Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో రాహుల్ త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్
- వెంకటేష్ అయ్యర్ ధనాధన్ అర్థ సెంచరీ
- ముంబయిపై కోల్‌కత ఘన విజయం
నవతెలంగాణ-అబుదాబి
యుఏఈలో కోల్‌కతకు రెండో విజయం. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌పై కోల్‌కత నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల ఊరించే లక్ష్యాన్ని అలవోకగా ఊదేసింది. యువ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (55, 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్, 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. అయ్యర్, త్రిపాఠి రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించటంతో కోల్‌కత గెలుపు లాంఛనం చేసుకుంది. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగిన అయ్యర్ 25 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో త్రిపాఠి 29 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేశాడు. ఇయాన్ మోర్గాన్ (7) వికెట్ కోల్పోయినా..మరో 29 బంతులు ఉండగానే కోల్‌కత లాంఛనం ముగించింది. సీజన్లో నాల్గో విజయంతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి ఎగబాకింది. యుఏఈలో ముంబయికి ఇది వరుసగా రెండో ఓటమి. అంతకముందు,80/1తో పటిష్టంగా కనిపించిన ముంబయి ఇండియన్స్ చివరి పది ఓవర్లలో 75 పరుగులే చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (55, 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (33, 30 బంతుల్లో 4 ఫోర్లు) రాణించినా ఆ జట్టు 155 పరుగుల స్వల్ప స్కోరుకు పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14), కీరన్ పొలార్డ్ (21), కృనాల్ పాండ్య (12) విఫలమయ్యారు. కోల్‌కత పేసర్లు లాకీ ఫెర్గుసన్ (2/27), ప్రసిద్ కృష్ణ (2/43)లు రాణించారు.
ముంబయికి ముకుతాడు : టాస్ గెల్చుకున్న కోల్‌కత తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నైతో మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ.. కోల్‌కతపై డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 78 పరుగుల భారీ స్కోరు అందించారు. రోహిత్ శర్మ (33, 30 బంతుల్లో 4 ఫోర్లు), క్వింటన్ డికాక్ (55, 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. ఆరంభంలోనే స్పిన్నర్లను ప్రయోగించిన మోర్గాన్.. ముంబయిని వేగంగా పరుగులు చేయనివ్వలేదు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో డికాక్ 35 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత డికాక్‌కు పెద్దగా స్ట్రయిక్ అవకాశం లభించలేదు. రోహిత్ శర్మ అవుట్ కాగానే.. సూర్యకుమార్ యాదవ్ (5) సైతం వికెట్ కోల్పోయాడు. ఇషాన్ కిషన్ (14) పేలవ ఫామ్ కొనసాగించాడు. కీరన్ పొలార్డ్ (21, 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)పై ముంబయి ఆశలు పెట్టుకున్నా.. ఆఖరు ఓవర్ తొలి బంతిని మోర్గాన్ అతడిని రనౌట్ చేశాడు. కృనాల్ పాండ్య (12) నిరాశ పరిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి ఇండియన్స్ 155/6 పరుగులు చేసింది. ఓపెనర్ల మెరుపులతో 9 ఓవర్లలో 78/0తో భారీ స్కోరు దిశగా సాగిన ముంబయి ఇండియన్స్.. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో 155 పరుగుల స్వల్ప స్కోరుకు పరిమితమైంది. కోల్‌కత నైట్‌రైడర్స్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ (2/43), లాకీ ఫెర్గుసన్ (2/27) రాణించారు. సునీల్ నరైన్ (1/20) బ్యాట్స్‌మెన్ ఒత్తిడి పెంచటంలో సఫలమయ్యాడు.
రోహిత్ వెయ్యి కొట్టాడు! : ఐపీఎల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. ఓ జట్టుపై వెయ్యి పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో (2008-2021) కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 29 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ 48.33 సగటుతో 1015 పరుగులు కొట్టాడు. ఇందులో 109 పరుగుల అజేయ శతకం సహా ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి.
స్కోరు వివరాలు :
ముంబయి ఇండియన్స్ : 155/6 (క్వింటన్ డికాక్ 55, రోహిత్ శర్మ 33, లాకీ ఫెర్గుసన్ 2/27, ప్రసిద్ కృష్ణ 2/43)
కోల్‌కత నైట్‌రైడర్స్ :159/3 (రాహుల్ త్రిపాఠి 74, వెంకటేష్ అయ్యర్ 53, జశ్‌ప్రీత్ బుమ్రా 3/43)