Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి, కోల్‌కత ఢీ నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-అబుదాబి
ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలు, నాలుగు అపజయాలు.. ఇదీ ముంబయి ఇండియన్స్ రికార్డు. ఎనిమిది మ్యాచుల్లో మూడు విజయాలు, ఐదు అపజయాలు సాధించిన కోల్‌కత నైట్‌రైడర్స్‌తో కలిసి రోహిత్‌సేన పాయింట్ల పట్టికలో ఆశావహ స్థానాల్లో ఉన్నాయి. యుఏఈలో తొలి మ్యాచ్‌లో ముంబయి ఓటమి చూడగా.. కోల్‌కత తిరుగులేని విజయం సాధించింది. కానీ ముంబయిపై నైట్‌రైడర్స్ రికార్డు మరీ చెత్తగా ఉంది. ఐపీఎల్లో గత 13 మ్యాచుల్లో కోల్‌కతపై ముంబయి ఏకంగా 12 సార్లు విజయం సాధించింది. ఇప్పుడూ అదే జోరు చూపించాలని చూస్తోంది. ముంబయిపై చెత్త రికార్డు నుంచి గట్టెక్కేందుకు కోల్‌కత.. ఓటమి బాట నుంచి గట్టెక్కేందుకు ముంబయి కన్నేశాయి. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు నేడు బరిలోకి దిగుతున్నాయి.
ఫిట్నెస్ కారణంగా చెన్నైతో మ్యాచ్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య దూరంగా ఉన్నారు. ఇద్దరు స్టార్ క్రికెటర్లు లేకుండా ఆడటం అంత సులువు కాదు. రోహిత్ శర్మ నేడు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా.. హార్దిక్ పాండ్య విషయంలో స్పష్టత కనిపించటం లేదు. బ్యాటింగ్ లైనప్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి రావాలని ముంబయి కోరుకుంటోంది. మరోవైపు బెంగళూర్ పది ఓవర్లోనే ఎదురులేని విజయం సాధించిన కోల్‌కత నైట్‌రైడర్స్ అదే జోరు ముంబయిపై చూపించాలని అనుకుంటోంది. ముంబయి బ్యాటింగ్ లైనప్ ఫామ్‌లో లేకపోవటం నైట్‌రైడర్స్‌కు కలిసొచ్చే అంశం. కోల్‌కత యువ బ్యాట్స్‌మెన్ వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, నితీశ్ రానాల ప్రదర్శనపై కోల్‌కత మంచి అంచనాలు పెట్టుకుంది.
తుది జట్లు (అంచనా) :
కోల్‌కత నైట్‌రైడర్స్ : శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రానా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అండ్రీ రసెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గుసన్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.
ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, సౌరభ్ తివారి, కృనాల్ పాండ్య, ఆడం మిల్నె, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జశ్‌ప్రీత్ బుమ్రా.