Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్‌తో ఢీ నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-దుబాయ్
ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచుల ఫలితాలు, పాయింట్ల పట్టికలో స్థానాల పరంగా చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్లు సమవుజ్జీలు. ద్వితీయార్థంలో ఓ రౌండ్ మ్యాచులు ముగిసిన తర్వాత.. చెన్నై, బెంగళూర్ మధ్య ఎంతో అగాధం ఏర్పడింది!. దారుణ ఓటమి తప్పదేనుకున్న మ్యాచ్‌లో ముంబయిని సూపర్‌కింగ్స్ చిత్తుగా ఓడించగా... నైట్‌రైడర్స్ చేతిలో బెంగళూర్ అత్యంత దారుణ పరాజయం చవిచూసింది. ఐదుసార్లు చాంపియన్‌పై విజయంతో చెన్నై జోరు మీదుండగా.. భారీ ఓటమితో బెంగళూర్ స్థైర్యం కాస్త చెదిరింది. ఈ రెండు జట్లు నేడు ముఖాముఖికి సిద్ధమయ్యాయి.
మహీ దంచేనా?! : చెన్నై సూపర్‌కింగ్స్‌కు లోతైన బ్యాటింగ్ బలం ఉంది. 11వ బ్యాట్స్‌మన్ వరకు పరుగుల వరద పారించగల సత్తా చెన్నైకి ఉంది. అందుకే ఎం.ఎస్ ధోని బ్యాటింగ్ ఆర్డర్లో టెయిలెండర్లతో పాటు వస్తున్నాడు. కెరీర్ చివరి దశలో ధోని నుంచి అభిమానులు ధనాధన్ దూకుడు ఆశిస్తున్నారు. జట్టులో చివరి వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండటంతో.. మహి కాస్త ముందుగా క్రీజులోకి రావాలనే అంచనాలు ఎక్కువవుతున్నాయి. ముంబయిపై ధోని పవర్‌ప్లేలోనే బ్యాట్ పట్టినా.. అభిమానులను నిరాశపరిచాడు. బ్యాట్స్‌మన్ ధోని నుంచి అభిమానులను సంతృప్తిపరిచే ఇన్నింగ్స్ వస్తుందేమో చూడాలి. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కరణ్ కోసం డుప్లెసిస్ బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశం ఉంది. డ్వేన్ బ్రావో ఫామ్‌లో ఉండటంతో కరణ్‌తో పాటు అతడు తుది జట్టులో నిలువనున్నాడు. విదేశీ ఆటగాళ్ల కోటాలో మోయిన్ అలీ, కరణ్, బ్రావో, హజిల్వుడ్లు ఆడనున్నారు. ముంబయితో మ్యాచ్‌లో గాయపడిన అంబటి రాయుడు విశ్రాంతి పొందితే రాబిన్ ఉతప్ప ఓపెనర్‌గా రానున్నాడు. సురేశ్ రైనా నుంచి జట్టు మేనేజ్మెంట్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ కోరుకుంటోంది.
పుంజుకుంటారా? : ప్రథమార్థంలో చెన్నైపై బెంగళూర్ గెలుపొందినా.. ఈ మ్యాచ్‌లో కోహ్లిసేన అండర్‌డాగ్‌గానే ఆడుతోంది. కోల్‌కత చేతిలో బెంగళూర్ బ్యాట్స్‌మెన్ చిత్తయ్యారు. చెన్నైపై బ్యాటింగ్ లైనప్ గాడిలో పడితే బెంగళూర్‌కు అదే సంతోషం. ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్ మెరుపులతోనే ప్రథమార్థంలో బెంగళూర్ వరుస విజయాలు సాధించింది. ఇప్పుడూ ఆ జట్టు భవితవ్యం ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంది. డివిలియర్స్, మాక్స్‌వెల్‌కు తోడు విరాట్ కోహ్లి రాణిస్తే బెంగళూర్ కథ సాఫీగా సాగే అవకాశం ఉంది. ఒత్తిడిలో సూపర్‌కింగ్స్‌ను ఎదుర్కోవటం అంత సులువు కాదు. దీంతో ఈ మ్యాచ్ కోహ్లిసేనకు కఠిన పరీక్షగా నిలువనుంది.
తుది జట్లు (అంచనా) :
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎం.ఎస్ ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, శామ్ కరణ్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోశ్ హజిల్‌వుడ్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కె.ఎస్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, సచిన్ బేబి, కైల్ జెమీసన్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వెంద్ర చాహల్.