓ ఎండ్‌లో ఒత్తిడి పెంచినా.. మరో ఎండ్‌లో సహకారం కొరవడింది. తొలి 8 ఓవర్లలో 30 పరుగులే చేసిన ఓపెనర్లు.. ఆ తర్వాత గేర్ మార్చారు. రేచల్ (93 నాటౌట్), హీలీ (77) తొలి వికెట్‌కు 126 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో మెరిసిన హీలీ భారత బౌలర్లపై దండెత్తింది. ఏడు ఫోర్లతో అజేయంగా 93 పరుగులు చేసిన రేచల్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. హీలీ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ (53 నాటౌట్) రేచల్తో కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 101 పరుగులు జోడించింది. ఈ ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేయటంతో భారత బౌలర్ల వికెట్ ప్రయత్నాలు ఫలించలేదు. మరో 54 బంతులు ఉండగానే ఆస్ట్రేలియా గెలుపు గీత దాటేసింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
బ్యాటర్లు విఫలం
టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు పిలిచింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (8, 10 బంతుల్లో 2 ఫోర్లు), స్మృతీ మంధాన (16, 18 బంతుల్లో 1 ఫోర్) ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించే ప్రయత్నం చేశారు. షెఫాలీ రెండు బౌండరీలు బాదగా.. మంధాన ఓ ఫోర్ కొట్టింది. ఆసీస్ సీమర్ బ్రౌన్ ఓపెనర్లు ఇద్దరినీ వరుస ఓవర్లలో వెనక్కి పంపించింది. భాటియా (35, 51 బంతుల్లో 2 ఫోర్లు), మిథాలీ రాజ్ (63)లు మూడో వికెట్‌కు 77 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వికెట్ల పతనం నిలువరించినా.. నెమ్మదిగా పరుగులు చేయటం ప్రతికూల ప్రభావం చూపించింది. మిథాలీరాజ్ వరుసగా ఐదో అర్థ సెంచరీ సహా కెరీర్ 59వ అర్థ శతకం ఖాతాలో వేసుకుంది. దీప్తి శర్మ (9), పూజ (17)లకు తోడు ఆఖర్లో రిచా ఘోష్ (32 నాటౌట్, 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), జులన్ గోస్వామి (20, 24 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మెరువటంతో భారత్ 226 పరుగుల గౌరవప్రద స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ (4/33) నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరువగా.. సోఫీ (2/39), హన్నా (2/29) రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు :
భారత మహిళలు : 225/8 (మిథాలీరాజ్ 63, భాటియా 35, రిచా ఘోష్ 32, డార్సీ బ్రౌన్ 4/33)
ఆస్ట్రేలియా మహిళలు : 227/1 (రేచల్ హేన్స్ 93, అలిసా హీలీ 77, మెగ్ లానింగ్ 53, పూనమ్ 1/58)