Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌తో భారత్ మూడో వన్డే నేడు
- ఉదయం 5.35 నుంచి సోనీనెట్వర్క్లో..
మకారు (క్వీన్స్లాండ్) : ఒక్క నో బాల్.. భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డేను నామమాత్రం చేసింది. ఒక్క నో బాల్.. ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా రికార్డు విజయానికి అడ్డుపడింది. నరాలు తెగే ఉత్కంఠకు దారితీసిన రెండో వన్డేలో భారత అమ్మాయిలు అనూహ్య పరాజయం చవిచూసినా.. నామమాత్రపు చివరి వన్డేలో కాసింత ఉత్సాహంతోనే బరిలోకి దిగుతున్నారు. ఇన్నాండ్లూ వేధించిన బ్యాటింగ్ లైనప్ వైఫల్యం రెండో వన్డేలో సమసిపోయింది. స్మృతీ మంధాన ఫామ్‌లోకి వచ్చింది. షెఫాలీ వర్మ టచ్‌లో ఉంది. మిథాలీరాజ్ వరుస అర్థ సెంచరీలతో జోరుమీదుంది. యువ వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అంచనాలను అందుకోవటంలో ముందు నిలుస్తుంది. దీంతో నేడు మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.
మరోవైపు ఆస్ట్రేలియా విజయ జైత్రయాత్రను మరింత మెరుగుపర్చుకోవటంపై దృష్టి నిలిపింది. రెండో వన్డేలో దాదాపుగా ఓటమి ఖాయమైన దశలో ఓపెనర్ బెత్ మూనీ అసమాన అజేయ శతక ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాను నిలబెట్టింది. వరుసగా 26వ వన్డే విజయాన్ని అందుకుంది. బ్యాట్‌తో మెరుగైన టీమ్ ఇండియాను నిలువరించటం ఇక అంత సులువు కాదనే విషయం ఆసీస్ అమ్మాయిలకు అర్థమైంది. నేడు కంగారూ అమ్మాయిలు మెరుగైన ప్రణాళికతో బరిలోకి దిగనున్నారు. క్లీన్‌స్వీప్‌పై ఆస్ట్రేలియా కన్నేసినా.. మిథాలీసేన సిరీస్‌ను విజయంతో ముగించాలని చూస్తోంది.