Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్‌రైజర్స్‌కు ఏడో పరాజయం
- హైదరాబాద్‌పై ఢిల్లీ ఘన విజయం
నవతెలంగాణ-దుబాయ్
విరామం సన్‌రైజర్స్ ప్రదర్శనలో మార్పు తీసుకు రాలేకపోయింది. ప్రథమార్థంలో ఆరు పరాజయాలు చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ద్వితీయార్థంలోనూ అదే బాటలో నడుస్తోంది!. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సమిష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది. 135 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మరో 13 బంతులు ఉండగానే ఛేదించింది. శ్రేయష్ అయ్యర్ (47 నాటౌట్, 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (42, 37 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (35 నాటౌట్, 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆడుతూ పాడుతూ లాంఛనం ముగించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 134/9 పరుగులు చేసింది. డెవిడ్ వార్నర్ (0), కేదార్ జాదవ్ (3) విఫలమయ్యారు. సాహా (18), విలియమ్సన్ (18), మనీశ్ పాండే (17) వేగంగా ఆడలేకపోయారు అబ్దుల్ సమద్ (28, 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), టెయిలెండర్ రషీద్ ఖాన్ (22, 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. ఢిల్లీ పేసర్ కగిసో రబాడ (3/37), స్పిన్నర్ అక్షర్ పటేల్ (2/21), ఎన్రిచ్ నోర్ట్జె (2/12) రాణించారు.
అయ్యర్ అదుర్స్ : స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. శిఖర్ ధావన్ (42, 37 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) భీకర ఫామ్ కొనసాగించగా.. గాయం నుంచి కోలుకున్న శ్రేయష్ అయ్యర్ (47 నాటౌట్) అదిరే ఇన్నింగ్స్ ఆడాడు. పృథ్వీ షా (11) ఆరంభంలోనే నిష్క్రమించినా.. అయ్యర్‌తో కలిసి ధావన్ 52 పరుగులు జోడించాడు. సమయోచిత ఇన్నింగ్స్‌తో మెరిసిన అయ్యర్ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (35 నాటౌట్) ఐపీఎల్లో తిరిగి లయ అందుకున్నాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో పంత్ ధనాధన్ షో చూపించాడు. ధావన్, అయ్యర్, పంత్ జోరుతో 17.5 ఓవర్లలోనే ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్లో ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.
వార్నర్ విఫలం : టాస్ నెగ్గిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లోనే వికెట్ పారేసుకున్న డెవిడ్ వార్నర్ (0) హైదరాబాద్ ఆనందాన్ని ఆరంభంలోనే ఆవిరి చేశాడు. స్టార్ బ్యాట్స్‌మన్ నిష్క్రమణతో బ్యాటింగ్ లైనప్ దూకుడుగా ఆడలేకపోయింది. నోర్ట్జె ఓవర్లో వార్నర్ పాయింట్లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. మరో ఓపెనర్ వృద్దిమాన్ సాహా (18, 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18, 26 బంతుల్లో 1 ఫోర్) దూకుడుగా ఆడలేకపోయారు. కేన్ విలియమ్సన్ టచ్‌లో కనిపించినా.. బౌండరీలు రాబట్టలేదు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన సాహా వికెట్ కాపాడుకోలేదు. మనీశ్ పాండే (17, 16 బంతుల్లో 1 ఫోర్), కేదార్ జాదవ్ (3, 8 బంతుల్లో) అంచనాలను అందుకోలేదు. అబ్దుల్ సమద్ (28), రషీద్ ఖాన్ (22) ధనాధన్ ఇన్నింగ్స్‌లు హైదరాబాద్‌కు గౌరవప్రద స్కోరు అందించాయి.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ : 134/9 (అబ్దుల్ సమద్ 28, రషీద్ ఖాన్ 22, రబాడ 3/37, ఎన్రిచ్ 2/12)
ఢిల్లీ క్యాపిటల్స్ : 139/2 (అయ్యర్ 47, ధావన్ 42, పంత్ 35, రషీద్ ఖాన్ 1/26)