Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ మ్యాచ్‌లో అమ్మాయిల ఓటమి
- ఆఖరు బంతికి ఆసీస్ మెరుపు విజయం
- 2-0తో సిరీస్ ఆసీస్ వశం
ఆసీస్ విజయానికి చివరి బంతికి 3 పరుగులు అవసరం. క్రీజులో అజేయ శతక బ్యాటర్ బెత్ మూనీ. భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి చేతిలో బంతి. గోస్వామి బంతిని మూనీ మిడ్ వికెట్ మీదుగా బాదగా క్యాచౌట్. భారత శిబిరంలో విజయోత్సాహం. ఇంతలో బంతిని నో బాల్ ప్రకటిస్తూ అంపైర్ నిర్ణయం. చివరి బంతికి రెండు పరుగులు తీసిన మూనీ.. భారత ఆశలపై నీళ్లు చల్లింది. ఆస్ట్రేలియా అజేయ రికార్డును కొనసాగించింది. రెండో వన్డేలో ఆసీస్ మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు పోరాడిన భారత్.. అనూహ్య పరాజయం చవిచూసింది.
నవతెలంగాణ-మకారు
బ్యాటర్లు ఫామ్‌లోకి వచ్చారు. 274 పరుగుల భారీ స్కోరు అందించారు. బౌలర్లు సైతం ఉత్సాహంతో కదం తొక్కారు. 16 ఓవర్లలో ఆస్ట్రేలియాను 52/4తో పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. భారీ ఛేదనలో టాప్ ఆర్డర్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఇక కోలుకోవటం అసాధ్యమే అనిపించింది. ఆస్ట్రేలియా రికార్డు విజయాలకు టీమ్ ఇండియా బ్రేక్ వేయటం లాంఛనమే అనుకున్నారు. కానీ స్పిన్నర్ల ప్రభావలేమిని సొమ్ము చేసుకున్న బెత్ మూనీ (125 నాటౌట్, 133 బంతుల్లో 12 ఫోర్లు), తహ్లియ (74, 77 బంతుల్లో 9 ఫోర్లు) రికార్డు లక్ష్యాన్ని ఛేదించారు. ఆఖరు ఓవర్ థ్రిల్లర్‌లో మిథాలీసేనకు షాకిచ్చారు. రెండో వన్డేలో ఆస్ట్రేలియా అమ్మాయిలు 5 వికెట్ల తేడాతో గెలుపొందారు. వన్డే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్నారు. నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జరుగనుంది.
మూనీ సంచలనం! : ఆస్ట్రేలియా లక్ష్యం 275 పరుగులు. మహిళల వన్డేల్లో ఇది రికార్డు ఛేదన. అలీసా హీలీ (0), మెగ్ లానింగ్ (6), ఎలిసీ పెర్రీ (2), గార్డ్నర్ (12)లను భారత్ ఆరంభంలోనే వెనక్కి పంపించింది. 52/4తో ఆస్ట్రేలియా ఓటమి కోరల్లో చిక్కుకుంది. నిజానికి తొలి 25 ఓవర్లలోనే మ్యాచ్ భారత్ వశమైంది. బంతి పేసర్ల నుంచి స్పిన్నర్లకు అందటంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. దీప్తి శర్మ (9 ఓవర్లలో 60 పరుగులు), పూనమ్ యాదవ్ (6 ఓవర్లలో 38 పరుగులు)లపై పరుగులు పిండుకున్న బెత్ మూనీ, తహ్లియ మెక్‌గ్రాత్ జోడీ నెమ్మదిగా భారత్‌పై ఒత్తిడి పెంచింది. ఈ జోడీ ఐదో వికెట్‌కు 126 పరుగులు జోడించింది. తొమ్మిది ఫోర్లతో 77 బంతుల్లో 74 పరుగులు చేసిన తహ్లియ నిష్క్రమించినా.. బెత్ మూనీకి నికోల కేరీ (39 నాటౌట్, 38 బంతుల్లో 2 ఫోర్లు) జత కలిసింది. ఈ జంట ఆరో వికెట్‌కు అజేయంగా 97 పరుగులు జోడించారు. 12 ఫోర్లతో చెలరేగిన బెత్ మూనీ.. 133 బంతుల్లో అజేయంగా 125 పరుగులు పిండుకుంది. చివరి ఓవర్లో ఆసీస్‌కు 12 పరుగులు అవసరం కాగా.. సీనియర్ సీమర్ జులన్ గోస్వామి భారత్‌ను విజేతగా నిలుపలేదు. ఉత్కంఠ పరిస్థితుల్లో వికెట్ కీపర్ తడబాటు, గోస్వామి నో బాల్ భారత్‌కు విజయాన్ని దూరం చేశాయి. చివరి బంతికి రెండు పరుగులు సాధించిన మూనీ.. ఆస్ట్రేలియాకు వరుసగా 26వ వన్డే విజయాన్ని కట్టబెట్టింది.
మంధాన మెరుపుల్ : తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన (86, 94 బంతుల్లో 11 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చింది. షెపాలీ వర్మ (22, 23 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి 74 పరుగులు జోడించిన మంధాన.. రిచా ఘోష్ (44, 50 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 76 పరుగులు చేసింది. మంధాన మెరుపులతో భారత్ సిరీస్‌లో తొలిసారి మెరుగైన ప్రదర్శన చేసింది. కెప్టెన్ మిథాలీరాజ్ (8), యస్టికా భాటియా (3) నిరాశపరిచినా.. ఆఖర్లో దీప్తి వర్మ (23), పూజ (29), జులన్ గోస్వామి (28 నాటౌట్) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌కు 274 పరుగుల భారీ స్కోరు అందించారు. ఆసీస్ బౌలర్లలో తహ్లియ మెక్‌గ్రాత్ (3/45), సోఫీ (2/28) రాణించారు.
స్కోరు వివరాలు :
భారత్ : 274/7 (స్మృతీ మంధాన 86, రిచా ఘోష్ 44, తహ్లియ మెక్‌గ్రాత్ 3/45, సోఫీ మోలినెక్స్ 2/28)
ఆస్ట్రేలియా : 275/5 ( బెత్ మూనీ 125 , తహ్లియ మెక్‌గ్రాత్ 74, మేఘ్న సింగ్ 1/38, గోస్వామి 1/40)